- ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇదేంటని అధికార నేతల్లో ఆందోళన
విధాత: రాష్ట్ర రైతాంగాన్నిధరణితో పాటు కరెంటు కోతలు పట్టి పీడిస్తున్నాయి. దీనికి తోడు ఏసీడీ పేరుతో అదనపు వడ్డింపులు తెలంగాణ ప్రజానీకం తీవ్ర అగ్రహానికి గురి చేస్తోంది. ధరణిలో భూమి రికార్డులు సరిగ్గా లేని పరిస్థితి.. మరో వైపు యాసంగి సాగుకు కరెంటు కష్టాలు వెరసి సగటు రైతును తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కరెంటు కోతలతో కడుపు మండిన రైతన్న సబ్ స్టేషన్ల ముందు ఆందోళనకు దిగుతున్నాడు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులు ఎదర్కొంటున్న ఈ సమస్యలు అధికార పార్టీ నేతలకు ఇబ్బంది కరంగా మారాయి. ఏ గ్రామానికి వెళ్లినా నేతలకు కరెంటు సమస్యతో పాటు ధరణి సమస్యలు ఏకరువు పెడుతున్నారు. దీంతో ఇంత చేసినా ఈ రెండు సమస్యలే తమను పుట్టి ముంచుతాయా? అన్న ఆందోళనలో అధికార పార్టీ నేతలున్నారు.
మరో వైపు ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి వెళ్లాయి. దీంతో అధికార పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. రాజకీయంగా తమకు ఎలాంటి ఢోకా లేదనుకుంటున్న సమయంలో ధరణి పోర్టల్‌కు కరెంటు కోతలు కూడ తోడు కావడంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో అధికార పార్టీ నేతలున్నారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి వైబ్ సైట్ కారణంగా ఉన్న భూ యజమాన్య హక్కులు కూడ కోల్పోయామని సగటు రైతు వాపోతున్నాడు.. ఈ రెండు సమస్యలతో గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో రైతులకు సమాధానం కూడ చెప్పలేని పరిస్థితి సర్కారు పెద్దలకు ఏర్పడింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్ల్యేలు, ఎంపీలు, మంత్రులను వద్దకు అనేక గ్రామాల రైతులు ధరణిలో తమ భూములు తప్పుగా నమోదయ్యాయనో.. లేదా మా భూములు రికార్డ్‌లో కనిపించడం లేదనో… మా భూమి ఇతరుల పేరున ఎక్కిందనో… లేదా పట్టా భూమి అసైన్డ్ భూమిగా నమోదైందనో ఇలా అనేక రకాల భూమి సమస్యలను తీసుకు వెళుతున్నారు.
అయినా వాటిని పరిష్కరించే పరిస్థితి లేదు. ఎమ్మల్యేలు, ఎంపీలు స్వయంగా కలెక్టర్‌కు చెప్పినా పరిష్కారం కావడం లేదని రైతులు అంటున్నారు. ఏ చిన్న సమస్య చెప్పినా మీ- సేవలో వేయి రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోమని చెపుతున్నారని, ధరఖాస్తు చేస్తే కొద్ది రోజులకు ఏ కారణం లేకుండానే రిజక్ట్ అని వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏ గ్రామానికి వెళ్లినా ధరణి సమస్యలే తమను చుట్టు ముడుతున్నాయని ఒక ప్రజా ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి సమస్య రాజకీయంగా తమను ఇబ్బందులకు గురి చేస్తుందని అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు తన బాధను వ్యక్తం చేశాడు.. ధరణి పోర్టల్‌లో సమస్యలున్నాయని, కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లో రిజిస్ట్రేషన్ ఆ వెంటనే మ్యూటేషన్ మినహా మిగతా సమస్యలేవి పరిష్కారం కావడం లేదంటున్నారు.
ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌కు చెప్పే పరిస్థితి మాపార్టీలో ఏ ఒక్క నాయకుడికి కూడ లేదని సదరు నాయకుడు వాపోయాడు… రాష్ట్రంలో క్లియర్‌గా ఉన్న చాలా భూములు అకారణంగా పెండింగ్‌లో పెట్టారని, అవి ఎందుకు పెండింగ్‌లో పెట్టారో కూడ ఎవరికి అర్థం కాదని వ్యవసాయ రంగనిపుణులు ఒకరు అన్నారు. కొన్ని భూములకు పట్టాదార్ పాస్ పుస్తకం ఇచ్చిన తరువాత నోషనల్ ఖాతాలో పెట్టారని అంటున్నారు.
గ్రామాల్లో ధరణి పోర్టల్ సమస్యలు అధికార పార్టీ నేతలకు ఇబ్బంది కరంగా మారనున్నది. ఇప్పటికే గ్రామాల్లో రైతులు అధికార పార్టీ నేతలను ప్రశ్నిస్తున్నారు. మీరు ఇచ్చే రైతు బంధు, రైతు బీమా సంగంతి సరే కానీ మా భూమే మాకు కాకుండా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. రైతు బంధు కింద రూ. 10 వేలు ఇస్తున్నారు కానీ, రైతు భీమా కింద చనిపోయిన తరువాత రూ. 5 లక్షలు ఇస్తున్నారు.
కానీ, లక్షల రూపాయల విలువ చేసే తమ భూమిని తమకు కాకుండా ఎందుకు చేస్తున్నారో చెప్పమని అడుగుతున్నారు. ఇంటి వద్దకు వచ్చే వాన్ని అడుగుదామనుకుంటే వీఆర్‌ఓను లేకుండా చేశారు మండలాఫీసుకు వెళితే తాసీల్దారు నాకు తెలువదు.. కలెక్టర్‌ను అడుక్కోవాలంటున్నాడు. కలెక్టర్ కలిసేదెప్పుడు, సమస్య పరిష్కరించేది ఎప్పుడని అధికార పార్టీ నేతలను రైతులు ప్రశ్నిస్తున్నారు. మీరు ఇచ్చే పది వేల రూపాయల రైతు బంధు.. మీ సేవలో దరఖాస్తులకు చెల్లించే ఫీజులకు సరిపోవడం లేదని అడుగుతున్నారు.
అప్రకటిత విద్యుత్ కోతలు రాష్ట్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. రైతులు తమ పొంట పొలాలను ఎలా రక్షించుకోవాలో అర్థం కాక ధర్నాలకు దిగుతున్నారు. ఒక వైప వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నానని చెపుతున్నారు. మరో వైపు ఉచిత విద్యుత్ నష్టాలను అధిగమించడానికి భారీ ఎత్తున ఏసీడీ చార్జీల పేరుతో వేలకువేలు బ్లిలులు పెంచుతున్నారు.
ఏసీడీ చార్జీల పెంపుపై అన్ని వర్గాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధిక కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా అధికారును దిగ్బంధించిన విషయం తెలిసిందే.. ఇలా కరెంటు చార్జీల పెంపు, కరెంటు కోతలు, ధరణి సమస్యలు తమను పుట్టి ముంచుతాయా? అన్నా ఆందోళనలో అధికార పార్టీ నేతలున్నట్లు తెలుస్తోంది.
130 ఏళ్లు కాస్తులో ఉన్న నా 50 ఎకరాల భూమి ధరణి వల్ల ఇతరుల పేరు మీదకు వెళ్లింది
130 ఏళ్లుగా తమ కాస్తులో ఉన్న 50 ఎకరాల భూమి ధరణి వల్ల ఇతరుల పేరు మీదకు వెళ్ళిందని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందని రైతు సుందర్‌లాల్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు. తాను ఎంత మంది రాజకీయ నాయకులు, అధికారుల చుట్టు తిరిగినా న్యాయం జరగలేదని వాపోయాడు. తనకు చావే శరణ్యమని.. అందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి సుందర్ లాల్ అనే వ్యక్తి గోడు వెళ్లబోసుకున్నాడు.
13న అన్ని జిల్లాల్లో విద్యుత్ కార్యాలయాల ముందు ధర్నా: కిసాన్ కాంగ్రెస్
తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం వ్యవసాయానికి 10 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు. ఇచ్చే కరెంట్ కూడా ఎప్పుడూ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. 24 గంటలు కరెంట్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. పంటలు అన్ని ఎండిపోతున్నాయి. రైతులు ఇబ్బందులలో ఉన్నారు. 24 గంటలు సాగుకు కరెంట్ ఇవ్వాలని ఈ నెల 13వ తేదీన అన్ని జిల్లాల్లో విద్యుత్ కార్యాలయాల ముందు ధర్నాకు కిసాన్ కాంగ్రేస్ పిలుపునించ్చింది. ఈ ధర్నాను విజయవంతం చేయాలని కోరుతున్నాం.
- మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, ఇంచార్జ్ ఆర్గనైజేషన్