Gaddar |
విధాత: ప్రజా గాయకుడు గద్దర్ నూతన రాజకీయ పార్టీని స్థాపించారు. నూతన రాజకీయ పార్టీకి ఆయన ‘గద్దర్ ప్రజా పార్టీ’ అని పేరు పెట్టారు. ఈ మేరకు గద్దర్ బుధవారం ఢిల్లీలో రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు.
నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానున్నది. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ వ్యక్తిగా ఉన్నప్పుడు కేసీఆర్ మీద పోటీ చేస్తానని చెప్పాను కానీ ఇప్పడు తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు.
ధరణి పేరుతో భూములు మింగిన కేసీఆర్
ధరణి పేరుతో కేసీఆర్ భూములు మింగాడని గద్దర్ తీవ్రంగా ఆరోపించారు. ఈ పదేళ్లలో బంగారు తెలంగాణ కాలేదని, కేసీఆర్ పుచ్చిపోయిన తెలంగాణను చేశారన్నారు. కేసీఆర్ విధానాలను గద్దర్ తప్పు పట్టారు. పదేళ్ల తెలంగాణలో ప్రజలు కోరుకున్న పరిపాలన అందలేదని, దొరల పరిపాలన జరుగుతోందని,
దోపిడి పోవాలని నా ఈ 77 ఏళ్ల వయసులో ప్రజా పార్టీ పెట్టినట్లు గద్దర్ వెల్లడించారు.
భారత రాజ్యాంగం తీసుకొని ఓట్ల యుద్దానికి సిద్దం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటును బ్లాక్ మనీ నుంచి బయటకు తేవాలన్నారు. తాను ఇప్పటి వరకు అజ్ఞాత వాసం నుంచి ప్రజలను చైతన్యం చేశానని, ఇక నుంచి పార్లమెంటరీ పంథాను నమ్ముకుని బయలుదేరానన్నారు. ఇది శాంతి యుద్ధం.. ఓట్ల యుద్ధం అని గద్దర్ అన్నారు.
ప్రతి గ్రామానికి వెళ్తా
పార్టీ నిర్మాణం కోసం గ్రామ గ్రామానికి వెళ్తానని గద్దర్ తెలిపారు. సచ్చే ముందు సత్యమే చెపుతున్నానని ఆయన అన్నారు. తాను భావ విప్లవకారుడిని, అయిదేళ్ళ అడవిలో ఉన్నానని చెప్పారు. ప్రజలకు స్వేచ్ఛ కావాలి.. నీరు , ఉద్యోగాలు కావాలన్నదే తన అభిమతం అన్నారు.