రుణ యాప్స్‌పై గూగుల్‌ కొరఢా..! ప్లే స్టోర్‌ నుంచి 17 యాప్స్‌ తొలగింపు..!

రుణ యాప్‌లపై టెక్‌ దిగ్గజం గూగుల్‌ కొరఢా ఝుళిపించింది. రుణగ్రహీతల వ్యక్తిగత డేటాను దొంగిలిస్తున్న యాప్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది

  • Publish Date - December 9, 2023 / 05:53 AM IST

విధాత‌: రుణ యాప్‌లపై టెక్‌ దిగ్గజం గూగుల్‌ కొరఢా ఝుళిపించింది. రుణగ్రహీతల వ్యక్తిగత డేటాను దొంగిలిస్తున్న యాప్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. ప్రముఖ రీసెర్చ్ సంస్థ ఈసెట్ (ESET) నిపుణులు ఆయా యాప్‌లు రుణగ్రహీతల వ్యక్తిగత డేటాను దొంగిలిస్తున్న 17 లోన్ యాప్స్‌ను గుర్తించారు. అయితే, పేరుకు లోన్‌యాప్స్‌గా చెప్పుకుంటున్నట్లు పేర్కొంది. ఈ సెట్‌ నివేదిక నేపథ్యంల్‌ 17 యాప్‌లను స్టోర్‌ నుంచి తొలగిస్తూ గూగుల్‌ నిర్ణయం తీసుకున్నది.


భారత్‌తో పాటు పలు దేశాల్లోనూ ఈ యాప్స్‌ను వినియోగిస్తున్నట్లు తేలింది. ఎవరైనా ఆయా యాప్స్‌ను వినియోగిస్తే తక్షణమే డిలిట్‌ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈసెట్ పరిశోధకుల బృందం ప్రకారం.. 17 యాప్స్‌ను ఇప్పటి వరకు 12 మిలియన్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు తేలింది.


ఈ సందర్భంగా ఈసెట్‌ పరిశోధకుడు లూకాస్ స్టెఫాంకో మాట్లాడుతూ.. యాప్స్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్లు లోన్‌ యాప్‌లను నమ్మే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటారని పేర్కొన్నారు. తప్పుడు పద్ధతులను అవలంభించి మోసాలకు పాల్పడుతూ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారని తెలిపారు.


లోన్‌ యాప్‌ల ద్వారా బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడుతున్నారని, చంపేస్తామని బెదిరింపులకు దిగినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ప్రధానంగా మెక్సికో, ఇండోనేషియా, థాయ్‌లాండ్, వియత్నాం, భారత్‌, పాకిస్థాన్, కొలంబియా, పెరూ, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, కెన్యా, నైజీరియా, సింగపూర్‌లలో రుణ యాప్స్‌ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు హెచ్చరించారు.


గూగుల్‌ తొలగించిన యాప్స్‌ జాబితాలో ఏఏ క్రెడిట్ (AA Kredit), అమోర్ క్యాష్ (Amor Cash), గుయాబా క్యాష్ (Guayaba Cash), ఈజీక్రెడిట్ (Easy Credit), క్యాష్‌వౌ (Cash wow), క్రెడిబస్ (CrediBus), ఫ్లాష్ లోన్ (Flash Loan) ఉన్నాయి. అలాగే, ప్రెస్టమోస్క్రెడిటో (Préstamos Crédito), ప్రెస్టమోస్ డి క్రెడిట్టో – యుమికాష్ (Prestamos De Crédito – YumiCash), గో (Go), ఇన్‌స్టంట్ క్రెడిట్ ప్రెస్టమో (Instant Credit Prestamo), గ్రాండే కార్టెరా (Grande Cartera), రాపిడో క్రెడిటో (Rápido Crédito), ఫైనప్ లెండింగ్ (Finupp Lending), 4ఎస్ క్యాష్ (4S Cash), ట్రూనైరా (TrueNaira), ఈజీ క్యాష్ (EasyCash)ను గూగుల్‌ తొలగించింది.


ఈ యాప్స్‌ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని బ్లాక్‌ మెయిల్‌ చేయడం, చంపేస్తామని బెదిరింపులకు దిగడంతో పాటు.. రుణంపై నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నట్లు వెల్లడైంది. కొన్ని పరిస్థితుల్లో రుణం తిరిగి చెల్లించడానికి 91 రోజులకు బదులుగా.. కేవలం ఐదురోజుల సమయం మాత్రమే ఇస్తున్నట్లు తెలిసింది.


వార్షిక రుణ వ్యయం (TAC) 160 శాతం నుంచి 340శాతం ఉండడం ప్రస్తావనార్హం. ఆయా రుణ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ స్మార్ట్‌ఫోన్లలో సేవ్‌ చేసిన సమాచారాన్ని యాక్సెస్‌ చేయడానికి వినియోగదారుల నుంచి అనుమతి సైతం అడిగిన సందర్భాలున్నాయి. అయితే, యాప్స్‌కు పర్మిషన్‌ ఇచ్చే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ప్లే స్టోర్‌ నుంచి తొలగించిన ఏవైనా యాప్స్‌ను ఎవరైనా యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకొని వుంటే.. వెంటనే డిలీట్‌ చేయాలని టెక్‌ దిగ్గజం సూచించింది.