Heavy Rains |
ఆగస్టు నెలంతా వానలు పెద్దగా కురవలేదు. ఆ నెల మొత్తం ఎండాకాలం మాదిరి తలపించింది. ఇక సెప్టెంబర్ నెలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెండు రోజుల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈక్రమంలో ఆదివారం నుంచి మంగళవారం వరకు ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ శుక్రవారం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉదయం వేళ పొగమంచు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో నేటి నుంచి మంగళవారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది.