Gutta Sukhender Reddy
- వారసుడికి టికెట్ ఆశిస్తున్నా..
- ఇవ్వకపోతే పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తాం
- శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
విధాత: బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఎవరు వెళ్లడం లేదని కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి పలువురు నేతలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
మీడియాతో చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ లో చేరుతాం అని చెప్పుకునే ఖమ్మం, మహబూబ్ నగర్ నేతలు పొంగులేటి, జూపల్లిలు వాళ్ల గురించి వాళ్లు ఎక్కువగా ఉహించుకుంటున్నారన్నారు.
ఖమ్మంలో 2018 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు BRS కు వస్తాయన్నారు. వేముల వీరేశం కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జిల్లా రాజకీయాల్లో అంతర్గత కలహాలు అనేది సహజమన్నారు. జిల్లా నాయకత్వం పై పూర్తిస్థాయి సంతృప్తి ఎక్కడా ఉండదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీల మార్పులు, అభ్యర్థుల మార్పులు చేర్పులు సహజమన్నారు.
తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనన్నారు. తనకు బదులుగా తన కుమారుడు అమిత్ రెడ్డి ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నారన్నారు. టికెట్ల విషయంలో మార్పులు చేర్పులు చేసిన పక్షంలో టికెట్ దక్కవచ్చన్నారు. టికెట్ ఇస్తే తన కుమారుడు పోటీలో ఉంటారన్నారు. తన కుమారుడికి టికెట్ దక్కని పక్షంలో పార్టీ ఖరారు చేసిన అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామన్నారు.
వారసుల టికెట్ల కోసం తాను పార్టీ మారబోనని స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయాలు అనేవి కేవలం గుర్తింపు వరకు మాత్రమేనని, గెలుపు కోసం పనికిరావన్నారు. నల్గొండ జిల్లాలో 12 స్థానాలలోను బిఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందన్నారు.
రెండు జాతీయ పార్టీల అధ్యక్షులకు రాష్ట్రంపై అవగాహన లేదని, విషయ పరిజ్ఞానం లేదన్నారు.
కాంగ్రెస్ లేకుండా కూటమి అని కేసీఆర్ అన్నందునే విపక్ష సమావేశాలకు కేసీఆర్ వెళ్లడం లేదన్నారు. రేవంత్ రెడ్డి మాటలకు అంతూ పొంతు ఉండదని, రేవంత్ రెడ్డి పార్టీ మారలేదా? అని ప్రశ్నించారు. రేవంత్ పార్టీ మారినప్పుడు రాజీనామా లేఖను స్పీకర్ కు ఇవ్వకుండా పార్టీ అధ్యక్షుడికి ఇచ్చాడన్నారు.
పార్టీ ఫిరాయింలు ఆపేందుకు చట్టం తేవాల్సింది కేంద్రమేనని, అలాంటి కేంద్రమే ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందే తప్ప ఒక్క న్యాయం చేయలేదన్నారు. రెండు రాష్ట్రాల విభజన హామీలు కేంద్రం పరిష్కరించడంలో విఫలం అయిందన్నారు.
మోడల్ స్కూల్ కాన్సెప్ట్ ను యుపిఏ ప్రభుత్వానికి తనిచ్చిందేనన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక వెనుకబడిన తరగతులకు అన్యాయం చేస్తోందన్నారు.