వెలుగులోకి మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అక్రమాలు

గత బీఆరెస్‌ ప్రభుత్వ హయాంలో బీహార్‌ బ్యాచ్‌గా విమర్శలకు గురైన కొందరు ఐఏఎస్‌ ఆఫీసర్లు.. మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబం ఆడించినట్లు ఆడి వారి అక్రమార్జనకు సహకరించారన్న

  • Publish Date - January 28, 2024 / 02:00 PM IST
  • భార్య పేరుతో 25.19 ఎకరాల భూముల కొనుగోలు
  • అ భూములన్నీ అక్రమార్జనలేనా?
  • సర్వీస్‌ రూల్స్‌కు విరుద్ధంగా కొనుగోలు!
  • లావాదేవీల తీరుపై అనేక సందేహాలు
  • భూములు కొన్నవారిలో పలువురు ఐఏఎస్‌లు, హెచ్‌వోడీ!
  • త్వరలో వారి చిట్టా కూడా బయటపెడతాం
  • సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలి
  • కాంగ్రెస్‌ నేత మన్నె నర్సింహారెడ్డి డిమాండ్‌

విధాత, హైదరాబాద్‌: గత బీఆరెస్‌ ప్రభుత్వ హయాంలో బీహార్‌ బ్యాచ్‌గా విమర్శలకు గురైన కొందరు ఐఏఎస్‌ ఆఫీసర్లు.. మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబం ఆడించినట్లు ఆడి వారి అక్రమార్జనకు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వారు కూడా వీలైనంత మేరకు నాలుగురాళ్లు వెనకేసుకున్నారన్న చర్చలు కూడా నడిచాయి. ఇప్పుడు వారి అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా మాజీ సీఎస్‌, ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన ధరణి పోర్టల్‌ సృష్టికర్త సోమేశ్‌కుమార్‌ అక్రమాస్తుల వ్యవహారం సంచలనం రేపుతున్నది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో సోమేశ్‌కుమార్‌ భార్య డాక్టర్‌ గ్యాన్ముద్ర పేరున ఖాతా నంబర్‌ 5237కింద 249/ఆ1 సర్వే నంబర్‌లో 8 ఎకరాలు, 249/ఆ2లో 10 ఎకరాలు, 260/ఆ/1/1 పరిధిలో 7 ఎకరాల 19 గుంటలు.. మొత్తం 25.19 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌ జరిగినట్లుగా తేలింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రిజిస్ట్రార్‌ ద్వారా ఈ భూముల రిజిస్ట్రేషన్‌ జరిగింది. ఈ భూములను సోమేశ్‌కుమార్‌ సీఎస్‌గా ఉన్నప్పుడు కొన్నారా, రెరా చైర్మన్‌గా ఉన్నప్పుడు కొన్నారా లేక ప్రభుత్వ సలహాదారు హోదాలో ఉన్నప్పుడు కొనుగోలు చేశారా? ధరణి పోర్టల్‌ రాక ముందు కొన్నారా? తర్వాత కొన్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది. నిజంగా ఆయన కొనుగోలు చేశారా? లేక ధరణి పోర్టల్‌ ద్వారా 5237 ఖాతాను సృష్టించి, తన పేరు మీదకు భూములను మళ్లించుకున్నారా? అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. అదీగాక సేల్‌ డీడ్‌ ద్వారా కొన్నారా? లేక సాదాబైనామా ద్వారా కొనుగోలు చేశారా? అన్నది కూడా తేలాల్సివుంది. సాదాబైనామా ద్వారా భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి ధరణి పోర్టల్‌ అండతో భార్య పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించి ఉండవచ్చన్న వాదన కూడా వినిపిస్తున్నది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ను పరిశీలిస్తే కొనుగోలు చేసిన ఆధారాలు కనిపించకపోవడం గమనార్హం. ఐఏఎస్‌ల సర్వీస్‌ రూల్స్‌ను పర్యవేక్షించే ఢిల్లీలోని డీవోపీటీ అనుమతి లేకుండా సోమేశ్‌కుమార్‌ భూములు కొనుగోలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ధరణి మాయాజాలంతోనే కొట్టేశారా?

సోమేశ్‌ కుమార్‌ భార్య పేరున రిజిస్టర్‌ అయిన భూములపై సర్వే నంబర్‌ 249లో ధరణి పోర్టల్ రాకముందు ఈసీని పరిశీలిస్తే ఐదు క్రయవిక్రయాలు మాత్రమే ఉన్నాయి. అందులో సోమేశ్‌ కుమార్ కుటుంబ సభ్యుల పేర్లు లేవు. సర్వే నంబర్‌ 260లో క్రయవిక్రయాలు నాలుగే ఉన్నాయి. ఇందులో కూడా సోమేశ్‌ కుటుంబ సభ్యుల పేర్లు లేకపోవడం గమనార్హం. ఇకపోతే ధరణి పోర్టల్‌లో సోమేశ్‌కుమార్‌ భార్య పేరున ఉన్న భూముల ఖాతా నంబర్‌ 5237గా ఉన్నది. నిజానికి భూరికార్డుల ప్రక్షాళనకు ముందు 3వేల వరకే ఖాతాలున్నాయి. అలాంటప్పుడు మరికొన్ని నంబర్లు జంప్‌ చేసిమరీ 5237 ఖాతా నంబర్‌ ఎందుకు కేటాయించారన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ధరణి వచ్చాక భూములు కొనుగోలు చేసినట్లయితే ఖాతాల నంబర్‌ 60 వేలకు పైగా ఉండేందంటున్నారు. ఎందుకంటే ఇదే సర్వే నంబరులోని ఇతర పట్టాదారులకు 60 వేలకు పైగా ఖాతా నంబరు ఉంది. ఈ నేపథ్యంలో సోమేశ్‌కుమార్‌ భార్య పేరున ఉన్న భూములకు ప్రత్యేకంగా ఖాతా నంబరును సృష్టించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వారిద్దరూ ఒకేసారి రెరా చైర్మన్‌, డైరక్టర్లు

గతంలో సోమేశ్‌ కుమార్ రెరా చైర్మన్‌గానూ కొనసాగారు. అదే సమయంలో ఇటీవల ఏసీబీకి వందల కోట్ల అక్రమాస్తులతో పట్టుబడిన బాలకృష్ణ సైతం రెరా డైరెక్టర్‌గా పనిచేశారు. వీరిద్దరూ ఒకే సందర్భంలో రెరాలో కొనసాగడాన్ని కొందరు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. వారిద్దరూ భారీగా అక్రమాస్తులు కూడబెట్టి ఉండవచ్చన్న సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి. విస్తృత దర్యాప్తు చేస్తే వారి అవినీతి బయటపడవచ్చని భావిస్తున్నారు. గత బీఆరెస్‌ ప్రభుత్వ హయాంలో అనేకమంది అధికారులు సర్కారుకు తాబేదార్లుగా వ్యవహరించి భారీ ఎత్తున అక్రమాస్తులు కూడాబెట్టుకున్నారన్న ఆరోపణలు అడపాదడపా వినవస్తున్నాయి. ఇటీవల ఫార్ములా ఈ-రేస్‌ ఒప్పందంలో బీహార్‌కే చెందిన ఐఏఎస్‌ అరవింద్ కుమార్‌కు సర్కార్ మెమో కూడా జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా 50 కోట్ల రూపాయలు హెచ్ఎండీఏ నుంచి ఈ-రేస్‌ కోసం బదిలీ చేసిన తీరు వివాదాస్పదమైంది. ఇక నవీన్‌ మిట్టల్‌, జయేశ్‌ రంజన్‌ వంటి వారిపై కూడా భారీగా అవినీతి ఆరోపణలున్నాయి. పశుసంవర్ధక శాఖ, టూరిజం, నీటిపారుదల, రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖల అధికారులు పెద్ద ఎత్తున అప్పటి ప్రభుత్వంతో అంటకాగి అవినీతి దందాలో భాగమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.

సమాజం మేల్కొనాలి : మన్నె నర్సింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ధరణి భూ సమస్యల వేదిక కన్వీనర్

గత బీఆరెస్‌ ప్రభుత్వ హయాంలో బీహార్‌ ఐఏఎస్‌ ఆఫీసర్లతోపాటు పలువురు ఐఏఎస్‌లు, శాఖాధిపతులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తి అక్రమాస్తులను సంపాదించారు. అటువంటి అక్రమాలపై సమాజం మేల్కోవాలి. తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ, బీహార్‌ ఐఏఎస్‌ సోమేశ్ కుమార్.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో సర్వే నంబర్ 249, 260లలో తన భార్య పేరు మీద 25.19 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. ఈ విధంగా అక్రమ సంపాదనతో తెలంగాణలో వ్యవసాయ భూములను బీహారీ ఐఏఎస్ ఆఫీసర్లు కొనుగోలు చేసి, తెలంగాణలో ఉన్న భూములను అక్రమ ఆస్తుల రూపంలో కూడా పెట్టుకుంటున్నారు. ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ల మీద ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరికొంత మంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇదే పద్ధతిలో భూములు కొన్నారు. వాటి వివరాలు కూడా త్వరలో బహిరంగపరుస్తాం. విచిత్రమేమిటంటే ఈ భూముల కొనుగోలు వివరాలను మాజీ చీఫ్ సెక్రటర్ సోమేశ్‌ కుమార్ ఢిల్లీలోని డీవోపీటీకి అందించలేదు. ఇది కూడా నేరం. ఢిల్లీలో ఉన్న డీవోపీటీ నుంచి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఐఏఎస్‌లు భూములు కొనడం తప్పు. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అఫీసర్ల ఆస్తులపై నిఘా పెట్టాలి. అవినీతిని అరికట్టాలి. సోషల్ మీడియా ఇలాంటి విషయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి.