Warangal | జల దిగ్బంధంలోనే వరంగల్

Warangal లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం హెలికాప్టర్ తో సహాయక చర్యలు వరంగల్ సిటీలో ఇళ్ళచుట్టూరా నీళ్ళు స్లమ్ ఏరియా ప్రజల తీవ్ర అవస్థ ములుగు,భూపాలపల్లి జిల్లాలో అడవిబిడ్డల అవస్థలు నిండుకుండలా జలాశయాలు గండ్లుపడే ప్రమాదంతో ఆందోళన పొంచి ఉన్న అంటురోగాల ముప్పు మంత్రి ఎర్రబెల్లి పర్యవేక్షణ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరుస కుండపోత వర్షభీభత్సంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలు, పల్లెలు, వరంగల్ సిటీ, జిల్లాలోని ప్రధాన రోడ్లు పూర్తిగా జలమయమై అతలాకుతలమయ్యాయి. వరుస వర్షాలు, […]

  • Publish Date - July 28, 2023 / 01:31 AM IST

Warangal

  • లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
  • హెలికాప్టర్ తో సహాయక చర్యలు
  • వరంగల్ సిటీలో ఇళ్ళచుట్టూరా నీళ్ళు
  • స్లమ్ ఏరియా ప్రజల తీవ్ర అవస్థ
  • ములుగు,భూపాలపల్లి జిల్లాలో అడవిబిడ్డల అవస్థలు
  • నిండుకుండలా జలాశయాలు
  • గండ్లుపడే ప్రమాదంతో ఆందోళన
  • పొంచి ఉన్న అంటురోగాల ముప్పు
  • మంత్రి ఎర్రబెల్లి పర్యవేక్షణ

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరుస కుండపోత వర్షభీభత్సంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలు, పల్లెలు, వరంగల్ సిటీ, జిల్లాలోని ప్రధాన రోడ్లు పూర్తిగా జలమయమై అతలాకుతలమయ్యాయి. వరుస వర్షాలు, వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన మురికినీరు, వర్షం నీరు కలగలిసి ప్రజలు శుక్రవారం ఉదయం నాటికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోని వస్తువులు, బియ్యం, ఇతరత్రా సామాగ్రి తడిసిపోయి, బురద నీరు ఇళ్లల్లోకి చేరి అవస్థలు పడుతున్నారు.

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ములుగు, భూపాలపల్లి గిరిజన ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరంగల్ నగరంలోని కాలనీలను వర్షం నీరు, డ్రైనేజీ నీరు చుట్టేసింది. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ తమ ఇండ్ల పరిస్థితి ఎలా ఉందో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాజీపేట, బల్లార్షా మార్గంలో హసన్‌పర్తి సమీపంలో రైలుపట్టాల పైకి చేరిన నీరు గురువారం రాత్రి తగ్గింది. దీంతో రైళ్లు యథాతథంగా కొనసాగుతున్నాయి.

జలదిగ్బంధంలో ఉన్న వరంగల్ లోతట్టు ప్రాంతాలు

ముఖ్యంగా వరంగల్ నగరంలోని స్లమ్ ఏరియాలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో కూరుకపోయాయి. వరంగల్ సిటీలో దాదాపు 56 కాలనీలు కాలనీలలో వర్షం నీరు డ్రైనేజీ నీరు కలగలిసి చుట్టుముట్టింది. ఇళ్లల్లోకి ఇంటి చుట్టూ నీరు చేరి రోడ్లు కుంటలను తలపించడంతో స్థానికంగా నివసించే ప్రజలు ఆందోళనకు లోనవుతున్నారు. మునిసిపల్ కార్పొరేషన్, ఎన్ డిఆర్ఎఫ్, ఇరిగేషన్ అధికారులు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాలలో జలమయమైన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

నగరంలోని భద్రకాళి, చిన్నవడ్డేపల్లి పరిసర ప్రాంతాలలో ఎన్డీఆర్ఎఫ్ బోట్లను వినియోగించారు. అయినప్పటికీ సరిగ్గా నాళాలు లేకపోవడం, కుంటల ఆక్రమణ ఫలితంగా నీరు సాఫీగా వెళ్లిపోవడం లేదు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రకాళి ఎఫ్డిఎల్ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం చేపట్టడం, బఫర్ జోన్‌లో ఇండ్ల నిర్మాణం, నారాల ఆక్రమణ ఫలితంగా ఈ దుస్థితి నెలకొంది.

హెలికాప్టర్ తో సహాయక చర్యలు

వరంగల్ – మామునూరు హెలీ ప్యాడ్ నుండి ఏటూరు నాగారం – కొండాయిలో వరదల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న బాధితులకు హెలికాప్టర్ ద్వారా ఆహార పొట్లాలు, నీరు, మందులను పంపించారు. శుక్రవారం ఉదయం నుంచి ఈ ఏర్పాట్లు చేశారు.

హెలికాప్టర్ ద్వారా పంపిస్తున్న ఏర్పాట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, జిల్లాకలెక్టర్ ప్రావీణ్ పర్యవేక్షించారు. అలాగే భద్రాచలం ప్రాంతంలో వరదల్లో చిక్కుకుని ఆందోళన చెందుతున్న బాధితుల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ ను, రెస్క్యూ టీం లను, ఆహార, నీటి పొట్లాలను పంపించారు.

జలాశయాలకు పొంచి ఉన్న నీటి ముప్పు

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జలాశయాలు జలకళతో కన్పిస్తున్నాయి. దీంతో స్థానికంగా ఆనందంతో పాటు ఆందోళన వ్యక్తమవుతోంది. చెరువు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ వర్షాలు ఇలాగే కొనసాగితే బలహీనంగా ఉన్న చెరువుకుంటల కట్టలు తెగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఒక్క చెరువు కట్ట తెగిన ఆకస్మికంగా వచ్చే వరదను తట్టుకోలేక పల్లెలు నీట మునిగే ప్రమాదం ఉందని భయాందోళనతో ఉన్నారు.

చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, పాకాల, లక్నవరం, రామప్ప, గణపురం, రంగరాయసముద్రం, బయ్యారం, రాయపర్తి, స్టేషన్గన్పూర్ ప్రాంతాలలోని రిజర్వాయర్లు, చెరువులు దాదాపు పూర్తిగా నిండిపోయాయి. మెజారిటీ జలాశయాలు అలుగుపోస్తున్నాయి. చిన్నచిన్న చెరువులైన భద్రకాళి, వడ్డేపల్లితోపాటు కుంటలు నిండి మత్తడి పోస్తున్నాయి.

ప్రజా ప్రతినిధులు, అధికారుల పర్యటన

భారీ వర్షాలకు ముంపునకు గురైన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతాలను మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ధనసరి సీతక్క, నన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి జిల్లాల, కలెక్టర్ ప్రావీణ్య, సిక్తా పట్నాయక్,భవేష్ మిశ్ర, ఇలా త్రిపాఠి, వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషాలతో పాటు కలిసి సందర్శించారు. సీపీఐ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులూ కూడా వరద ప్రాంతాలను సందర్శించారు.

పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతున్నది. శుక్రవారం ఉదయం నీటిమట్టం 16.200 మీటర్లుగా నమోదైంది. క్రమంగా నీటిమట్టం పెరుగుతున్నట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు.

నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భూపాల్ పల్లి ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.కెటీపీఎస్‌లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

అంటురోగాల ముప్పు

ఇళ్ల చుట్టూరా నిలిచిన మురికి నీరు వర్షం నీరుతో అంటూ రోగాల ముప్పుపొంచి ఉంది. ఇప్పటికే వారం పది రోజులుగా మారిన వాతావరణంతో బ్యాక్టీరియా పెరిగి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే అవకాశం ఉంది. దీనికి తోడు ఇళ్ళ చుట్టూ, రోడ్లమీద బురద పేరుకుపోయి ఉంది. స్వచ్ఛమైన మంచినీరు కూడా లభించే అవకాశం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అటవీ ప్రాంతంలో ఈ పరిస్థితి మరింత దయనీయంగా మారనున్నది.

Latest News