విధాత: బీహార్‌లోని జిల్లా కేంద్రం బక్సర్ రైతుల ఆందోళనలతో దద్దరిల్లుతున్నది. వేలాదిగా రైతులు రోడ్లపైకి వచ్చి పోలీస్ దమనకాండకు నిరసనగా పోలీస్ వాహనాలకు నిప్పుపెట్టారు. రైతుల ఆగ్రహావేశాలకు అనేక పోలీసు వాహనాలు కాలిబూడిదయ్యాయి.
ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టడం కోసం పోలీసులు ఆరు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. రైతుల ఉద్యమం, పోలీసుల ప్రతిచర్యలతో బక్సర్ పట్టణం తీవ్ర ఉద్రిక్తతల్లో మునిగిపోయింది.
బీహార్ ప్రభుత్వం చౌసా పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం రైతుల నుంచి పెద్ద ఎత్తున భూమి సేకరించింది. ఆ భూమికి 12 ఏండ్ల కిందటినాటి రేటును పరిహారంగా ప్రకటించింది. దాన్ని సవరించి తాజా రేట్ల ప్రకారం.. తాము కోల్పోయిన భూమికి పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
गुस्से में है बक्सर के किसान, मंगलवार रात पुलिस ने घर में घुसकर महिलाओं-पुरुषों के साथ ही बच्चों पर बर्बरतापूर्वक लाठियां बरसाईं थीं। अब नाराज किसानों ने आक्रोश व्यक्त करते हुए पुलिस की गाड़ियों को आग के हवाले कर दिया है।#Buxar #Bihar pic.twitter.com/5guJosOFc5
— Bihar Tak (@BiharTakChannel) January 11, 2023
దీనికోసం గత కొన్ని రోజులుగా రైతులు పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చౌసా థర్మల్‌ప్లాంట్ పరిసర గ్రామాల ప్రజలు వారం పది రోజులుగా ఉద్యమిస్తున్నారు. పవర్ ప్లాంట్ ఎదుట, జిల్లా కేంద్రం బక్సర్‌లో రైతులు ఆందోళన చేస్తున్నారు.
ఉద్యమాన్ని అణిచివేసేందుకు పోలీసులు గత మంగళవారం రాత్రి రైతుల ఇండ్లపై దాడి చేశారు. పదుల సంఖ్యలో రైతుల ఇండ్లల్లో చొరబడి మహిళలు, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా తీవ్రంగా కొట్టారు. పోలీసులు చేసిన ఈ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీంతో పోలీసుల తీరుపై బీహార్ రాష్ట్రమంతటా రైతులు తీవ్రంగా నిరసిస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతుల ఇండ్లపై రాత్రి వేళ పోలీసులు దాడి చేయటాన్ని ఖండిస్తున్నారు. రైతుల న్యాయమైన డిమాండ్ ను తీర్చాలని కోరుతున్నారు. రైతుల ఇండ్లపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.