MODI | మొత్తానికి.. మోడీ మాట్లాడారు!

MODI | మొత్తానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఎనిమిదేళ్ల కాలంలో మొట్టమొదటిసారిగా మీడియాను ఎదుర్కొన్నారు. పౌర సమాజం ఎంత కోరుతున్నా, మేధావులు ఎంత ప్రశ్నిస్తున్నా.. ప్రతిపక్షాలు ఎన్ని సవాళ్లు విసురుతున్నా.. మోదీ మాత్రం మీడియా ముందుకు రాలేదు. భయమో, అయిష్టతో, వారితో మాట్లాడేది ఏంటనే దర్పమో.. ఏదైతేనేం 8 ఏళ్లలో మీడియాతో మాట్లాడని మోదీ.. ఓపెన్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మీడియా ప్రశ్నలను ఎదుర్కొనే సందర్భం ఎట్టకేలకు వచ్చింది. వచ్చిందనడం కంటే తప్పలేదనుకోవాలేమో. అమెరికాను సందర్శించిన సమయంలో సంయుక్త […]

  • Publish Date - June 24, 2023 / 07:46 AM IST

MODI |

మొత్తానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఎనిమిదేళ్ల కాలంలో మొట్టమొదటిసారిగా మీడియాను ఎదుర్కొన్నారు. పౌర సమాజం ఎంత కోరుతున్నా, మేధావులు ఎంత ప్రశ్నిస్తున్నా.. ప్రతిపక్షాలు ఎన్ని సవాళ్లు విసురుతున్నా.. మోదీ మాత్రం మీడియా ముందుకు రాలేదు. భయమో, అయిష్టతో, వారితో మాట్లాడేది ఏంటనే దర్పమో.. ఏదైతేనేం 8 ఏళ్లలో మీడియాతో మాట్లాడని మోదీ.. ఓపెన్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మీడియా ప్రశ్నలను ఎదుర్కొనే సందర్భం ఎట్టకేలకు వచ్చింది.

వచ్చిందనడం కంటే తప్పలేదనుకోవాలేమో. అమెరికాను సందర్శించిన సమయంలో సంయుక్త మీడియా సమావేశాన్ని వైట్‌ హౌస్‌ నిర్వహిస్తుంది. ఎంపిక చేసిన కొద్ది మంది పాత్రికేయులను మాత్రమే ఆహ్వానిస్తారు. అడిగే ప్రశ్నలు కూడా చాలా తక్కువ ఉంటాయి. దీంతో మోదీ అనివార్యంగా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ను ఎదుర్కొనాల్సి వచ్చింది.

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ ‘ది డెవిల్స్‌ అడ్వొకేట్‌’ అనే కార్యక్రమంలో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న దృశ్యం ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది. ప్రఖ్యాత జర్నలిస్టు కరణ్‌థాపర్‌ చేసిన ఇంటర్వూలో ప్రశ్నలకు జవాబు చెప్పడానికి మోదీ ఇష్టపడలేదు. తనకు ఒంట్లో బాగోలేదని, చెప్పి.. ఓ గ్లాసుడు మంచినీళ్లు తాగి ఇంటర్వ్యూను మొదట్లోనే ముగించేసి వెళ్లిపోయారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆయన మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు.

అప్పుడప్పుడు ‘ఎంపిక చేసిన’ జర్నలిస్టులతోనో, సినీ ప్రముఖులతోనో (పీఎం మోదీ సినిమా విడుదల సందర్భంగా అక్షయ్‌ కుమార్‌తో) పిచ్చాపాటి ఇంటర్వ్యూలు, ముందే ఎంపిక చేశారని చెప్పే ప్రశ్నలకు సమాధానాలతో మమ అనిపించేసేవారు. లేదంటే రికార్డింగ్‌ సందేశాలు, రేడియోల్లో మన్‌కీ బాత్‌లు మన ముందుకు వస్తాయి.

గత లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినా.. అందులో మాట్లాడింది మాత్రం ఆయన నమ్మిన బంటు అమిత్‌షా! ప్రధానిగా ఉన్న ఈ అన్ని సంవత్సరాల్లో ఆయన మీడియాతో మాట్లాడేందుకు రావడం కంటే.. దేశ పర్యటనకు వచ్చిన ఇతర దేశాల నాయకులతో కలిసి ఫొటోలకు పోజులు ఇవ్వడానికే పరిమితమయ్యేవారు.

ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ ఉన్నప్పుడు ఆయన విదేశీ పర్యటనలు చేసినప్పుడల్లా ఆయనతోపాటు పాత్రికేయ బృందం ఒకటి వెళ్లేది. అప్పట్లో ఆన్‌బోర్డ్‌ అనే డేట్‌లైన్‌తో వివిధ పత్రికలు, వార్తా సంస్థలు మన్మోహన్‌తో వెళ్లేటప్పుడు, తిరిగి స్వదేశానికి వచ్చేటప్పుడు జరిపిన సంభాషణలను వార్తలుగా ఇచ్చేవి. వాస్తవానికి అనేక కీలక అంశాలను మన్మోహన్‌ ఆన్‌బోర్డ్‌ మీడియా సమావేశాల్లోనే వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కూడా అనేక కీలక అంశాలను ఆయన ఇలానే ప్రజలకు అందించారు.

రాష్ట్రంలో కేసీఆర్‌ మీడియా సమావేశాలకూ అంతే ప్రాముఖ్యం ఉండేది. సుదీర్ఘ ప్రసంగం ఉన్నప్పటికీ మీడియా ప్రశ్నలకు కూడా ఓపికగా సమాధానాలు ఇచ్చేవారు. కానీ.. మోదీ విషయంలో మాత్రం ఎన్నడూ అటువంటి ప్రెస్‌ కన్ఫరెన్స్‌లు కవర్‌ చేసే అదృష్టం భారతీయ మీడియాకు దక్కలేదు. ఒక విధంగా ఆయన ఈ విషయంలో మరెవ్వరూ బద్దలు కొట్టలేని రికార్డు సృష్టించారని చెప్పుకోవచ్చు.

ఎందుకంటే.. భారతదేశంలో ఏ ప్రధాని కూడా మీడియా సమావేశాలకు ఇంత దూరంగా లేరు.
మీడియా సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే మోదీ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లు నిర్వహించరని అప్పట్లో కాంగ్రెస్‌ నేత కపిల్‌సిబల్‌ వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం నిరంకుశ వైఖరి కారణంగానే మోదీ మీడియాతో మాట్లాడరని పేర్కొన్నారు. మీడియాను తాను నియంత్రించాలే తప్ప.. తనను మీడియా నియంత్రించడం ఏంటన్న భావన కావచ్చు.

సాధారణంగా రాజకీయ నాయకులు మీడియాతో అవసరమైనంత మేరకైనా సన్నిహితంగా ఉంటారు. కానీ.. మోదీ మాత్రం మీడియాను శత్రువుల్లా చూస్తారనే భావన ఉన్నది. ఎందుకంటే.. ప్రఖ్యాత జర్నలిస్టుల్లో చాలా మంది మోదీ విధానాలను వ్యతిరేకిస్తారు. ఆ భయంతోనే మోదీ మీడియాను దూరం పెడతారనే అభిప్రాయాలు ఉన్నాయి.

కానీ.. అమెరికాలో మాత్రం ఆయన మీడియా నుంచి తప్పించుకోలేక పోయారు. అసలే మీడియా సమావేశాల్లో పాల్గొనడం అలవాటు లేని మోదీ.. నేరుగా ప్రశ్నించడం అందులోనూ దేశంలో నానాటికీ పెరుగుతున్న అసహనం, మైనార్టీలపై దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనపై అడిగితే.. ఎలా?

Latest News