Adi Srinivas | కేటీఆర్ వస్తే నార్కో అనాలసిస్ టెస్టుకు సిద్ధం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాను నార్కో అనాలసిస్ టెస్టుకు సిద్ధమన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిజంగా ఆ టెస్టులకు ముందుకొస్తే అందుకు ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ స్పష్టం చేశారు

  • Publish Date - April 13, 2024 / 04:55 PM IST

విధాత, హైదరాబాద్‌ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దీనిపై తాను నార్కో అనాలసిస్ టెస్టుకు సిద్ధమన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిజంగా ఆ టెస్టులకు ముందుకొస్తే అందుకు ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఎప్పుడు వస్తారో టైమ్, ప్లేస్ చెప్తే నార్కో అనాలసిస్ టెస్టు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఏర్పాట్లు చేశాక కేటీఆర్‌ వెనక్కి తగ్గకుండా టెస్టులకు రావాలని సవాల్ విసిరారు. సిరిసిల్లలో కూడా కేటీఆర్ పెద్ద ట్యాపింగ్ వార్ రూమ్ ఏర్పాటు చేశారని ఆరోపించారు.

సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసి ఎన్నికల్లో ఓడించారని, అదే రీతిలో ఉప ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయించి రాజకీయ, ఆర్ధిక లబ్ధి పొందినట్లుగా ఇప్పటికే విచారణ ఎదుర్కోన్న అధికారులు వెల్లడించారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాస్తవాలు బయటపడుతున్నా కేటీఆర్ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాపాల పుట్ట మేడిగడ్డ రూపంలో పగిలిందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు కరువుతో అల్లాడాలని మామ, అల్లుడు కోరుకుంటున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ ఒక్క సీటు గెలవదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కాగానే అరు గ్యారెంటీల్లోని మిగతా హామీలు అమలు చేస్తామని పేర్కొన్నారు.

Latest News