ఇటానగర్ : అరుణాచల్‌ప్రదేశ్‌లోని తిరప్ జిల్లాలో ఘోరం జరిగింది. ఓ సోషల్ ఈవెంట్‌కు వెళ్తున్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే యమ్‌సేన్ మేటిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. మాజీ ఎమ్మెల్యే యమ్‌సేన్ తన ముగ్గురు అనుచరులతో కలిసి మయన్మార్ బోర్డర్ సమీపంలో ఉన్న రహో గ్రామానికి బయల్దేరారు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు యమ్‌సేన్‌ను కిడ్నాప్ చేసి సమీప అడవుల్లోకి తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యేను తుపాకీతో కాల్చి చంపి మయన్మార్ వైపు పారిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఎస్సీఎన్ – కేవైఏ గ్రూపునకు చెందిన టెర్రరిస్టులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
2009లో యమ్‌సేన్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమెన్ అండ్ సోషల్ వెల్ఫేర్, సోషల్ జస్టిస్, ట్రైబల్ అఫైర్స్ శాఖలు నిర్వర్తించారు. 2015లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2024 ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న క్రమంలో.. యమ్‌సేన్ హత్యకు గురయ్యారు.