ఈ నెలలోనే గ్రూప్‌-2, 3 ఉద్యోగ నోటిఫికేషన్లు..?

విధాత‌: నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడనున్నాయా? తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దీనికోసం కసరత్తు పూర్తి చేసిందా? అంటే కమిషన్‌ వర్గాలు అవుననే అంటున్నాయి. అంతేకాదు ప్రభుత్వ విభాగాల్లోని మరికొన్ని పోస్టులను గ్రూప్‌-2,3 పరిధిలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పోస్టుల సంఖ్య కూడా పెరగనున్నాయి. సంక్షేమశాఖల్లో ఎస్సీ (17), ఎస్టీ (9), బీసీ (17) సహాయ సంక్షేమ అధికారి పోస్టులు 43 వరకు, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని […]

  • Publish Date - December 17, 2022 / 07:56 AM IST

విధాత‌: నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడనున్నాయా? తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దీనికోసం కసరత్తు పూర్తి చేసిందా? అంటే కమిషన్‌ వర్గాలు అవుననే అంటున్నాయి. అంతేకాదు ప్రభుత్వ విభాగాల్లోని మరికొన్ని పోస్టులను గ్రూప్‌-2,3 పరిధిలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పోస్టుల సంఖ్య కూడా పెరగనున్నాయి.

సంక్షేమశాఖల్లో ఎస్సీ (17), ఎస్టీ (9), బీసీ (17) సహాయ సంక్షేమ అధికారి పోస్టులు 43 వరకు, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జువైనల్‌ సర్వీస్‌ విభాగంలో 11 జిల్లా ప్రొబేషనరీ అధికారి పోస్టులతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఏఎస్‌వో అధికారుల పోస్టులు కలిపి గ్రూప్‌-2లో సుమారు 120 వరకు కొత్త పోస్టులు రావడంతో 780పైగా ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

గ్రూప్‌ -3 పరిధిలోకి అకౌంటెంట్‌ (గిరిజన సంక్షేమ శాఖలో), ఇతర విభాగాధిపతుల కార్యాలయాల్లో సీనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అకౌంటెంట్‌లతో పాటు వీటికి సమానమైన ఉద్యోగాలను చేర్చింది. ఇప్పటికే అనుమతి ఇచ్చిన 1,373 పోస్టులకు అదనంగా మరిన్ని పోస్టులు పెరుగనున్నాయి. ఈ పోస్టులపై కమిషన్‌ ఇప్పటికే కార్యాచరణ పూర్తిచేసింది.

గ్రూప్‌-2 కింద 683, గ్రూప్‌-3 కింద 1,373 పోస్టులను గుర్తిస్తూ ప్రభుత్వం ఆగస్టు 30న జీవో విడుదల చేసింది. వీటితో పాటు అదనంగా వేర్వేరు విభాగాల్లో మరికొన్ని ఉద్యోగాల భర్తీ కోసం అనుమతి ఇచ్చింది.

వీటన్నింటికీ నోటిఫికేషన్లు జారీ చేసి భర్తీ చేయాలని కమిషన్‌ ఇప్పటికే నిర్ణయించింది. గ్రూప్స్‌ ఉద్యోగాలకు ప్రభుత్వ విభాగాల నుంచి ప్రతిపాదనల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయింది. ఈ నెలలోనే గ్రూప్‌-2, 3 ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్నాయి.