విధాత: తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం నేటి నుండి అమల్లోకి వచ్చింది. మహిళ లోక్కానికి ఈ పథకం సంతోషాన్ని ఇస్తున్నప్పటికీ ఆటో డ్రైవర్లకు మాత్రం ఆందోళన కలిగిస్తుంది. ఆటోలను నమ్ముకొని జీవనోపాధి పొందుతున్న తమ బతుకులు ప్రభుత్వం నిర్ణయంతో రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆటో వాలాలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఈ పరిణామంపై చర్చించి తమ భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునేందుకు ఈరోజు హైదరాబాద్ ఆటో యూనియన్లు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి.
కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటో యూనియన్లకు ప్రతి ఆటో డ్రైవర్ కు సంవత్సరానికి 12,000 ఆర్థిక సహాయం అందజేస్తామని, ఫిట్నెస్ చాలానాలను సంవత్సరానికి ఒకసారి సమీక్షించి సవరిస్తామని, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సామాజిక భద్రత కల్పిస్తామని, ప్రతి పట్టణంలో ఆటోనగర్ లను ఏర్పాటు చేస్తామని, పెండింగ్ లో ఉన్న అన్ని ట్రాఫిక్ చలానాలను 50% రాయితీతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. తమకు ఇచ్చిన హామీలపై ఆటో డ్రైవర్లు సంతోషంగా ఉన్నప్పటికీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తమ ఆదాయానికి గండి కొట్టిన తీరుతో ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకున్నట్లుగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ నిర్ణయంతో ఆటో డ్రైవర్లతో పాటు ఉబర్, ఓలా లలో క్యాబ్ లు నడిపించుకుని ఉపాధి పొందుతున్న వారి ఆదాయానికి కూడా గండిపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతుంది. అటు లోకల్ ట్రైన్లు.. మెట్రో ట్రైన్లలో సైతం మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గవచ్చు అని భావిస్తున్నారు