ర‌హ‌దారిపై సంవ‌త్స‌ర కాలంగా న‌కిలీ టోల్ గేట్ నిర్వ‌హ‌ణ‌.. గుజ‌రాత్‌లో క‌ళ్లు చెదిరే మోసం

కొన్ని మోసాలు జ‌రిగిన తీరు చూస్తే.. మ‌న‌కు బుర్ర తిర‌గ‌క మాన‌దు. వంతెన‌లు, రైలు ఇంజిన్ల చోరీలు జ‌రిగిన‌పుడే ఔరా అనుకుని క‌ళ్లు తేలేశాం.

  • Publish Date - December 9, 2023 / 09:47 AM IST

విధాత‌: కొన్ని మోసాలు జ‌రిగిన తీరు చూస్తే.. మ‌న‌కు బుర్ర తిర‌గ‌క మాన‌దు. వంతెన‌లు, రైలు ఇంజిన్ల చోరీలు జ‌రిగిన‌పుడే ఔరా అనుకుని క‌ళ్లు తేలేశాం. తాజాగా గుజ‌రాత్ (Gujarat) లో జ‌రిగిన ఓ మోసం గురించి తెలిస్తే.. స్పృహ త‌ప్ప‌డం ఖాయం. ఒక నెల రెండు నెల‌లు కాదు.. ఏకంగా సంవ‌త్స‌రంన్న‌ర పాటు ఒక ర‌హ‌దారిపై న‌కిలీ టోల్‌గేట్ (Fake Toll Gate) నిర్వ‌హించిన ఘ‌ట‌న ఇది. ఈ సుదీర్ఘ కాలంలో ఒక్క‌సారి కూడా ప్ర‌భుత్వానికి కానీ, పోలీసులకు కానీ అనుమానం రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.


గుజ‌రాత్‌లోని బ‌మ‌న్‌బోరే – క‌చ్ ర‌హ‌దారిపై ఈ న‌కిలీ టోల్‌గేట్ ఉండ‌గా… దీనిని ప‌లువురు వ్య‌క్తులు క‌లిసి నిర్వ‌హిస్తున్న‌ట్లు కొన్ని వార్తా క‌థ‌నాలు పేర్కొన్నాయి. వీరంతా మార్బీ న‌గ‌రంలో ఉండే భూ స్వాముల‌ని.. సంవ‌త్సరంన్న‌రగా వీరంతా టోల్ వ‌సూలు చేస్తూ భారీ ఆర్థిక మోసానికి పాల్ప‌డ్డార‌ని వెల్ల‌డించాయి.  టోల్ వ‌సూలు చేయ‌డానికి కొన్ని వాహ‌నాలను ఈ దుండ‌గులు ప్రధాన ర‌హ‌దారి నుంచి దారి మ‌ళ్లించేవార‌ని జిల్లా క‌లెక్ట‌ర్ జీటీ పాండ్యా వెల్ల‌డించారు.


పోలీసుల‌ను టోల్‌గేట్ వ‌ద్ద‌కు పంపించామ‌ని.. లోతుగా ద‌ర్యాప్తు  చేస్తామ‌ని ఆయ‌న అన్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి టోల్‌గేట్ ఉన్న స్థ‌లం  వైట్‌హౌస్ సిరామిక్ అనే కంపెనీది కావ‌డంతో దాని య‌జ‌మాని అమ‌ర్షి ప‌టేల్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.  హ‌ర్వివిజ‌య్ సింగ్ ఝ‌లాచ యువ‌రాజ్ సింగ్ ఝ‌లా, వ‌న్‌రాజ్ సింగ్ ఘ‌లా, ధ‌ర్మేంద్ర సింగ్ ఝ‌లా అనే వ్యక్తుల పేర్ల‌నూ ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.


కాగా.. వీరు సుమారు రూ.75 కోట్ల‌ను వ‌సూలు చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నా.. అధికారులు ఇంకా స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. ద‌ర్యాప్తు త‌ర్వాతే ఆ మొత్తం నిర్ధార‌ణ అయ్యే అవ‌కాశ‌ముంది. గతంలో గుజ‌రాత్‌లోనే  ఓ వ్య‌క్తి న‌కిలీ ప్ర‌భుత్వ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేశాడు. మూడేళ్లు పాటు జ‌రిగిన ఈ  మోసంలో అత‌డు సుమారు రూ.నాలుగు కోట్ల‌ను సామాన్యుల నుంచి వివిధ సేవ‌ల పేరిట సేక‌రించాడు. అత‌డు అరెస్టు అయిన త‌ర్వాత ఆ త‌రహా ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి.