విధాత: రానున్న ఎన్నికలలో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి మంగళవారం బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గతంలో తండ్రి ఎన్నికల ప్రచారంలో అడపాదడపా కనిపించిన అమిత్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లుగా ప్రకటించిన తర్వాత గుత్తా వెంకట్‌రెడ్డి ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు పరిమితమయ్యారు. తాజాగా ఆయన మంగళవారం నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండల బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన ర్యాలీ, సభకు హాజరయ్యారు.
రాజకీయ అరంగేట్రం ప్రకటన పిదప తొలిసారిగా సొంత మండలం చిట్యాల కేంద్రంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ భారీ ర్యాలీలో పాల్గొన్న అమిత్ రెడ్డి ర్యాలీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ర్యాలీలో పాల్గొన్న అమిత్ రెడ్డి అనంతరం జరిగిన చిట్యాల మండల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. అమిత్ రెడ్డి ఏం మాట్లాడుతారోనని, ఎలా మాట్లాడుతారోనని కార్యకర్తలు, ప్రజలు ఆసక్తి కనబరిచారు.
అమిత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి పథంలో పురోగమిస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
బిఆర్ఎస్ పార్టీ సారథి సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. బిఆర్ఎస్ పార్టీ పైన రాష్ట్ర ప్రజలకి సంపూర్ణమైన విశ్వాసం కలిగించేలా బిఆర్ఎస్ నేతలందరూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకి వివరించాలని కోరారు.
నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం అందరం కలిసి కట్టుగా పని చేయాలని చెప్పారు. బిఆర్ఎస్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి మూడోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.