చట్టసభల తీర్మానాలను గవర్నర్ గౌరవించాలి: మండలి చైర్మన్ గుత్తా

విధాత: రాష్ట్రాల హక్కులను చట్టసభల తీర్మానాలను గవర్నర్లు గౌరవించాల్సిన బాధ్యత ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ గవర్నర్ తమిళసై ప్రోటోకాల్ పాటించలేదంటూ ప్రభుత్వాన్ని తప్పుపడుతూనే.. తాను మాత్రం రాష్ట్ర శాసనసభ, మండలిలు ఆమోదించిన బిల్లులను నాలుగు నెలలుగా తన వద్ద పెండింగ్‌లో పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. గవర్నర్ వైఖరి చూస్తే రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యం పెట్టుకునే ఉద్దేశం ఎవరిదన్నది స్పష్టం […]

  • Publish Date - January 20, 2023 / 09:42 AM IST

విధాత: రాష్ట్రాల హక్కులను చట్టసభల తీర్మానాలను గవర్నర్లు గౌరవించాల్సిన బాధ్యత ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ గవర్నర్ తమిళసై ప్రోటోకాల్ పాటించలేదంటూ ప్రభుత్వాన్ని తప్పుపడుతూనే.. తాను మాత్రం రాష్ట్ర శాసనసభ, మండలిలు ఆమోదించిన బిల్లులను నాలుగు నెలలుగా తన వద్ద పెండింగ్‌లో పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు.

గవర్నర్ వైఖరి చూస్తే రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యం పెట్టుకునే ఉద్దేశం ఎవరిదన్నది స్పష్టం అవుతుందని అన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం హాయంలో విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్లు అక్కడి ప్రభుత్వాలతో ఘర్షణాత్మక వైఖరి అనుసరించడం పెరిగిపోయిందన్నారు. ఇటీవల జైపూర్‌లో జరిగిన స్పీకర్ల సదస్సులోనూ గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగంపై అసంతృప్తి వ్యక్తం అయిందన్నారు.

ఖమ్మం బీఆర్ఎస్ సభ సక్సెస్ ద్వారా దేశ రాజకీయాల్లో కాంగ్రెసేతర, బీజేపీయేతర విపక్షాల ఐక్యతను, సెక్యులర్ శక్తుల ఏకీకరణను చాటి చెప్పడంలో సీఎం కేసీఆర్ విజయవంతమయ్యారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేయడం, కార్పొరేట్ అనుకూల, పేదల వ్యతిరేక విధానాలపట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు.

లౌకికవాద భారతదేశంలో మతవిద్వేషాల రాజకీయాలను సాగిస్తున్న బిజెపి పార్టీని గద్దెదించేందుకు బీఆర్ఎస్ ఖమ్మం సభ ద్వారా పోరాటం ప్రారంభించిందన్నారు. ప్రధాని మోడీ మైనార్టీలను కలుపుకొని పోవాలని బిజెపి శ్రేణులకు మార్గదర్శకం చేస్తుంటే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మాత్రం నిజాం రాజు అంత్యక్రియలపై రాజకీయ విమర్శలు చేయడం మైనారిటీల పట్ల బీజేపీ ద్వంద విధానాలకు నిదర్శనం అన్నారు.

నిజాం పాలనలో మంచిని సమర్థించి చెడుని విమర్శించడంలో తప్పు లేదని, ఓట్ల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టడం బిజెపికి సరైనది కాదన్నారు. సొంత రాష్ట్రంలో పార్టీ పాదయాత్ర పనుల కారణంగా ఖమ్మం సభకు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హాజరు కాలేదని, కాంగ్రెస్, బీజేపీలను రెండింటిని విమర్శించాల్సిన నేపథ్యంలో ఖమ్మం సభకు బీహార్ సీఎం నితీష్ కు ఆహ్వానం లేనందున రాలేదన్నారు.

రాష్ట్రంలో ఫిబ్రవరిలో రాష్ట్ర అసెంబ్లీ రద్దు చేయబోతున్నారంటూ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉండగా అసెంబ్లీ ఎందుకు రద్దవుతుందంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ వ్యాఖ్యలను ప్రజలెవరు నమ్మడం లేదన్నారు. రేవంత్ తెలంగాణ రాజకీయాల్లో ఒక జోకర్ గా తయారడన్నారు.

కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందన్న మంత్రి ఎర్రబెల్లి వాఖ్యలు ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు దూరంగా ఉండే వారికి మాత్రమే వర్తిస్తుందన్నారు. ప్రజల్లో ఉండి పనిచేసే వారు మళ్లీ గెలుస్తారన్నారు. 2014లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధిక శాతం 2018లో తిరిగి గెలిచారన్న విషయం మరవరాదన్నారు. కొన్ని సందర్భాల్లో ఎన్నికల నాటికి అప్పటి ప్రభుత్వాలపైన, పార్టీపైన వ్యతిరేకత ఉంటే కూడా ఒక్కోసారి అభ్యర్థులు ఓడిపోక తప్పదని, ఇందుకు 2004లో తన ఓటమినే ఒక నిదర్శనం అన్నారు.