Site icon vidhaatha

Gadar Awards | జూన్ 14న.. గద్దర్ అవార్డుల ప్ర‌ధానం

Gaddar Awards: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డ్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి భట్టి విక్రమార్క , సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, గద్దర్ అవార్డుల ఎంపిక జ్యూరీ కమిటీ చైర్మన్ జయసుధ, టీజీఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. జూన్ 14న హైదరాబాద్‌లో జరిగే గద్దర్ చలన చిత్ర అవార్డుల ప్రధానం ఘనంగా నిర్వహించాలన్నారు. అందుకు కావాల్సిన సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తాం’’ అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు చిత్రాలను మాత్రమే కాకుండా ఉర్దూ చిత్రాలనూ కూడా ప్రోత్సహించనుందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఏర్పాటు చేసుకున్న అవార్దులని పేర్కొన్నారు. దశాబ్దకాలంగా పరిశ్రమ ఎలాంటి ప్రొత్సహకాలకు, అవార్డులకు నోచుకోలేదన్నారు. దశాబ్దకాలంగా సినిమా రంగాన్ని నిర్లక్ష్యం చేయడం మంచి సంప్రదాయం కాదని సీఎం రేవంత్ రెడ్డి భావించారు.

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రవేశపెట్టడానికి చాలా కారణాలున్నాయన్నారు. గద్దర్‌ తన ఆట పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారన్నారు. ఆయన పేరు మీద అవార్డులు ప్రదానం చేయడం హర్షణీయమన్నారు. తెలంగాణ గుండె చప్పుడును తన పాటల ద్వారా విశ్వవ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్‌ అని స్మరించారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ గద్దర్‌ బాణి, పాటలను అనుకరిస్తారన్నారు. కళలకు పుట్టినిల్లు హైదరాబాద్అని గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల పట్ల ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందన్నారు. ప్రతివారు ఈ అవార్డులు గురించి మాట్లాడుకునేలా వేడుకలు చేస్తామని స్పష్టం చేస్తారు. చలన చిత్ర అవార్డులతోపాటు వ్యక్తిగత అవార్డులను కూడా పొందుపర్చుతామన్నారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండేలా అవార్డుల ప్రదానం చేస్తామన్నారు. అవార్డుల కోసం ఎలాంటి రాగద్వేషాలకు అతీతంగా అవార్డుల ఎంపిక ఉండాలని జ్యూరీని కోరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డులపై ఎన్ని విమర్శలు వచ్చిన ఆయన పేరుతో అవార్డులు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.

తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దిల్‌ రాజు మాట్లాడుతూ జూన్‌ 14న గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని ప్రకటించారు. హెచ్‌ఐసీసీ వేదిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవార్డుల ఎంపిక నిష్పాక్షికంగా జరిగేలా జ్యూరీ కమిటీ చూడాలన్నారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఇస్తున్న ఈ పురస్కారాల ఎంపిక కోసం చైర్మన్ నటి జయసుధ..15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటైందని గుర్తు చేశారు. అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు రాగా వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, చిల్డ్రన్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరిల్లో 76 దరఖాస్తులు అందినట్టు వెల్లడించారు. జ్యూరీ కమిటీ చైర్మన్ జయసుధ మాట్లాడుతూ ప్రభుత్వం అప్పగించిన అవార్డుల ఎంపిక బాధ్యతను సవాల్ తీసుకుని సజావుగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు.

Exit mobile version