ఈ బస్సుల్లోనే రేప‌ట్నుంచి మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఏర్ప‌డ్డ కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేసే దిశ‌గా అడుగులు వేస్తోంది

  • Publish Date - December 8, 2023 / 11:21 AM IST

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఏర్ప‌డ్డ కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేసే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఆరు గ్యారెంటీల్లో ఒక‌టైన ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం ప‌థ‌కాన్ని సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా శ‌నివారం అసెంబ్లీ వేదిక‌గా ప్రారంభించ‌నున్నారు.


ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ ప‌థ‌కాన్ని ప‌చ్చ జెండా ఊపి ప్రారంభించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం అసెంబ్లీకి వెళ్లి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. ఆర్టీసీ బ‌స్సులో మ‌హిళా మంత్రులు, సీఎస్ శాంతి కుమారితో పాటు ప‌లువురు మ‌హిళా అధికారిణులు ప్ర‌యాణించ‌నున్నారు. ఇక ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణించే మ‌హిళ‌లు ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. మొత్తంగా రేప‌ట్నుంచి ఈ ప‌థ‌కం రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు కానుంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 


పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల మహాలక్ష్మి స్కీమ్‌ అమలులో భాగంగా నేడు శనివారం నుంచి మహిళలు, ఆడ పిల్లలకు ఉచిత బస్ ప్రయాణ వసతి పథకాన్ని అమలులోకి తెస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు రోడ్లు, భవనాలు, రవాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ. వాణి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఉచిత ప్రయాణ వసతిని పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో అనుమతించనున్నారు. మహిళ ప్రయాణికులు ప్రయాణించిన దూరం అనుసరించి ప్రభుత్వం ఆర్టీసీకి సదరు మొత్తాన్ని రీఎంబర్స్‌మెంట్ చేయనుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణ వసతి పథకంతో ఆర్టీసీకి రోజుకు కనీసంగా 4కోట్ల రాబడి తగ్గనుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు అంత మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం రీఎంబర్స్‌మెంట్ చేయడం ఎంతమేరకు సాధ్యమన్నది మునుముందు తేలనుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఆరు గ్యారంటీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్ ప్రయాణ వసతిని ప్రారంభించనున్నారు. త్వ‌ర‌లోనే మ‌హిళ‌ల‌కు మ‌హాల‌క్ష్మి స్మార్ట్ కార్డుల‌ను అందించ‌నుంది ప్ర‌భుత్వం. మొద‌టి వారం రోజుల పాటు ఎలాంటి గుర్తింపు లేకుండా మ‌హిళ‌లు ప్ర‌యాణించేందుకు ప్ర‌భుత్వం వెసులుబాటు క‌ల్పించింది.