గ్రహాంతర వాసులు ఎక్కడ ఉన్నారో అంచనా వేసిన హార్వర్డ్‌ ప్రొఫెసర్‌!

  • Publish Date - April 10, 2024 / 06:40 PM IST

హార్వర్డ్‌: గ్రహాంతర వాసుల గురించి చర్చ ఈనాటిది కాదు. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు కొత్తవాదనలు లేవదీస్తూనే ఉంటారు. ఎగిరే పళ్లేలు (యూఎఫ్‌వో- అన్‌ఐడెంటిఫైడ్‌ ఫ్లయింగ్‌ ఆబ్జెక్ట్స్‌) కనిపించాయని అక్కడో ఇక్కడో వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే.. తాజాగా హార్వర్డ్‌ ప్రొఫెసర్‌ అవి లోయెబ్‌ ఒక కొత్త వాదన ముందుకు తీసుకువచ్చారు.

గ్రహాంతర వాసుల మనుగడపై పరిశోధనలకు ఆయన పేర్గాంచారు. భూ ఉపరితలానికి మూడు వందల అడుగుల లోతున గ్రహాంతర వాసులు ఉండి ఉండొచ్చని కొత్త వాదన ముందుకు తెచ్చారు. అయితే.. అమెరికా ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకూ యూఎఫ్‌వో వంటి అనుమానాస్పద వస్తువులు కనిపించడాన్ని ధృవీకరించలేదు.

శాస్త్రవేత్తలు సృష్టించిన సెర్న్‌ పార్టికిల్‌ యాక్సిలేటర్‌ ద్వారా రహస్యమార్గంలో వారు భూమిలోకి ప్రవేశించి ఉంటారని అవి లోయెబ్‌ చెప్పారు. బిగ్‌బ్యాంగ్‌ తరహా పరిస్థితిని పునఃసృష్టించేందుకు భారీ సొరంగంలో లార్జ్‌ హేడ్రన్‌ కొల్లిడర్‌ (ఎల్‌హెచ్‌సీ)ని రూపొందించిన సంగతి తెలిసిందే. పార్టికిల్స్‌ను కాంతివేగంతో ఢీకొనడం ద్వారా బిగ్‌ బ్యాంగ్‌ తరహా పరిస్థితిని సృష్టించడం దీని ఉద్దేశం. విశ్వం ఎలా ఏర్పడిందో తెలుసుకునేందుకు ఈ ప్రయోగం చేపట్టారు.

దాగి ఉన్న గ్రహాంతరవాసుల గురించి మాట్లాడిన లోయెబ్‌.. ఈ ఖండాంతర వాసులు డైమెన్షన్‌ హోపింగ్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు వందల కోట్ల సంవత్సరాలు వెచ్చించి ఉండొచ్చని ఆయన అన్నారు. థియెరెటికల్‌ క్వాంటం గ్రావిటీ ఇంజినీరింగ్‌ ద్వారా మెలికలు తిరిగే మార్గాన్ని ఉపయోగించేవారని, అది సెర్న్‌ వంటి యాక్సిలేటర్ల ద్వారానే కనుగొనడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

అసాధారణ యూఎఫ్‌వో కనెక్షన్‌ అనే డాక్యుమెంటరీలో హార్వర్డ్‌ శాస్త్రవేత్త తన వాదనలు వినిపిస్తూ.. గ్రహాంతరవాసుల సాంకేతికత మనల్ని తాకిన వేళ మనం నివ్వెర పోతామని చెప్పారు. అదెలా ఉంటుందంటే.. ఒక గుహలో నివసించే వ్యక్తి.. ఉన్నట్టుండి లండన్‌ లేదా యూరప్‌లోని నగరాలకు వచ్చి, అక్కడి సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక పరికరాలు చూసి ఎలా ఆశ్చర్యపోతాడో.. మన పరిస్థితి కూడా అంతేనని అన్నారు. మతపరమైన భక్తిభావనల అంశం కూడా ఉంటుందని, అది మనకు అర్థం కూడా కాకపోవచ్చని చెప్పారు.

Latest News