విధాత: ప్రపంచ అపర కుభేరుడు ఎలాన్ మస్క్.. ఏ ముహూర్తాన ట్విట్టర్‌ను సొంతం చేసుకొన్నాడో కానీ.. నాటి నుంచి ఆయన ప్రతి అడుగు వివాదాస్పదం అవుతున్నది. అంతకు ముందు పట్టిందల్లా బంగారమన్నట్లుగా కొనసాగిన మస్క్ వ్యాపార సామ్రాజ్య విజయయాత్ర ట్విట్టర్ తీసుకొన్న తర్వాత ఊహించని నష్టాలు చవిచూస్తున్నది.
అన్నింటి కన్నా ముఖ్యమైనది.. ట్విట్టర్ ఒక సంస్థగా కూడా అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్నది.అతి తక్కువ కాలంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగిన ఎలాన్ మస్క్ విజయాలు అసమానమైనవి. అతిపిన్న వయస్సులోనే వ్యాపార సామ్రాజ్యంలో అడుగుపెట్టి తనదైన వినూత్న ఆలోచనలు, ఆచరణలతో అంతకంతకూ ఎదిగిపోయాడు. అపరకుభేరుడిగా ఎదిగాడు.
2002లో స్పేస్ ఎక్స్‌ను స్థాపించిన మస్క్ ఆతర్వాత టెస్లా, బోరింగ్ కంపెనీ, న్యూరాలింక్ అండ్ ఓపెన్ ఏఐ లాంటి కార్పొరేట్ సంస్థల వ్యవస్థాపకుడిగా, కొన్నింటిలో భాగస్వామిగా అఖండ విజయాలు సొంతం చేసుకొన్నాడు. అంతులేని సంపదకు అధిపతి అయ్యాడు.
2006లో మొదలైన సోషల్ మీడియా సేవాసంస్థ ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ 2022 అక్టోబర్‌లో సొంతం చేసుకొన్నాడు. అలా సొంతం చేసుకొన్న మరునాటి నుంచే ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. మొదట.. కష్టపడి పనిచేస్తూ ఎప్పటికప్పుడు నాణ్యతలను పెంచుకొనే వారికే ఉద్యోగాలు ఉంటాయని ప్రకటించాడు.
ఉద్యోగులు కష్టపడి పనిచేస్తూ.. ఇంటికి పోవటం గురించి ఆలోచించ కూడదని షరతు విధించాడు. ప్రతి ఉద్యోగి కనీసం పన్నెండు గంటలు పనిచేయాలని కండిషన్ పెట్టడంతో తీవ్ర విమర్శలొచ్చాయి. ముఖ్యంగా ట్విట్టర్ నిర్వహణా వ్యయం తగ్గింపు పేర ఉద్యోగులను తగ్గించుకొనే కార్యక్రమానికి మస్క్ శ్రీకారం చుట్టాడు. అందుకోసం ఉద్యోగుల్లో 50శాతం కోత విధించేందుకు ఉపక్రమించాడు. దీంతో అమెరికా మొదలు ప్రపంచ వ్యాప్తంగా విమర్శలొచ్చాయి. ఉన్నపలాన రాత్రికి రాత్రి వేలు, లక్షల్లో ఉద్యోగులను తొలగించడంతో మస్క్ నిర్వహణా తీరుపై విమర్శలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ట్విట్టర్ ప్రధాన కార్యాలయ కేంద్రాలు శాన్‌ఫ్రాన్సిస్కో, క్యాలిఫోర్నియాలో ఉన్నాయి. ఈ కార్యాలయాల్లో కూడా నిర్వహణా సిబ్బందిని తొలగించి ఖర్చు తగ్గించుకొనేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే.. శాన్‌ఫ్రాన్సిస్కో కార్యాలయంలోని నిర్వహణా సిబ్బంది తమ వేతనాలు పెంచాలని సమ్మె చేశారు. దీంతో సమ్మెకు దిగన నిర్వహణా సిబ్బంది మొత్తాన్ని ట్విట్టర్ యాజమాన్యం తొలగించింది.
దీంతో మొత్తం కార్యాలయమే స్తంభించి పోయింది. మంచినీరు అందించే వారు లేరు. ఊడ్చే వారు లేక కార్యాలయం దుమ్ము కొట్టుకుపోయింది. టాయిలెట్లు కడిగే వారు లేక దుర్గంధ పూరితమయ్యాయి. ఉద్యోగులు కనీస అవసరాలు తీరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు తమ ఇంటి నుంచే టాయిలెట్ పేపర్‌ను తెచ్చుకొనే దుస్థితి ఏర్పడింది.
మరో వైపు 6 అంతస్తుల్లో పనిచేస్తున్న ప్రధాన కార్యాలయంలోని ఉద్యోగులను రెండు అంతస్తుల్లోనే పని చేయాలని యాజమాన్యం ఆదేశించింది. మిగిన నాలుగు అంతస్తులు మూసేశారు. ఎందుకంటే.. వాటి కిరాయి కట్టే పరిస్థితి లేదని యాజమాన్యం చెప్పుకొస్తున్నది.
నిజానికి ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న నాటి నుంచి ఎలాన్ మస్క్ విధాన నిర్ణయాలన్నీ వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. తాజాగా ఉద్యోగులు కూర్చొని పనిచేయలేని స్థితి కల్పించటం వారిని చెప్పకుండా ఇంటికి పొమ్మనటంగానే కంపెనీ వ్యవహరాల పరిశీలకులు చూస్తున్నారు. తాగే నీళ్లు, టాయ్‌లెట్ పేపర్ కూడా ఉద్యోగులు తమ ఇంటి నుంచి తీసుకొని పోవాల్సి రావటం కార్పొరేట్ సంస్కృతికి అవమానకరమే.