అంత‌రిక్షంలో ఎక్కువ రోజులు గ‌డిపిన వ్య‌క్తిగా రికార్డు.. నేడు భూమిపైకి వ్యోమ‌గామి

  • Publish Date - September 27, 2023 / 09:01 AM IST

విధాత‌: అంత‌రిక్షం (Space) లో ఎక్కువ రోజులు గ‌డిపిన వ్యోమ‌గామి భూమికి చేరుకోనున్నారు. అమెరికా నాసా (NASA) కు చెందిన ఆస్ట్రోనాట్ లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ ఫ్రాంక్ రూబియో బుధ‌వారం (అమెరికా కాల‌మానం) అంత‌రిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌) నుంచి బ‌య‌లుదేరి భూమిపై దిగుతారు.


ర‌ష్యాకు చెందిన సూయ‌జ్ స్పేస్‌క్రాఫ్ట్‌లో మ‌రో ఇద్ద‌రు ర‌ష్య‌న్ కాస్మోనాట్‌ల‌తో క‌లిసి ఫ్రాంక్ రానున్నారు. వీరి అంత‌రిక్ష నౌక క‌జ‌క‌స్థాన్‌లోని ర‌ష్యా అధీనంలో ఉన్న లాంచ్‌ప్యాడ్‌లో దిగుతుంది. ఈ నేప‌థ్యంలో అంతరిక్ష కేంద్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువ రోజులు ఏక‌బిగిన గ‌డిపిన వ్యక్తిగా రూబియో నిలిచిపోనున్నారు.


అయితే.. ఆయ‌న నిర్దిష్టంగా గ‌త 371 రోజులుగా ఐఎస్ఎస్‌లో ఉంటూ ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో పాల్గొన్నారు. గ‌తంలో ఈ రికార్డు అమెరికాకే చెందిన మార్క్ వందే హూ పేరుతో ఉండేది. ఆయ‌న 355 రోజులు ఐఎస్ఎస్‌లో గ‌డ‌ప‌గా.. ఈ రికార్డును ఫ్రాంక్ బ‌ద్ద‌లుకొట్టారు. ఆర్మీలో ఫిజిషియ‌న్‌గా ప‌నిచేసే ఫ్రాంక్‌కు తెలివైన‌వాడిగా పేరుంది.


2017లో ఐఎస్ఎస్‌లో ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాస్‌ పోస్టు కోసం అప్లికేష‌న్లు ఆహ్వానించ‌గా 18000 మంది వ‌ర‌కు దీనికి పోటీ ప‌డ్డారు. వారిలో అనేక వ‌డ‌పోత‌ల అనంత‌రం ప్రాంక్‌కు ఐఎస్ఎస్‌కు వెళ్లే అవ‌కాశం ల‌భించింది. తొలుత ఆరు నెల‌ల మిష‌న్ కోస‌మే ఆయ‌న‌ను పంపించిన‌ప్ప‌టికీ.. అంత‌రిక్ష కేంద్రంలో కూలెంట్ లీక్ స‌మ‌స్య‌ను గుర్తించి దానిని స‌రి చేయ‌డానికి మిష‌న్‌ను పొడిగించారు.


భూమి మీద ఉప్పూ నిప్పూగా పోట్లాడుకునే అమెరికా, ర‌ష్యాలు అంత‌రిక్షంలో మాత్రం క‌లిసే ప‌నిచేస్తుండ‌టం విశేషం. ఉక్రెయిన్ అంశం కూడా వీరి ఉమ్మ‌డి ప్ర‌ణాళిక‌ల‌కు ఆటంకం క‌లిగించ‌లేదు. అంత‌రిక్షంలో ప‌రిశోధ‌న‌లు చేయ‌డానికి, అంత‌రిక్షకేంద్రం ప‌నితీరు మెరుగుప‌ర‌చ‌డానికి ర‌ష్యా అంత‌రిక్ష సంస్థ రోస్‌కొస్మాస్‌తో ప‌నిచేయ‌డం త‌ప్ప‌నిస‌రి అని నాసా ప‌లు మార్లు స్ప‌ష్టం చేసింది.