విధాత: కేరళ క్యాంపస్ ఫెస్ట్‌లో అపశృతి చోటుచేసుకున్నది. శనివారం రాత్రి తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో 64 మంది వరకు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. అయితే, ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు.
పోలీసులు, అధికారుల వివరాల ప్రకారం.. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT) వార్షికోత్సవం సందర్భంగా వర్సిటీ క్యాంపస్ ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో శనివారం రాత్రి ప్రముఖ గాయని నికితా గాంధీ మ్యూజికల్ షో ఏర్పాటు చేశారు. ఓపెన్-ఎయిర్ ఆడిటోరియంలోకి ప్రవేశం, నిష్క్రమణ కోసం ఒకే గేటును ఉపయోగించారు. నిర్వాహకులు పాస్‌లు ఉన్న వారిని బ్యాచ్‌లవారీగా లోపలికి అనుమతించారు. చాలా మంది స్థానికులు ఆడిటోరియం బయట గుమిగూడారు.
హఠాత్తుగా వర్షం కురవడంతో బయట వేచి ఉన్న వారంతా ఒక్కసారిగా ఓపెన్-ఎయిర్ ఆడిటోరియంలో పరుగులు తీశారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది. చాలామంది విద్యార్థులు మెట్లపై నుంచి జారి కిందపడిపోయారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు చనిపోయారు. గాయపడిన 64 మంది విద్యార్థులు వివిధ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
ఆడిటోరియం సామర్థ్యం కనీసం 1,000 అని, తొక్కిసలాట జరిగిన సమయంలో చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయని సీనియర్ పోలీసు అధికారి ఎంఆర్ అజిత్ కుమార్ తెలిపారు. సంఘటన జరిగినప్పుడు, కార్యక్రమం ప్రారంభం కాలేదు. ఆడిటోరియం నిండలేదు. అసలు ఈ ఘటన జరగకూడదు కానీ, వర్షం వచ్చినప్పుడు హఠాత్తుగా బయట ప్రజలు లోపలికి రావడం, మెట్లు ఎక్కే టప్పుడు ఒకరిపై మరొకరు పడటం వల్ల ప్రమాదం చోటుచేసుకున్నది.
మృతుల్లో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. వారిలో ఇద్దరు ప్రైవేట్, మిగిలిన ఇద్దరు ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే గేటును ఉపయోగించడం తొక్కిసలాటకు కారణమైందని పోలీసులు తెలిపారు.