తెలంగాణ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్‌

మాజీ మంత్రి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌ను తెలంగాణ శాసన స్పీకర్‌గా కాంగ్రెస్ ఎంపిక చేసింది

  • Publish Date - December 7, 2023 / 07:17 AM IST

విధాత: మాజీ మంత్రి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌ను తెలంగాణ శాసన స్పీకర్‌గా కాంగ్రెస్ ఎంపిక చేసింది. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులతో పాటు స్పీకర్‌గా ప్రసాద్ కుమార్ పేరును ఖరారు చేస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ అధికారిక ప్రకటన జారీ చేశారు. సీఎంగా ఎనుముల రేవంత్‌రెడ్డి, మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రడ్డి, సి.దామోదరం రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, పోంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, ధనసరి అనసూయ(సీతక్క), తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు ల పేర్లను ఖరారు  చేసింది.


కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. ప్ర‌మాణ స్వీకార వేడుకలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ఆ ​​పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే, కాంగ్రెస్ ముఖ్య‌మంత్రులు, ఇత‌ర ముఖ్య నేత‌లు హాజరుకానున్నారు. ఈ వేడుకకు వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష మంది హాజరవుతారని అంచనా.


తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన డిప్యూటీ డీకే శివకుమార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులకు కూడా ఆహ్వానం అందించారు.

Latest News