విధాత: గజ్వేల్ నియోజకవర్గంపై తనకు ఉన్న అభిమానాన్ని, మమకారాన్ని చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు తనకు బలాన్ని ఇచ్చిన గడ్డ సిద్దిపేట అయితే, ఆ తర్వాత.. సాధించిన తెలంగాణను తీర్చిదిద్దడం కోసం తనను ఎమ్మెల్యేను చేసి, రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన గడ్డ ఈ గజ్వేల్ గడ్డ అని చెప్పారు. గజ్వేల్ తన గౌరవాన్ని పెంచిందని, తనను ఈ స్థాయికి తెచ్చింది.
‘తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు నాకు బలాన్ని ఇచ్చిన గడ్డ సిద్దిపేట. ఆ తర్వాత.. సాధించిన తెలంగాణను తీర్చిదిద్దడం కోసం నన్ను ఎమ్మెల్యేను చేసి, రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన గడ్డ ఈ గజ్వేల్ గడ్డ. గజ్వేల్ నా గౌరవాన్ని పెంచింది. నన్ను ఈ స్థాయికి తెచ్చింది. గత తొమ్మిదిన్నర ఏండ్లుగా నేను గజ్వేల్ ప్రాంతం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశాను.
ఇప్పుడే పెద్దలు ప్రతాపరెడ్డి గారు మీకు అన్నీ వివరించారు. నేను మళ్లా అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో మంచి నీళ్ల కోసం నానా ఇబ్బందులు పడిన గజ్వేల్‌కు శాశ్వతంగా ఆ బాధ తీరిపోయింది. సాగు నీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడిన గజ్వేల్‌కు ప్రాజెక్టులు, కాలువలు రావడంతో ఆ బాధ కూడా తీరిపోయింది.
‘మన గజ్వేల్‌కు రైలు వస్తదని ఎన్నడూ అనుకోలేదు, కానీ రైలు కూడా వచ్చేసింది. గజ్వేల్ ఒక గుర్తింపు కలిగిన నియోజకవర్గంగా ఎదిగింది. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి గజ్వేల్ మోడల్ అభివృద్ధిని చూడటానికి వస్తున్నరు. మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, మన అడవుల పునరుద్ధరణ కావచ్చు, మన మల్లన్నసాగర్ ప్రాజెక్టు కావచ్చు.. ఇట్ల అనేక రకాల పనులను చూడటానికి ఇయ్యాల గజ్వేల్‌కు వస్తున్నరు.
మిషన్ భగీరథ పథకాన్ని గురించి తెలుసుకోవడానికి కోమటిబండకు రాని రాష్ట్రమే లేదు భారత దేశంలో. అన్నింటికంటే ముఖ్యంగా ఇప్పుడు మనం తాగుతున్నది, సాగుకు వినియోగిస్తున్నది మనందరం ఎంతో పవిత్రంగా భావించే గోదావరి జలాలు. ఇలా ఒక రోల్ మోడల్‌గా గజ్వేల్ ఎదిగింది. అయితే ఇప్పటికే అయ్యింది చాలా గొప్ప అని మనం సంతోషపడితే కాదు, ఇంకా చాలా అభివృద్ధి కావాల్సి ఉంది’ .
ఈ ఎన్నికల్లో ఇది నా చివరి సభ.. ఇది 96వ సభ. తెలంగాణ రాష్ట్రం గురించి కూడా ఒకసారి చెప్పాలి. గజ్వేల్ నుంచి మీరు అవకాశం ఇచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి పంపిస్తే ఈ రాష్ట్రం కోసం కష్టపడ్డాను. కృషి చేశాను. అవన్నీ ప్రజల కండ్ల ముందు కనబడుతున్నాయి. ఇక్కడ వచ్చేటటువంటి ట్రిపుల్ ఆర్ కూడా మన గజ్వేల్ మీదుగానే రాబోతుందని సంతోషంగా తెలియజేస్తున్నా. 24 ఏండ్లుగా తెలంగాణనే ఆశగా, శ్వాసగా బతుకుతున్నాను. ఆ విషయం మీ అందరికి తెలుసు.
ఉద్యమ సందర్భంలో తెలంగాదణ ఎట్ల తేవాలని ఆరాట పడ్డాను. పోరాటం చేశాను. కాంగ్రెస్ పార్టీ మోసం చేసినా తట్టుకోని, నిలబడి, మొండిగా, చివరకి మళ్లీ ధోకా చేశారని గుర్తించి, ఇక తప్పదనే నమ్మకానికి వచ్చి కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష చేస్తే, 33 పార్టీలు మనకు అండగా వస్తే అప్పుడు దిగొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక విషయాలు మాట్లాడుతోంది.
మేం గెలిస్తే మళ్ల ఇందిరమ్మ రాజ్యం తెస్తమని చెబుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి ఇప్పుడు. అసలు నాకర్థం కాదు. ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 2 రూపాయాలకే కిలో బియ్యం ఎందుకు ఇయ్యాల్సి వచ్చింది. అప్పటి వరకు మన రాష్ట్రం ఆకలి కడుపుతోనే ఉన్నది కదా..? ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులు వచ్చాయి.
ఇందిరమ్మ రాజ్యంలోనే కదా ఎన్‌కౌంటర్లు, రక్తపాతం జరిగింది. మన తెలంగాణ ఉద్యమంలో 1969లో 400 మందిని కాల్చి చంపింది. ఇవన్నీ కావాలని మళ్లీ కోరుతున్నారు. ఇది ఎట్ల ఉందంటే తద్దినం ఉందని భోజనానికి పిలిస్తే రోజు మీ ఇంట్లో ఇట్లనే జరగాలని అన్నడట యెన్కటికి ఒకడు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ గెలిచేది లేదు సచ్చేది లేదు. కానీ గెలిస్తే మటుకు ఇందిరమ్మ రాజ్యం తెస్తమని మాట్లాడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తదనంతంర పని ప్రారంభించుకున్నాం. రాష్ట్రాన్ని అనేక రకాలుగా ముందుకు తీసుకుపోవాలని చాలా విధాలుగా ఆలోచన చేశాం. మొదట్లోనే మన శత్రువులు సమైక్యవాదులు ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు చేశారు. తొలి రోజుల్లోనే గవర్నమెంట్ కూలగొట్టాలని కుట్ర చేశారు. మన ఎమ్మెల్యేలను కొనాలనే ప్రయత్నం చేశారు. ఇట్లాంటి ఎన్నో ఆటంకాలను అధిగమించుకుంటూ ఆలోచనలు మొదలు పెట్టాం.
ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం. హైదరాబాద్‌లో ఇంతుకు ముందు ఎప్పుడ పోయినా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ తప్ప ఇంకోటి తెల్వదు. రాబోయే ఐదారు నెలల్లో నాలుగు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. మరో 2 వేల పడకలతో నిమ్స్ అభివృద్ధి చేసుకుంటున్నాం. మన ఊరు – మన బడి కార్యక్రమంలో పాఠశాలలను అభివృద్ధి చేసుకుంటున్నాం. అనేక రకాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. సంపద పెంచుతున్నాం. పరిశ్రమలు విపరీతంగా తెచ్చాం. 24 గంటల కరెంట్ ఉంటున్నది. దాని కారణంగా పెట్టబడులు తరలివస్తున్నాయి.
తెలంగాణ శాంతిభద్రతలకు ఆలవాలంగా ఉంది. కాంగ్రెస్ రాజ్యంలో ఊ అంటే, ఆ అంటే మతకల్లోలం. మాట్లాడితే కర్ఫ్యూ, ఇవాళ పదేండ్లలో ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేదు. మతకల్లోలాలు జరగలేదు. కారణం ఏందంటే అన్ని వర్గాలు, మతాల ప్రజలను సమానంగా చూసుకుంటూ మంచిగా ముందుకు పోతున్నాం కాబట్టి గొడవల్లేని ప్రశాంత వాతావరణం ఉంది. కాబట్టి ఐటీ, పరిశ్రమల రంగంలో పెట్టుబడులు వస్తున్నాయి. పట్టణాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుంటున్నాం. హైదరాబాద్ నగరం కండ్లు చెదిరిపోయేలా అద్భుతమైన విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. చాలా గొప్ప అభివృద్ధి జరుగుతుంది.
ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు కలిగించిన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, పట్టణాలు, గ్రామాల అభివృద్ధి కానీ ఏకదీక్షతోని చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఈ రాష్ట్రం ఎలా తయారైందంటే తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అనే పద్ధతుల్లో చిన్న రాష్ట్రం పదేండ్ల వయసున్నప్పటికీ, ఈ దేశానికి ఒక రోల్ మోడల్‌గా ఈ రాష్ట్రాన్ని మనం తయారు చేసుకున్నాం.
ఈ విధంగా ముందుకు పోవాలంటే చాలా జరగాలి. తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఒక దరికి తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రం ఇంకా బాగుపడాలి. నాకు ఫిబ్రవరి నెల వస్తే 70 సంవత్సరాల వయసు వస్తా ఉంది. మీ అందరి ఆశీర్వచనంతోని.. తెలంగాణ తెచ్చిన కీర్తే నాకు ఆకాశమంత ఎత్తు కీర్తి. పదవులు కాదు ఇక్కడ ముఖ్యం. ఆల్రెడీ పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న మీ ఆశీస్సులతో. తెలంగాణ రేపు ఒక అద్భుతమైన రాష్ట్రం కావాలి.
పేదరికం శాశ్వతంగా పోయే రాష్ట్రం కావాలి. నిరక్షరాస్యత లేని వంద శాతం అక్షరాస్యత ఉండే రాష్ట్రం కావాలి. చాలా వైద్య సదుపాయాలు ప్రజలకు ఫ్రీగా అందే తెలంగాణ కావాలి. పేదలు లేని తెలంగాణ కావాలి.. ఉట్టిగా నోరుతోటి చెబితే కాదు. ఇందిరమ్మ కాలంలో దళితుల కోసం మంచి పనులు చేసి ఉంటే ఇవాళ దళిత వర్గాలకు ఇంత దరిద్రం ఎందుకు ఉండేది. వాళ్లు చేయలేదు కాబట్టే ఇంకా దరిద్రం ఉంది.
దళితులు మన సాటి మనషులు, వాళ్లకు వివక్షకు, దోపిడీకి గురయ్యారు. వాళ్లు కూడా మనతోపాటు పైకి రావాల్సిన అవసరం ఉంది. అందుకే దళితబంధు ప్రోగ్రాం తెచ్చాం. గజ్వేల్ నియోజకవర్గ దళిత బిడ్డలందరికీ శుభవార్త చెప్తున్నా. ఈ ఎన్నికలు కాగానే మన గజ్వేల్ నియోజకవర్గంలో ఒకే విడతలో దళితబంధు తెచ్చుకుందాం. గజ్వేల్ నియోజకవర్గ దళితవాడల్లోని దరిద్రాన్ని పీకి అవతల పడేద్దాం. ఆ రకంగా కార్యక్రమాలు చేసుకుందాం.
పంటల ఉత్పత్తి పెరిగింది తెలంగాణలో, పంటల వైవిధ్యం కూడా పెంచాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రావాలి. ప్రతి మండలం ప్రతి నియోజకవర్గంలో ఎక్కడికక్కడ ఆ పరిశ్రమలు రావాలి. దాంట్లో రైతులందరూ వాటాదారులు కావాలి. రైతుల బిడ్డలందరికి దాంట్లో ఉద్యోగాలు దొరకాలి. అటువంటి గొప్ప ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీగా తెలంగాణ తయారు కావాలని నా కలలు ఉన్నాయి. అదే విధంగా పేదరికాన్ని తగ్గించే విషయంలో మనం ముందుకు పురోగమిస్తున్నాం.
ఇంకా పురోగమించాలి. కులం, మతం, జాతి అనే తేడా లేకుండా శాంతి భద్రతలను కాపాడుకుంటూ అన్ని వర్గాల ప్రజలను, అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి. అదే ఆశయంగా ఈ రోజు నేను పని చేస్తున్నా. మీ అందరితో ఒక్కటే మాట కోరుతున్నా. గజ్వేల్‌లో నన్ను రెండుసార్లు గెలిపించారు. భగవంతుడు అవకాశం, శక్తి ఇచ్చినంత మేర గ్రామాలు, పట్టణాలు, రైతుల గురించి కార్యక్రమాలు తీసుకున్నాం.
ఈసారి మళ్లీ మీరు ఆశీర్వదిస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. కొండపోచమ్మ దేవాలయం ఒక అద్భుతమైన దేవాలయంగా మార్చుకుందాం. నాచారం దేవాయలన్ని కూడా అద్భుతంగా తయారు చేసుకుందాం. ఇంకో మాట తెలియజేస్తున్నా.. గజ్వేల్ హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉంది. మాకు స్థలాలు ఇప్పించండి వచ్చి ఐటీ టవర్లు పెడుతామని కోరుతున్నారు. కేటీ రామారావుకు చెప్పాను ఆల్రెడీ. పరిశీలన జరగుతుంది. గజ్వేల్‌కు ఐటీ టవర్లు తెచ్చిపెట్టే బాధ్యత నాది.
ప్రతి మండల కేంద్రంలో అద్భుతమైన మార్కెట్ యార్డు కూడా నిర్మాణం చేసుకుందాం. మల్లన్న సాగర్ వద్దకు టూరిస్టులు వస్తారు. ఎందుకంటే వాగు, నది లేకుండా రింగ్ బండతో కట్టిన రిజర్వాయర్.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద 50 టీఎంసీల ప్రాజెక్టు మన మల్లన్న సాగర్. దాన్ని అనుసరించుకొని 7 వేల ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. సుగంధ ద్రవ్యాల మొక్కలు నాటిస్తున్నా. తప్పకుండా మల్లన్న సాగర్ పనులు పూర్తవుతున్నాయి. టూరిస్ట్ స్పాట్‌గా తయారు చేస్తానని మనవి చేస్తున్నా.
ముంపు గ్రామాల ప్రజలకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. వాళ్ల త్యాగమే.. ఒకనాడు చుక్క నీళ్ల కోసం తపించిన గజ్వేల్ ఇవాళ 12 జిల్లాలకు నీళ్లు పంపించే ఖజానా అయింది. మల్లన్న సాగర్ నుంచే చాలా నియోజకవర్గాలకు జిల్లాలకు నీళ్లు పోతున్నాయి. భువనగిరి, ఆలేరు, దుబ్బాక కావొచ్చు.. సింగూరు ప్రాజెక్టుకు, నారాయణఖేడ్, నిజాం సాగర్‌కు మల్లన్న సాగర్ నుంచే నీళ్లు పోతాయి. ఎవరైతే నిర్వాసితులు అయ్యారో.. వాళ్ల ప్రాంతంలో పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పిస్తాను. నా మాట నిలబెట్టుకుంటాను.. వారి యెడల నా మనసులో మార్గం ఉంది. తప్పకుండా అది కూడా చేస్తా.
ఇక్కడికి పరివ్రమలు వస్తాయంటే నేనే వద్దనే చెప్పాను. వాడొచ్చి కాలుష్యం పెట్టి, మన పొలాలు కరాబ్ చేసి మన ఏరియా పొల్యుషన్ చేస్తే మనం ఇబ్బందులు పడుతాం. కాలుష్య రహిత పరిశ్రమలు రావాలని కోరాం. రాబోయే కాలంలో డజన్ పరిశ్రమలు గజ్వేల్‌కు వస్తాయని మనవి చేస్తున్నా. ప్రాసెస్‌లో ఉంది. కమర్షియల్ క్రాప్స్ వేసుకుందాం. రైల్వే సదుపాయం వచ్చింది కాబట్టి.. ఎక్కడికి అంటే అక్కడికి దేశం నలుమూలల మన పంటలు పంపించే అవకాశం ఉంటది. జోన్లుగా విభజించుకుని, రైతులకు లాభం వచ్చేలా చేసుకుందాం..
మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వలేదు నరేంద్ర మోదీ. ఒక్క నవోదయ, మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీ పార్టీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలి. మనం ఏమన్న పిచ్చి పోసిగాళ్లమా..? తెలివి తక్కువ వాళ్లమా..? ఇటువంటి పార్టీలను మనం ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి. వాళ్లు ఏమంటారు.. మేం ఏం ఇవ్వకున్న మాకే గుద్దిండ్రు వీల్లు గొర్రెలు అనుకుంటరు. మరి మనం గొర్రెలామా..? మనం ఎవరమనేది నిరూపించాలి. 30 తారీఖున నిరూపించాలి.
మన రాష్ట్రాన్ని ఎన్నో కష్టాలు పడి తెచ్చుకున్నాం. 58 ఏండ్లు గొడగొడ ఏడ్సినం. మంచినీళ్లకు బాధపడ్డాం. బోర్లు వేస్తే 600 ఫీట్లకు పోయినం.. ఆ బాధలు మర్చిపోయామా..? ఇవాళ ఎండకాలంలో కూడా వాగులు మత్తళ్లు దుంకుతున్నాయి. ఇంత కష్టపడి వచ్చిన రాష్ట్రం, పదేండ్ల వయసున్న రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఒక్కటి కూడా సహాయం చేయని కేంద్ర ప్రభుత్వానికి, కుట్రలు చేసే కేంద్రానికి మనం ఎందుకు సహకరించాలి.
దయచేసి ప్రతి యువకుడు ఆలోచించాలి. ఏదో ఒక పేరు మీద గుడ్డిగా ఓట్లు వేయడం కాదు. విచక్షణతోనే ఓటేస్తే లాభం జరుగుతది. మనం కులం మతం జాతి లేకుండా అందరం కలిసిపోతున్నాం.. కాబట్టి ఈ అభివృద్ధి సాధ్యమవుతుంది. భవిష్యత్‌లో ఇంకా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. గజ్వేల్ నా నియోజకవర్గం కాబట్టి మీరు ఏది కోరితే అది వస్తది. ఆటోమేటిక్‌గా జరుగుతనే ఉంటది. అన్నింటి కంటే నేను చాలా గర్వపడ్డాను.మొన్న రాత్రి సంగారెడ్డి నుంచి ప్రచారం చేసి వస్తుంటే గజ్వేల్ రింగ్ రోడ్డు మీద నుంచే పోయాను.
ఇతర పట్టణాల వారు అసూయపడే విధంగా రింగ్ రోడ్డు నిర్మాణం చేసుకున్నాం. గజ్వేల్ హైదరాబాద్‌కు శాటిలైట్ టౌన్ కాబట్టి అనేక పరిశ్రమలు వస్తాయి. అట్లనే రాబోయే రోజుల్లో మన అభివృద్ధి చూసి హౌజ్ బిల్డింగ్ ఇండస్ట్రీ, విల్లాలు కట్టే వారు గజ్వేల్‌కు క్యూ కడుతారు. ఒకసారి ట్రిపుల్ ఆర్ వచ్చిదంటే గజ్వేల్ దశనే మారిపోతది. గజ్వేల్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాం.
ముఖ్యమంత్రి కావడానికి ఒక భూమిక ఏర్పాటు చేసి, మొదటి ఎన్నికల్లో నన్ను ఇక్కడ్నుంచి ఎమ్మెల్యే చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మళ్లీ అవకాశం ఇచ్చి పంపిస్తే ఈ కీర్తిని ఇంకింత ఇనుమడింపజేసే విధంగా, మన గజ్వేల్ అభివృద్ధిని ఆకాశానికి తీసుకుపోయే విధంగా పని చేస్తానని మనవి చేస్తున్నా.