విధాత: తెలంగాణలో యాసంగి( రబీ) ధాన్యం కొనుగోలు ప్రక్రియ కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకుండా జాప్యం చేస్తున్న కొద్దీ రైతన్నల కష్టనష్టాలు అధికమవుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏప్రిల్ నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని చెప్పిన అధికారులు ఇప్పటి దాకా అందుకు అవసరమైన చర్యలు చేపట్టడంలో తాత్సర్యం చేస్తుండటం పట్ల రైతాంగంలో అసహనం వ్యక్తం అవుతుంది.
తరచూ అకస్మాత్తుగా ఈదురు గాలులు, వడగళ్లతో విరుచుకుపడుతున్న అకాల వర్షాలతో చేతికొచ్చిన వరి పంటలు కళ్లముందే దెబ్బతిని నష్టపోతున్నామన్న ఆందోళన రైతాంగాన్ని ఆగ్రహానికి, ఆవేదనకు గురిచేస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున వరి కోతలు సాగుతుండగా, తరలివస్తున్న ధాన్యం రాసులతో ఐకెపి, పిఎసిఎస్ సెంటర్లు, మార్కెట్ యార్డులు కిక్కిరిసిపోతున్నాయి.
కల్లాల వద్ద నుంచి కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని సైతం అకాల వర్షాల బారిన పడకుండా కాపాడుకునేందుకు రైతులు నిత్యం నానా తంటాలు పడుతున్నారు. చేతికొచ్చిన పంటలు అకాల వర్షాలతో దెబ్బతిని ధాన్యం నీటిపాలై నష్టపోతామన్న భయంతో తక్కువ ధరకే కల్లాల వద్దకు వస్తున్న కమీషన్ వ్యాపారులకు రైతులు తమ ధాన్యాన్ని విక్రయిస్తూ మద్దతు ధరను నష్టపోతున్నారు.
ప్రస్తుత యాసంగిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 30.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, అందులో 20 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దొడ్డు ధాన్యం, 10.97 లక్షల మెట్రిక్ టన్నుల వరకు సన్నధాన్యం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి జిల్లాలో 848 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నల్గొండ జిల్లాలో 13 లక్షల మెట్రిక్ టన్నులలో ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, ఐదు లక్షల టన్నుల సన్న రకం ధాన్యం మార్కెట్ కు వస్తుందని అంచనా వేశారు. దొడ్డు రకం దాన్యం కొనుగోలుకు 121 ఐకెపి కేంద్రాలు, 150 పిఎసిఎస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పినా 271 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటిదాకా ఒక్కటి కూడా తెరవలేదు.
సూర్యాపేట జిల్లాలో ఏడు లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 5 లక్షల టన్నుల సన్న రకం దాన్యం దిగబడి అవుతుందన్న అంచనా తో దొడ్డు రకం ధాన్యం కొనుగోలుకు 170 ఐకెపి, 106 పిఎసిఎస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐదు లక్షల టన్నుల దొడ్డు రకం, 79 వేల టన్నుల సన్న రకం దాన్యం దిగుబడి అంచనా వేసి దొడ్డు రకం దాన్యం కొనుగోలు కోసం 78 ఐకెపి, 250 పిఎసిఎస్, నాలుగు మార్కెటింగ్ శాఖ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి తొలుత అవసరమైన రెండు కోట్ల గన్ని బ్యాగులు, తార్ఫాలిన్లు, తేమనిర్ధారణ యంత్రాలు, ఎలక్ట్రానిక్ కాంటాలు సిద్ధం చేస్తామని అధికారులు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు ఎక్కడా ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా తెరవలేదు.
తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నల్గొండ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, నల్లగొండ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 10న జిల్లా కలక్టరేట్ ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు సుమారు 6వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలను ఆదుకోవడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని పలువురు అఖిలపక్షం నాయకులు విమర్శించారు.
రాష్ట్రంలో వెంటనే ఐకేపి సెంటర్లు తెరవాలని దుబ్బాక నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జరిగే కలెక్టరేట్ ముట్టడి, ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు టీజేఏసి నేత పన్నాల గోపాల్ రెడ్డి, టీడీపీ నల్లగొండ ఇన్‌చార్జి ఎల్వీ యాదవ్, దుడుకు లక్మ్షీనారాయణ, పర్వతాలు, తేలు రవి, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బొంత వెంకటయ్య, సూరెడ్డి సరస్వతి, వైస్ ఎంపిపి జిల్లేపల్లి పరమేష్, అల్లి సుభాష్ యాదవ్, జాన్ రెడ్డి, భాగ్య, వెంకటరెడ్డి, ఎంపిటిసి గిరిచైతన్య, పనస శంకర్, చర్లపల్లి గౌతమ్, మర్రి మదన్, పగిళ్ళ శివ, సుజాత తదితరులు పాల్గొన్నారు.