విధాత, నిజామాబాదు: కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ధర్నాలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
మాస్టర్ ప్లాన్ లో తమ భూములు పోతున్నాయని తీవ్ర మనోవేదనకు గురైన అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ రైతు పయ్యావుల రాములు బుధవారం ఆత్మహత్యకు పాల్పడగా రైతులు నిరసన వ్యక్తం చేశారు. మరుసటి రోజు రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
మాస్టర్ ప్లాన్ లో రైతుల భూములను కుట్రపూరితంగా ఇండస్ట్రియల్ జోన్ లోకి తెచ్చారని రైతులు ఆరోపించారు. ఈ సందర్బంగా రైతులు ప్రభుత్వానికి, కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ బయటకు రావాలని బీజేపీ నాయకుడు ధర్నాలో మాట్లాడుతూ హెచ్చరించారు. ధర్నా కొనసాగుతోంది.
కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
కామారెడ్డి కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత… బారికేడ్లను తోసుకొని కలెక్టర్ కార్యాలయం గేట్ వద్దకు చేరుకొని మహిళలు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్బంగా పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట జరిగింది.
తోపులాటలో బారికేడ్లు తునకలు, తునకలు అయ్యాయి. ఐదుగురిని లోనికి అనుమతిస్తామని పోలీస్ అధికారులు చెప్పడంతో ఒక్కసారిగా రైతులు ఆగ్రహానికి గురై బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు.
కలెక్టర్ బయటకు వచ్చి వినతి పత్రం తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ధర్నాను ఉద్దేశించి బీజేపీ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు సుభాష్ రెడ్డి మాట్లాడారు. కలెక్టర్ కు 3 గంటల వరకు సమయం ఇచ్చారు. బయటకు రావాలని కోరారు.