యాదగిరిగుట్టలో వైభవంగా ధ్వజారోహణం

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల రెండవ రోజు ఉదయం ధ్వజారోహణం, భేరీ పూజ, దేవతాహ్వానం కార్యక్రమాలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. శ్రీ స్వామి వారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం ఉదయం 8 గంటలకు అగ్ని ప్రతిష్ట చేసి శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా యజ్ఞాచార్యుల ఆధ్వర్యంలో ప్రధానార్చక బృందం పారాయణికుల బృందం ధ్వజారోహణ ఘట్టాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. వేద స్వరూపుడైన గరుత్మంతుని చిత్రపటం తో కూడిన గరుడాళ్వార్ ధ్వజపటాన్ని ధ్వజస్తంభమునకు అలంకరించి బ్రహ్మోత్సవములకు సకల దేవ […]

  • Publish Date - February 22, 2023 / 09:55 AM IST

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల రెండవ రోజు ఉదయం ధ్వజారోహణం, భేరీ పూజ, దేవతాహ్వానం కార్యక్రమాలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు.

శ్రీ స్వామి వారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం ఉదయం 8 గంటలకు అగ్ని ప్రతిష్ట చేసి శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా యజ్ఞాచార్యుల ఆధ్వర్యంలో ప్రధానార్చక బృందం పారాయణికుల బృందం ధ్వజారోహణ ఘట్టాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు.

వేద స్వరూపుడైన గరుత్మంతుని చిత్రపటం తో కూడిన గరుడాళ్వార్ ధ్వజపటాన్ని ధ్వజస్తంభమునకు అలంకరించి బ్రహ్మోత్సవములకు సకల దేవ కోటిని, ప్రాణికోటిని ఆహ్వానించారు. గరుడాళ్వార్ కు గరుడ ముద్దలను ఎగురవేసి నివేదించిన నైవేద్య ప్రసాద గరుడ ముద్దల కోసం భక్తులు, మహిళలు పోటీపడ్డారు.

సాయంత్రం స్వామి వారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం భేరీ పూజ దేవత ఆహ్వానం కార్యక్రమాలను నిర్వహించారు. భేరీ ధ్వనులతో రాగతాళ స్త్రోత పాఠములతో దేవతాహ్వానం నిర్వహించి, మంత్రపూర్వకంగా 33 కోట్ల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించి ఉత్సవాంతం వరకు భక్త కోటిని అనుగ్రహించమని ఈ వేడుక పరమార్థం.

అనంతరం దేవతలకు భక్తిశ్రద్ధలతో పంచ సూక్త పఠనములతో హావిస్సులు అందజేసి, వారిని సంతృప్తి పరిచే హవనం కార్యక్రమాన్ని శాస్త్ర, సాంప్రదాయాల మేరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, కార్యనిర్వహణ అధికారి గీత, ఆలయ అధికారులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.