ఫెమినిస్ట్, ఫ్రెంచ్ ప్రభుత్వంలో లింగ సమానత్వ శాఖ మంత్రిగా ఉన్న మార్లీన్ స్కాప్పా (Marlene Schiappa) తాజాగా మరో వివాదానికి తెర తీశారు. గ్లామర్, నగ్న చిత్రాల మ్యాగజైన్ ప్లేబాయ్ కవర్ పేజీపై హాట్‌గా కనిపించి.. కిక్కెక్కించారు. ఆ కిక్కుతోపాటు.. వివాదాల వేడి కూడా తోడై.. హాట్ టాపిక్‌గా మారింది. ఇదేం పని అని మితవాదులతోపాటు.. సహచర మంత్రులు, లెఫ్టిస్టులు, ఆఖరుకు ప్రధాని కూడా విమర్శలు గుప్పించినా.. ఇది మహిళా సాధికార ప్రకటన అంటూ ఆ విమర్శలను లైట్‌గా తీసుకున్నారు ఈ 40 ఏళ్ల మహిళా హక్కుల ఉద్యమకారిణి. ఆమె చర్యలతో తరచూ మితవాదులు కళ్లెర్ర చేస్తుంటారు. కానీ.. ఆమె మాత్రం డోంట్ కేర్ అన్నట్టు వ్యవహరిస్తుంటారు.
విధాత : ప్లేబాయ్ (Playboy) మ్యాగజైన్‌కు మహిళలు, స్వలింగ సంపర్కుల హక్కులతోపాటు.. గర్భస్రావాలపై ఫ్రెంచ్ మంత్రి మార్లీన్ స్కాప్పా (Marlene Schiappa) సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. దాదాపు 12 పేజీలను సదరు మ్యాగజైన్ ఈ ఇంటర్వ్యూకే కేటాయించింది. తన హాట్ ఫొటో కవర్‌పేజీపై రావడాన్ని స్కాప్పా సమర్థించుకున్నారు. తానేమీ దుస్తులు ధరించకుండా ఫొటోకు పోజులివ్వలేదని అన్నారు. ‘మహిళలు తమ శరీరాలకు సంబంధించి తాము కోరుకున్నది చేసే హక్కును రక్షించడం.. ప్రతి చోటా ప్రతి సమయంలోనూ’ అని ట్విట్టర్‌లో స్పందించారు. ‘తిరోగమనవాదులను, కపటబుద్ధి ఉన్నవారిని ఇబ్బంది పెట్టినా.. పెట్టకపోయినా.. ఫ్రాన్స్‌లో మహిళలు స్వేచ్ఛాజీవులు’ అని ఆమె పేర్కొన్నారు.
గుర్రుమంటున్న ప్రధాని, మంత్రులు
ప్లేబాయ్ కవర్‌పేజీపై ఆమె కనిపించడంపై మంత్రివర్గంలోని ఆమె సహచరులు గుర్రుమంటున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్ వివిధ రకాల ఆందోళనలు, నిరసన ప్రదర్శనలతో అట్టుడుకుతున్నది. ఈ సమయంలో ఆమె కొత్త చిక్కులు తెచ్చిపెట్టారని మండిపడుతున్నారు. డిజైనర్ డ్రస్ వేసుకుని గ్లామర్ మ్యాగజైన్ కవర్‌పేజీపై దర్శనమీయడం తప్పుడు సంకేతాలు పంపుతుందని అంటున్నారు. దేశానికి రెండో మహిళా ప్రధానిగా ఉన్న ఎలిజాబెత్ బోన్ (Elisabeth Borne) కూడా స్కాప్పా చర్య సముచితమైనది కాదని అన్నారు.
సమయం సందర్భం ఉండాలి కదా! : ఎంపీ సాంద్రీన్
గీన్స్ ఎంపీ, సహచర హక్కుల ఉద్యమకారిణి సాంద్రీన్ రూసో (Sandrine Rousseau) కూడా ఆమె చర్యను తప్పుపట్టారు. ఫ్రెంచ్ ప్రజలకు గౌరవం ఎక్కడ? అని ఆమె ప్రశ్నించారు. ‘మహిళలు తమ శరీరాలను ఎక్కడైనా ప్రదర్శించుకోవచ్చు. కానీ.. సామాజిక సందర్భం అంటూ ఒకటి ఉంటుంది’ అని ఆమె పేర్కొన్నారు.
స్కాప్పా.. సరైన మహిళ : ప్లేబాయ్
తమ మ్యాగజైన్ కవర్‌పేజీపై మార్లీన్ స్కాప్పా కనిపించడాన్నిప్లేబాయ్ కూడా సమర్థించుకున్నది. ప్లేబాయ్ మ్యాగజైన్‌కు ఫ్రెంచ్ మంత్రులతో ఆమె తగిన వ్యక్తి అని, ఎందుకంటే.. ఆమె మహిళల హక్కుల కోసం ఉద్యమిస్తున్నారని పేర్కొన్నది. తమ మ్యాగజైన్ వృద్ధ మగాళ్ల కోసం కాదని, స్త్రీవాదానికి అండగా నిలిచేదని స్కాప్పా అర్థం చేసుకున్నారని తెలిపింది. ప్లేబాయ్ బూతు పత్రిక కాదని, మేధోపరమైన, ట్రెండింగ్ అంశాల మేలు కలయిక అని పేర్కొన్నది. ఇప్పటికీ కొన్ని మహిళల నగ్న చిత్రాలు ఉంటున్నప్పటికీ అవి చాలా కొన్ని పేజీల్లో మాత్రమే ఉంటాయని తెలిపింది.
మహిళల హక్కుల కోసం కృషి
ఫ్రెంచ్ టీవీల్లో తరచూ కనిపించే స్కాప్పా.. 2018లో సామాజిక సమానత్వ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహిళల పట్ల రోడ్లపై అసభ్యంగా ప్రవర్తించడాన్ని, అశ్లీల సంజ్ఞలు చేయడాన్ని నిషేధిస్తూ చట్టం తెచ్చారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన స్కాప్పా.. రాజకీయాల్లోకి రాకముందు ప్రముఖ రచయిత్రి, బ్లాగర్. మాతృత్వపు సవాళ్లు, మహిళల ఆరోగ్యం, గర్భ సంబంధ అంశాలపై ఆమె విశేష రచనలు చేశారు