విధాత: సంక్రాంతి పండుగ వేళ ఓ ఇద్దరు ప్రేమికులు అలా సరదాగా బయటకు వెళ్లారు. ఓ చల్లని ప్రదేశంలో కూర్చొని తీపి కబుర్లు చెప్పుకుంటుండగా, ఓ ఇద్దరు తాగుబోతులు వారిని చుట్టుముట్టారు. బాయ్‌ఫ్రెండ్‌ను నిర్బంధించి, మరో నలుగురిని అక్కడికి పిలిపించారు. అనంతరం యువతిపై ఆరుగురు కలిసి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కంచీపురం జిల్లాలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కంచీపురం జిల్లాకు చెందిన ఇద్దరు యువతీయువకులు క్లాస్‌మెట్స్. అయితే వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఇక సంక్రాంతి వేళ సాయంత్రం సమయంలో సరదాగా బయటకు వచ్చారు. ఓ ప్రదేశంలో ఉన్న ఆ ప్రేమికుల వద్దకు ఇద్దరు తాగుబోతులు వచ్చి నిర్బంధించారు. మరో నలుగురిని పిలిపించారు. ఇక బాయ్‌ఫ్రెండ్‌ను నిర్బంధించి, అతని ప్రియురాలిపై సామూహిక అత్యాచారం చేశారు.
తన ప్రియురాలిని వదిలిపెట్టండి అని ప్రాథేయపడినా, ఆ మృగాలు కనికరించలేదు. తమ కోరికలు తీరిన అనంతరం అక్కడ్నుంచి వెళ్లిపోయారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆరుగురిలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.