Nalgonda |Gutta Sukhender Reddy
- తండ్రి ప్రెస్ మీట్.. తనయుడికి అధ్యాయన కేంద్రం
విధాత: రాజకీయాల్లో తండ్రి పెద్ద నేత ..ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి అత్యధిక కాలం పార్లమెంటు సభ్యుడిగా పని చేసిన అనుభవం ఆయనది. పంచాయతి వార్డ్ మెంబర్ స్థాయి నుండి పార్లమెంట్ మెంబర్ దాకా ఎదిగి.. రాష్ట్ర చట్టసభలలో ఒకటైన శాసనమండలికి ప్రస్తుతం చైర్మన్ హోదాలో ఉన్నారు. ఆయనే గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇక ఆయన తనయుడు గుత్తా అమిత్ రెడ్డి రాజకీయ అరంగ్రేటం కోసం ఉవ్విళ్లురుతున్నారు.
ఇందుకు తన తండ్రినే గురువుగా చేసుకొని ఆయన మార్గదర్శకంలో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. తాజాగా మంగళవారం నల్గొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్ లో ఆయన తనయుడు అమిత్ రెడ్డి విలేకరులకు కేటాయించిన కుర్చీలలో కూర్చొని తండ్రి ప్రెస్ మీట్ ను ఆసక్తిగా గమనించిన తీరు రాజకీయ రంగంలో త్వరగా ఎదగాలన్న ఆయన తపనకు నిదర్శనంగా కనిపించింది.
రాజకీయ కుటుంబం నుండి వచ్చానన్న గర్వంతో కాకుండా ఓర్పుతో వినయంతో ప్రత్యక్ష రాజకీయాల్లో వ్యవహరించాల్సిన తీరుపై అధ్యయనం, ఆచరణ అన్నట్లుగా అమిత్ రెడ్డి తన కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నారు. సహజంగానే ప్రముఖ రాజకీయ నేత సుఖేందర్ రెడ్డి రాజకీయ వారసుడిగా అమిత్ రాజకీయ కార్యకలాపాలపై జనం ఫోకస్ పెరుగుతూ వస్తుంది. సుఖేందర్ రెడ్డికి రాజకీయ వారసుడిగా తనపై పెరుగుతున్న అంచనాలను అందుకునేందుకు అమిత్ రెడ్డి కూడా తన కార్యక్రమాల సంఖ్యను పెంచుతూ కార్యకర్తలతోనూ, జనంలోను కలివిడిగా మమేకమవుతు అత్మీయతను ప్రదర్శిస్తూ ముందడుగు వేస్తున్నారు.
నిన్నటిదాకా గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలతో జనంలో సందడి చేసిన అమిత్ రెడ్డి క్రమంగా బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలతో పాటు పార్టీ పరంగా జరిగే కార్యక్రమాలకు హాజరవుతూ రాజకీయాల్లో జోరు పెంచేశారు.
అటు నల్లగొండ, ఇటు మునుగోడు అసెంబ్లీ స్థానాలతో పాటు నల్గొండ పార్లమెంటు స్థానంలో ఎక్కడైనా కూడా పార్టీ అధిష్టానం పోటీకి దించినా సిద్ధమయ్యేందుకు ఆయా నియోజకవర్గాలలో తండ్రి సుఖేందర్ రెడ్డి డైరెక్షన్లో పర్యటిస్తున్నారు.
వీలైనంత త్వరగా తండ్రి చాటు కొడుకు ముద్ర నుండి బయటపడి స్వీయ గుర్తింపుతో రాజకీయంగా ఎదిగేందుకు అమిత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఆయా నియోజకవర్గాలలో అమిత్ రెడ్డి పర్యటనలు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కాక రేపుతుండటం మరో ఆసక్తికర అంశంగా మారింది.