విధాత: చైనా (China) ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. గ్రాడ్యుయేషన్ పట్టాలు తీసుకున్న విద్యార్థులు శవాల్లా (Corpses) పోజులిస్తూ ఫొటోలు తీయించుకుంటున్నారు. వాటిని అక్కడి సామాజిక మాధ్యమాల్లో పెట్టి చనిపోయే ఉన్నాం అని ట్యాగ్‌లైనూ జోడిస్తున్నారు. వీరంతా ఎందుకిలా చేస్తున్నారనే కదా మీ సందేహం.. ప్రస్తుతం చైనా నిరుద్యోగం (Un employment) తాండవిస్తోంది.
ఎంతో కష్టపడి డిగ్రీలు చేసినా.. తమకు ఉపాధి లభించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము బతికినా చచ్చినా ఒకటేననే భావంతో ఈ రకంగా నిరసన తెలుపుతున్నారు. కుర్చీలో వేలాడుతూ, నేలపై పడిపోయి ఉన్న ఫొటోలు నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
తిప్పి కొట్టిన వ్యూహం
ఒక దశాబ్దం క్రితం వరకు ఉపాధి, అభివృద్ధి వైపు దృష్టి సారించిన చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం. ఇప్పుడు అంతర్జాతీయ వ్యవహారాలు, భద్రతపై దృష్టి పెడుతుండటంతో దేశ వృద్ధి రేటు మందగించింది. ప్రభుత్వం అమలు చేసిన జీరో కొవిడ్ విధానం కూడా ప్రైవేటు రంగం వెన్ను విరిచింది. దీనికి తోడు కొన్ని కఠిన నిబంధనలను అమల్లోకి తేవడంతో పలు సంస్థలు తమ వ్యాపారాలను మూసేయడం లేదా తగ్గించుకోవడం చేశాయి.
చైనాలో ఉద్యోగ కల్పన వాటాలో 80 శాతం ప్రైవేటు సంస్థలదే కావడం విశేషం. ఈ వేసవిలో సుమారు కోటీ అరవై లక్షల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్‌లు మార్కెట్‌లోకి రాగా… వారందరికీ ఉద్యోగం దొరకడం గగనమే. తాజాగా చైనా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు ఎప్పుడూ లేనంతగా 20.8 శాతానికి చేరుకుంది.
ప్రతి ఏడాది కోటి మందికి పైగా డిగ్రీలు పొందుతుండటంతో దానికి విలువ లేకుండా పోయిందని చైనా విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీంతో చాలా మంది పీజీ, పీహెచ్‌డీలకు మొగ్గుచూపుతున్నారు. అవి చదివినా అంత గొప్ప ఉద్యోగాలు రావడం లేదని.. ఖాళీగా ఉండకుండా ఏదో పనిలో నిమగ్నమవడానికే చదవాల్సి వస్తోందని లి నియాన్ అనే పీహెచ్‌డీ విద్యార్థి తెలిపాడు.