CONGRESS | అనూహ్యంగా పెరుగుతున్న కాంగ్రెస్ గ్రాఫ్‌

CONGRESS | ఇప్పటికీ 40% ఓట్లతో స్థిరంగా ఉన్న BRS 24% నుంచి 34 శాతానికి పెరిగిన కాంగ్రెస్ దారుణంగా ప‌డిపోయిన BJP ప్రభావం BJP ఓటు షేరు మొత్తం కాంగ్రెస్‌కు షిప్ట్‌! తెలంగాణపై స‌ర్వేల్లో ఆసక్తి రేపుతున్న నిజాలు BJP-BRS మధ్య లోపాయికారి డీల్‌పై కాంగ్రెస్‌ విమర్శలను విశ్వసిస్తున్న ప్రజలు! కవిత ఎపిసోడ్‌తో ఓటర్లలో అనుమానాలు బండి నాయకత్వంపై కుదరని నమ్మకాలు BRS వ్యతిరేకుల చూపు కాంగ్రెస్‌ వైపు? విధాత ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ‌లో కాంగ్రెస్ […]

  • Publish Date - June 23, 2023 / 12:06 PM IST

CONGRESS |

  • ఇప్పటికీ 40% ఓట్లతో స్థిరంగా ఉన్న BRS
  • 24% నుంచి 34 శాతానికి పెరిగిన కాంగ్రెస్
  • దారుణంగా ప‌డిపోయిన BJP ప్రభావం
  • BJP ఓటు షేరు మొత్తం కాంగ్రెస్‌కు షిప్ట్‌!
  • తెలంగాణపై స‌ర్వేల్లో ఆసక్తి రేపుతున్న నిజాలు
  • BJP-BRS మధ్య లోపాయికారి డీల్‌పై
  • కాంగ్రెస్‌ విమర్శలను విశ్వసిస్తున్న ప్రజలు!
  • కవిత ఎపిసోడ్‌తో ఓటర్లలో అనుమానాలు
  • బండి నాయకత్వంపై కుదరని నమ్మకాలు
  • BRS వ్యతిరేకుల చూపు కాంగ్రెస్‌ వైపు?

విధాత ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ‌లో కాంగ్రెస్ అనూహ్యంగా ఓటు బ్యాంకును సంపాదించుకుంటోంది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫలితాల త‌రువాత ప‌ది శాతం ఓట్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన‌ట్లు తాజా స‌ర్వేల్లో వెల్లడైంది. విచిత్రంగా బీఆరెస్‌ ఓటు బ్యాంకు మాత్రం 40 శాతం వ‌ద్ద ప్రస్తుతానికి స్థిరంగా ఉంది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌కు ముందు బలంగా కనిపించిన బీజేపీ ఓటు బ్యాంకు మాత్రం దారుణంగా ప‌డిపోయింది. ఇదంతా కాంగ్రెస్‌ వైపు ఏకీక‌ర‌ణ జ‌రుగుతోంది.

BJP- BRS మ‌ధ్య లోపాయికారి ఒప్పందం ఉంద‌ని, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు BRS నుంచి పెద్ద ఎత్తున నిధులు అందాయ‌ని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని జ‌నం విశ్వసించిన‌ట్లు క‌నిపిస్తోంది. తెలంగాణ బీజేపీలో బండి సంజ‌య్ నాయ‌క‌త్వంతో పెద్దగా ఉప‌యోగం లేద‌ని కూడా ఈ సర్వేలో ప‌లువురు ఓట‌ర్లు అభిప్రాయ‌ప‌డిన‌ట్లు సర్వే నిపుణులు చెబుతున్నారు.

మద్యం స్కాంలో క‌విత‌ను అరెస్టు చేయ‌క‌పోవ‌డంతో బిజేపీ- బీఆరెస్‌లు క‌లిసిపోయాయ‌నే సంకేతాలు గ్రామీణ ఓటర్లదాకా వెళ్లినట్టు నిపుణులు చెబుతున్నారు. అందుకే బీఆరెస్‌ను, కేసీఆర్ కుటుంబాన్ని వ్యతిరేకిస్తున్న శ‌క్తుల‌న్నీ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌వైపు చూస్తున్నట్లు స‌ర్వేల్లో స్పష్టంగా తెలుస్తున్నది.

ఆరు నెల‌లుగా అనూహ్య మార్పు!

2023 జ‌న‌వ‌రి- ఫిబ్రవ‌రి నెల‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్ వైపు 24 శాతం ఓటర్లు, బీజేపీ వైపు 13 శాతం ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు సర్వేల్లో వెల్లడైంది. జూన్‌ మొద‌టి వారంలో చేసిన స‌ర్వేల్లో మాత్రం కాంగ్రెస్ ఓటు బ్యాంకు 34 శాతానికి చేరుకోగా, బీజేపీ ఓట్ల శాతం 7కు పడిపోయిందని సర్వేలు చేస్తున్న నిపుణుడు ఒకరు చెప్పారు. ప్రస్తుతం బీఆరెస్‌ ఓటు బ్యాంకు స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ ఎన్నికలు సమీపించే కొద్దీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకీకరణ జరిగితే పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు ఉన్నట్టు ఆయన చెప్పారు.

‘BRS ప‌దేళ్లపాటు తెలంగాణ‌లో అధికారంలో ఉంది. కాబ‌ట్టి ప్రభుత్వ వ్యతిరేక‌త ఏర్పడడం అన్నది స‌ర్వ సాధార‌ణం. సర్వేలలో పది శాతం మంది వరకు తమ అభిప్రాయాలు వెల్లడిచేయడానికి ఇష్టపడటం లేదు. వీరు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఫలితాలను బాగా ప్రభావితం చేయనున్నది. వారు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటరుగా మారితే మాత్రం రాజ‌కీయాల్లో పెను మార్పులు ఉంటాయ‌’ని సర్వే నిపుణుడు అభిప్రాయ‌ ప‌డ్డారు.

కుటుంబపాలనపై వ్యతిరేకత, కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్‌పై అవినీతి ఆరోపణలు, చాలాచోట్ల అభ్యర్థులపై విముఖత ఈసారి ఎన్నికల్లో కీలకం కానున్నాయి. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇంకా ఇతర నాయకుల చేరిక, బీజేపీ-బీఆరెస్‌ రాజీ వార్తల ప్రచారం తెలంగాణలో రాజకీయ ఏకీకరణను మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది.

‘నిన్నటి క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో జేడీఎస్ ఓట‌ర్లలో అధికశాతం మంది ఎలాగూ అధికారంలోకి రామ‌ని, బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో తమ ఓట్లను కాంగ్రెస్ పార్టీకి వేశారు. దాంతో క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ అనూహ్య విజ‌యం సాధించి, అధికారంలోకి వ‌చ్చింది. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వంపైన‌, కేంద్రం- బీఆరెస్‌ దోస్తీ అనుమానాల దృష్ట్యా బీజేపీ సానుభూతిప‌రులు కూడా జేడీఎస్ సానుభూతిప‌రుల్లాగా ఆలోచిస్తే మాత్రం తెలంగాణ‌లో కాంగ్రెస్ విజయం వైపు అడుగులు వేసే అవకాశం ఉంది’ అని వివ‌రించారు. హైద‌రాబాద్ యూనివ‌ర్శిటీలో రాజ‌నీతి శాస్త్ర ప‌రిశోధ‌న విద్యార్థి ఒక‌రు అంచనా వేశారు.

‘ఈ పదేళ్ల అధికారం అంతా కేసీఆర్ కుటుంబం చుట్టూ తిరిగింది. వారి వ్యవ‌హార శైలి కూడా బీఆరెస్‌లో చాలామందికి న‌చ్చడం లేదు. ఇలా న‌చ్చని వాళ్లంతా చివ‌రిక్షణంలో పోలింగ్ బూతుకు రాక‌పోయినా, క్రాస్ ఓటింగ్ చేసినా ఆశ్చర్యం లేదు’ అని మాజీ ఐఏఎస్ అధికారి ఒక‌రు విశ్లేషించారు. ‘మొత్తంగా తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు వేగంగా మారుతున్నాయి. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉంది కాబ‌ట్టి కేసీఆర్ ఏదో ఒక వ్యూహం ప‌న్నుతారు. హ్యాట్రిక్ విజ‌యం సాధిస్తారు’ అని ఓ మాజీ పోలీసు అధికారి అభిప్రాయ‌ప‌డ్డారు.

2018లో కేసీఆర్‌కు క‌లిసొచ్చిన ముంద‌స్తు

మొత్తం 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేప‌ట్టాల‌న్నా మెజారిటీకి 60 సీట్లు కావాలి. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. 2018 ఎన్నిక‌ల్లో అధికార టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు రాష్ట్రంలోని నాలుగు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, టీజేఎస్, టీడీపీ, సీపీఐలు కలిసి మహా కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి.

కానీ మహా కూటమి మెజారిటీ సాధించలేక పోవ‌డంతో టీఆర్‌ఎస్‌ విజయం సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018లో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు, ఆయన తన పదవీకాలం పూర్తయ్యే తొమ్మిది నెలల ముందు 6 సెప్టెంబర్ 2018న రాజీనామా చేసి, ఎన్నికలకు వెళ్లారు.

మూడోసారి ఏమవుతుంది?

2018 తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికలలో 2,80,64,680 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్రక‌టించింది. ఇది 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఉన్న ఓటర్లు 2,81,65,885 కంటే త‌క్కువ‌. ఈ ఎన్నిక‌ల్లో నాటి టీఆరెస్‌ ప్రస్తుత బీఆరెస్‌ పార్టీకి 46. 87 శాతం ఓట్లు పోల‌య్యాయి. 88 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత ఆరు మాసాలకు 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం 41.29 శాతానికి పడిపోయింది.

2018లో అసెంబ్లీలో 25 స్థానాలు పెంచుకున్న బీఆరెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో 9 స్థానాలకు పరిమితం కావలసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో 28.43 శాతం ఓట్లు రాగా, లోక్‌సభ ఎన్నికల్లో 29.48 శాతం ఓట్లు పోల‌య్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 99 స్థానాల్లో పోటీ చేయ‌గా 19 స్థానాల్లో గెలుపొందింది.లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ౩ స్థానాలను గెలుపొందింది.

ఎంఐఎం మాత్రం 2.71 శాతం ఓట్లతో 7 స్థానాల్లో గెలుపొందింది. తెలుగుదేశంకు అసెంబ్లీ ఎన్నికల్లో 3.51 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తం 13 స్థానాల‌లో పోటీ చేసి రెండుచోట్ల గెలుపొందింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ మాత్రం ఈ ఎన్నిక‌ల్లో 118 స్థానాల్లో పోటీ చేసి 7.10 శాతం ఓట్లతో కేవ‌లం ఒక్క చోట మాత్రమే గెలిచింది. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం అసాధారణంగా పుంజుకుని 19.45 శాతం ఓట్లు నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుపొందింది.

2014లో 5 ఎమ్మెల్యే సీట్లు గెలుకున్న బీజీపీ ఈ ఎన్నిక‌ల్లో మ‌రో నాలుగు సీట్లు కోల్పోయింది. సీపీఎం, సిపిఐ, బిఎస్పీలు పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెల‌వ‌లేదు. ఇలా రెండుసార్లు వ‌రుస‌గా త‌న బ‌లాన్ని పెంచుకుంటూ వ‌చ్చిన బీఆరెస్‌ మూడోసారి అదే జోరు కొన‌సాగిస్తుందా? అన్న విశ్వాసం మాత్రం ఈసారి ఓట‌ర్లలో క‌నిపించ‌డం లేద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి.