వ‌ణుకుతున్న యూర‌ప్‌.. ర‌ష్యా నుంచి చ‌మురు దిగుమ‌తులు లేక‌పోవ‌డంతో ఇబ్బందులు

జ‌ర్మ‌నీ నుంచి యూకే వ‌ర‌కు ప్ర‌తి దేశం మంచు దుప్ప‌టిలోకి వెళ్లిపోవ‌డంతో యూర‌ప్ వ‌ణికిపోతోంది

  • Publish Date - November 29, 2023 / 09:19 AM IST

విధాత‌: జ‌ర్మ‌నీ నుంచి యూకే వ‌ర‌కు ప్ర‌తి దేశం మంచు దుప్ప‌టిలోకి వెళ్లిపోవ‌డంతో యూర‌ప్ (Europe Shivers) వ‌ణికిపోతోంది. ఎక్క‌డిక‌క్క‌డ అధికారులు పౌరుల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని సూచిస్తున్నారు. ర‌ష్యా ఉక్రెయిన్ యుద్ధం మొద‌లైన త‌ర్వాత ర‌ష్యా నుంచి చ‌మురు దిగుమ‌తులను యూర‌ప్ త‌గ్గించుకున్న విష‌యం తెలిసిందే.


దీంతో వ‌రుస‌గా రెండో శీతాకాలం సైతం చ‌లితో ఈ దేశాలు పోరాడాల్సి ఉంటుంది. యూకే (UK) లో అధికారులు ఇప్ప‌టికే ఎల్లో అల‌ర్ట్‌ను జారీ చేశారు. ప‌రిస్థితులు ప్ర‌మాద‌క‌రంగా ఉన్నాయ‌ని.. సూచ‌న‌లు పాటించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. జ‌ర్మ‌నీ (Germany) రాజ‌ధాని బెర్లిన్‌లో ఉష్ణోగ్ర‌త‌లు మైన‌స్ 4.5 డిగ్రీలకు ప‌డిపోవ‌చ్చ‌ని అంచ‌నాలున్నాయి.


హెల్సింకిలో ఇప్ప‌టికే మైన‌స్ 8 డిగ్రీల ఉష్ణోగ్ర‌త రికార్డ‌యింది. అలాగే ప్ర‌ధాన న‌గ‌రాల్లో సైతం 20 సెం.మీ. వ‌ర‌కు మంచు కుర‌వొచ్చ‌ని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. స్కాట్లాండ్‌లోని కొన్ని ప్రాంతాలు, ఇంగ్లాండ్‌లోని ఈశాన్య ప్రాంతాలు, లండ‌న్‌ (London) లో కూడా మంచు వ‌ర్షం కురిసే అవ‌కాశ‌ముంది. అయితే వేస‌వి త‌ర్వాత కాస్త ఆల‌స్యంగా శీతాకాలం రావ‌డంతో.. ఇక్క‌డి దేశాలు గ్యాస్‌ను భారీగానే నిల్వ చేసుకున్నాయి.


ప్ర‌స్తుతానికి అయితే ఎలాంటి స‌మ‌స్యా లేద‌ని.. కానీ ఇదే ప‌రిస్థితి ఎక్కువ రోజులు ఉంటే ఇంధ‌న కొర‌త ఏర్ప‌డే ప్ర‌మాద‌ముంద‌ని అధికారులు తెలిపారు. యూర‌ప్‌లో ప్ర‌తి ఇంటిలో గ్యాస్‌తో ప‌నిచేసే హీట‌ర్లు ఉంటాయి. శీతాకాలంలో వీటి వాడ‌కం త‌ప్ప‌నిస‌రి. కాబ‌ట్టి ప్ర‌తి శీతాకాలానికి ప్ర‌భుత్వాలు గ్యాస్ నిల్వ‌ల‌ను అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది.


కొన్ని వాతావ‌ర‌ణ సంస్థ‌లు డిసెంబ‌ర్ మొత్తం ఇదే ప‌రిస్థితి ఉంటుంద‌ని చెబుతుండ‌గా.. మ‌రికొన్ని డిసెంబ‌రు 6 నుంచి ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నాయి. ఏది ఏమైన‌ప్ప‌టికీ డిసెంబ‌రు మొద‌టి వారం వ‌ర‌కు ఇదే ప‌రిస్థితి ఉండ‌టం ఖాయం. ర‌ష్యా స‌రిహ‌ద్దుల్లో ఉండే తూర్పు యూర‌ప్‌లోనూ ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఇక్క‌డి మాల్దోవా దేశంలో మంచు బారిన ప‌డి ముగ్గురు మృతి చెందారు.


ఇక్క‌డు ఉష్ణోగ్ర‌త‌లు మైన‌స్ 9 డిగ్రీలు ఉండ‌టంతో జ‌న‌జీవ‌నం స్తంభించింది. రొమానియాలో మంచు గాలులు గంట‌కు 100 కి.మీ. వేగంతో వీస్తుండ‌టంతో రెడ్ అల‌ర్ట్ జారీ చేశారు. ఈ గాలుల‌తో రొమానియా, బ‌ల్గేరియాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. చాలా మందికి విద్యుత్ అంద‌క‌పోవ‌డంతో.. గ్యాస్ హీట‌ర్లు ప‌నిచేయ‌క ప్ర‌మాద‌క‌ర స్థితిలో జీవిస్తున్నారు. బ‌ల్గేరియాలో ఇద్ద‌రు మృతి చెంద‌గా.. ఆ దేశం ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించింది.

Latest News