Evil Nurse |
విధాత: అప్పుడే పుట్టిక పసికందులను కంటికి రెప్పలా కాచుకుంటూ వారిని సంరక్షించాల్సిన నర్సే.. వారి పాలిట మృత్యువుగా మారింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు శిశువులను పొట్టనపెట్టుకున్న ఆమె (Evil Nurse) ను కోర్టు దోషిగా గుర్తించింది. ఆ నరహంతకురాలి పేరు లూసీ లెబ్టీ (33). ఆమె నర్సుగా పనిచేసిన వాయవ్య ఇంగ్లాండ్ (England) లోని నియోనాటల్ యూనిట్‌లో 2015-16 ల మధ్య ఈ ఘోరాలు జరిగాయి. ఆమె చంపిన వారిలో ఐదుగురు మగశిశువులు, ఇద్దరు ఆడశిశువులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
మాంచెస్టర్ టౌన్‌కోర్టులో 10 నెలల పాటు ఈ కేసు విచారణ సాగింది. లూసీ పిల్లలకు పాలు, నీరు బలవంతంగా ఇవ్వడం, వారికి ఇన్సులిన్ ఇంజక్షన్లు, గాలితో నిండిన ఇంజక్షన్లు ఇవ్వడం ద్వారా ప్రాణాలను తీసిందని ప్రాసిక్యూషన్ వాదించింది. అంతే కాకుండా వారిని చంపేమందు .. రకరకాలుగా హింస పెట్టిందని కోర్టుకు నివేదించింది. నేను వారిని చంపేశాను. ఎందుకంటే వారిని సంరక్షించడానికి నేను సరిపోను అని రాసి ఉన్న లూసీ ఇంట్లో రాసి ఉన్న నోటును పోలీసులు గుర్తించారు.
అందులో.. నేను ఒక భయంకరమైన వ్యక్తిని, నేను సాతానును.. నేనే ఇది చేశా అని రాసి ఉన్న నోట్లూ ఆమె ఇంట్లో దొరికాయి. పుట్టినప్పుడే పలు సమస్యలతో బాధపడుతున్న శిశువులను ఉంచే వార్డులో లూసీ పనిచేసేది. అయితే వారి మధ్యనే ఒక క్రూరమృగం తిరుగుతోందని ఆ ఆసుపత్రి సిబ్బంది ఊహించలేదు అని పాస్కలే జోన్స్ అనే సీనియర్ న్యాయవాది పేర్కొన్నారు. ఈ కేసులో ఆమెకు జీవిత ఖైదు పడే అవకాశముందని తెలుస్తోంది.
ఇలా బయటపడింది…
కారణం లేకుండా వరుస మరణాలు చోటుచేసుకుంటుండటంతో అక్కడి వైద్యులకు అనుమానం వచ్చింది. వారికి ఎటువంటి వైద్యపరమైన కారణాలూ కనిపించకపోవడంతో మరింత లోతుకు వెళ్లి పరిశీలించారు. అలా చూడగా.. శిశువులు చనిపోయిన ప్రతి సందర్భంలోనూ ఉన్న నర్సు లూసీపై| వారి దృష్టి పడింది.
దీంతో 2017లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో ఆమె ఇంటిని చూడగా వారికి పలు విస్తుబోయే విషయాలు తెలిశాయి. ఆమె చంపాలనుకున్న ప్రతి శిశువు వైద్య నివేదికలు ఆమె రాసిపెట్టుకుని ఉంది. అంతే కాకుండా ఆ శిశువు తల్లిదండ్రుల వివరాలు, వారి స్థితిగతులను సేకరించింది. వీటన్నింటినీ కోర్టుకు పోలీసులు సమర్పించారు.
నేనే పాపమూ చేయలేదు..
అయితే ఇన్నేళ్ల కాలంలో లూసీ ఎప్పుడూ .. తాను శిశువులను చంపినట్లు ఒప్పుకోకపోవడం గమనార్హం. కోర్టులో దోషిగా నిర్ధరణ అయిన తర్వాత కూడా.. తాను 14 రోజుల్లో సాక్ష్యాధారాలు సమర్పిస్తానని.. తాను ఈ హత్యలు చేయలేదని కోర్టుకు తెలిపింది. ఆస్పత్రి యాజమాన్యం తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి తనపై నింద వేశారని పేర్కొంది.
అక్కడ ఉండే మురికి పరిసరాలు, కలుషిత నీరు వల్ల శిశువులు చనిపోయి ఉండొచ్చని చెప్పడం గమనార్హం. అయితే ఆమె హత్యల వెనుక ఉన్న ప్రధానమైన కారణాన్ని
పోలీసులు కూడా కనుగొనలేకపోయారు. లూసీ జీవితం అందరి యువతుల్లాగే సాధారణంగా ఉందని.. ఈ హత్యలు ఎందుకు చేసిందో లూసీ మాత్రమే చెప్పగలదని కేసు దర్యాప్తు చేసిన పోలీసులు వెల్లడించారు.
భారత సంతతి వైద్యుడి కృషితో..
నిందితురాలు లూసీ కుట్రను గుర్తించిన కొద్ది మంది వైద్యుల్లో భారత సంతతికి చెందిన చిన్నపిల్లల వైద్యుడు డా.జయరామ్ ఒకరు. ఈయన లూసీకి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం కూడా చెప్పారు. చిన్నపిల్లలకు ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నా.. ఆమె అలా చూస్తూ ఉండేదని.. ఏ చర్యా తీసుకునేది కాదని ఆయన కోర్టుకు వెల్లడించారు. ఆ శిశువులు లూసీ బారిన పడకుండా ఉంటే వారు ఈ పాటికి స్కూళ్లకు వెళ్లేవారని ఓ ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకున్నారు.