Hidimba Movie Review | ‘హిడింబ’ విషయమున్న సినిమానే.. కాకపోతే హింసే!

Hidimba Movie Review | మూవీ పేరు: ‘హిడింబ’ విడుదల తేదీ: 20 జూలై, 2023 నటీనటులు: అశ్విన్ బాబు, నందితా శ్వేత, మకరంద్ దేశ్‌పాండే, శ్రీనివాస్ రెడ్డి, రాజీవ్ కనకాల, శుభలేక సుధాకర్, రఘు కుంచె, విద్యుల్లేఖ రామన్ తదితరులు సినిమాటోగ్రఫీ: బి. రాజశేఖర్ సంగీతం: వికాశ్ బాడిస ఎడిటింగ్: ఎమ్ఆర్ వర్మ సమర్పణ: అనిల్ సుంకర నిర్మాత: గంగపట్నం శ్రీధర్ రచన, దర్శకత్వం: అనిల్ కన్నెగంటి ప్రస్తుతం సక్సెస్ రేట్ బాగున్న సినిమా ఇండస్ట్రీలలో […]

  • Publish Date - July 21, 2023 / 02:40 AM IST

Hidimba Movie Review |

మూవీ పేరు: ‘హిడింబ’
విడుదల తేదీ: 20 జూలై, 2023
నటీనటులు: అశ్విన్ బాబు, నందితా శ్వేత, మకరంద్ దేశ్‌పాండే, శ్రీనివాస్ రెడ్డి, రాజీవ్ కనకాల, శుభలేక సుధాకర్, రఘు కుంచె, విద్యుల్లేఖ రామన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: బి. రాజశేఖర్
సంగీతం: వికాశ్ బాడిస
ఎడిటింగ్: ఎమ్ఆర్ వర్మ
సమర్పణ: అనిల్ సుంకర
నిర్మాత: గంగపట్నం శ్రీధర్
రచన, దర్శకత్వం: అనిల్ కన్నెగంటి

ప్రస్తుతం సక్సెస్ రేట్ బాగున్న సినిమా ఇండస్ట్రీలలో టాలీవుడ్ అగ్రస్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. మిగతా ఇండస్ట్రీలలో ఒకటీ ఆరా సినిమాలు హిట్టై, ఇండస్ట్రీ పరువును నిలబెడుతుంటే.. టాలీవుడ్‌లో మాత్రం ప్రతి వారం విడుదలవుతోన్న చిత్రాలలో ఏదో ఒకటి బ్లాక్‌బస్టర్ కాకపోయినా.. హిట్‌గా మాత్రం నిలుస్తుంది. అయితే పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తారతమ్యం.. ఆ భాష, ఈ భాష అనే భేదాలు ఎప్పుడో తొలగిపోయాయి కాబట్టి.. హిట్ అనిపించుకుంటే చాలు.. అది చిన్న సినిమా అయినా పెద్ద చిత్రంగా మారిపోతుంది. అందుకు ఉదాహరణ రీసెంట్‌గా వచ్చిన ‘కాంతార’, ‘విరూపాక్ష’, ‘బేబీ’ వంటి చిత్రాలే. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ‘బేబీ’ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. తక్కువ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమాలు బాక్సాఫీస్‌కు ఊపిరిపోస్తున్నాయి.

ఇక ప్రతివారం లానే ఈ వారం కూడా ఓ అరడజను సినిమాల వరకు బాక్సాఫీస్‌ని పలకరించబోతున్నాయి. అందులో దర్శకుడు, బుల్లితెర వ్యాఖ్యాత ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు నటించిన ‘హిడింబ’ చిత్రం అన్నిటికంటే ఒక రోజు ముందే థియేటర్లలోకి వచ్చేసింది. పెయిడ్ ప్రీమియర్లలో మంచి టాక్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమాపై మొదటి నుంచి మంచి బజ్ ఉంది. ట్రైలర్ మాత్రమే కాకుండా.. రివర్స్ ట్రైలర్ అంటూ సరికొత్తగా చేసిన ప్రయోగం కూడా సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది.

టైటిల్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతీది ఆసక్తికరంగా ఉండటంతో పాటు అనిల్ సుంకర వంటి నిర్మాత సమర్పిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అని చెప్పలేం కానీ.. అంచనాలైతే ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉందా? 2006లో ప్రయాణం మొదలెట్టి.. ప్రస్తుతం 4వ సినిమా చేస్తున్న దర్శకుడు అనిల్ ఈ సినిమాతోనైనా హిట్ అందుకున్నాడా? అసలు ‘హిడింబ’లో ఉన్న మ్యాటరేంటి? అది ప్రేక్షకులకు ఏ మేరకు ఆకట్టుకోగలదనే విషయం మన రివ్యూలో తెలుసుకుందాం.

కథేంటంటే..

వరుస కిడ్నాప్‌ల మిస్టరీని ఛేదించే నిమిత్తం కేరళ‌లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ ఆద్య (నందితా శ్వేత)ని పోలీస్ డిపార్ట్‌మెంట్ హైదరాబాద్‌కు రప్పిస్తుంది. ఆమెకు సహాయం చేసేందుకు మరో పోలీస్ అధికారి అభయ్ (అశ్విన్ బాబు)ని నియమిస్తుంది. అయితే పోలీస్ ట్రైనింగ్‌లో ఉండగానే అభయ్, ఆద్య ప్రేమించుకుంటారు. వారి ప్రేమకి ఓ కథ ఉంటుంది.

ఆ కథ సంగతి పక్కన పెడితే.. హైదరాబాద్‌లో అమ్మాయిల సీరియల్ కిడ్నాప్‌లకు సంబంధించి చేస్తున్న ఇన్వెస్టిగేషన్‌లో ఓ భయంకర నిజం అభయ్, ఆద్యలకు తెలుస్తుంది. కాలా బండలోని బోయ (రాజీవ్ పిళ్ళై) ఈ కిడ్నాప్‌లకు కారణం అని తెలుసుకుని.. సాహసం చేసి మరి అభయ్ అతనిని, అతని గ్యాంగ్‌ని పట్టుకుంటాడు. అతని వద్ద ఉన్న అమ్మాయిలందరినీ సేఫ్‌గా బయటికి తీసుకువస్తాడు.

అయితే బోయ బంధీగా చెరసాలలో ఉన్న సమయంలోనే మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. అలాగే కిడ్నాప్ అవుతున్న అమ్మాయిలకు, బోయ చెరలో ఉన్న అమ్మాయిలకు సంబంధం లేదని తెలియడంతో కేసు మళ్లీ మొదటికి వస్తుంది. అదే సమయంలో పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో ఈ కేసు మరింత రసవత్తరంగా మారుతుంది.

మరీ ముఖ్యంగా రెడ్ కలర్ డ్రస్ వేసుకున్న అమ్మాయిలే కిడ్నాప్ అవుతున్నారని ఆద్య కనిపెడుతుంది. దీంతో బోయ కాకుండా.. అసలెవరు ఈ కిడ్నాప్‌లను చేస్తున్నారు. ఆ రెడ్ కలర్‌కి, కిడ్నాప్‌లకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథకి.. కేరళలో జరిగే కిడ్నాప్‌లకు, అలాగే అండమాన్ దీవుల్లో ఉన్న ఆదిమ తెగకు చెందిన నరమాంస భక్షక హిడింబాలకు ఉన్న లింకేంటి? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఉత్కంఠభరితంగా తెరకెక్కిన ఈ సినిమాని థియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

అశ్విన్ బాబు ఇంతకు ముందు వరకు కామెడీ పాత్రలు చేసుకుంటూ వచ్చాడు. కానీ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా పర్ఫెక్ట్‌గా కనిపించాడు. ఆ ఫిజిక్, యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఆయన కనబడిన తీరు.. నిజంగా ఈ సినిమా కోసం తను చాలా కష్టపడ్డాడనిపిస్తుంది. అతని డైలాగ్ డెలివరీ కూడా ఇందులో చాలా బాగుంది. కెరీర్ పరంగా, నటనపరంగా ఈ సినిమాతో అశ్విన్ బాబు ఓ మెట్టు ఎక్కినట్లే.

నందితా శ్వేత ఈ సినిమాకు ప్రధాన పిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఆమె బాడీ లాంగ్వేజ్.. పాత్రకి చక్కగా సూటయింది. ఎమోషన్స్‌ని చాలా బాగా పండించింది. పోలీస్ ఉన్నతాధికారి పాత్రలో చాలా హుందాగా కనిపించింది. మళ్లీ కొంతకాలం ఆమె పేరు వినబడేలా ఈ సినిమా చేస్తుందనడంలో అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

పెద్దగా డైలాగ్స్ లేనప్పటికీ.. తన నటనతో భయపెట్టేస్తాడు టాలెంటెడ్ యాక్టర్ మకరంద్ దేశ్‌పాండే. అతని పాత్ర చూసే జనాలకి మాంచి కిక్కిస్తుంది. ఊహించని పాత్ర అతనికి లభించింది. ఇంకా శ్రీనివాస్ రెడ్డి, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, రాజీవ్ పిళ్ళై, రఘుకుంచె వంటి వారంతా వారి పాత్రల పరిధిమేర నటించి.. సినిమాకు మంచి హెల్పయ్యారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే..

ఈ సినిమా ఏ విషయంలోనూ చిన్న సినిమా అనే ఫీలింగ్‌ను ఇవ్వదు. వికాశ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సరికొత్తగా అనిపిస్తుంది. సినిమా తగ్గ విధంగా మ్యూజిక్ ఇచ్చి తన పాత్రకి న్యాయం చేశాడు వికాశ్. పాటలు పరంగా కూడా ఆయనకు మంచి మార్కులే పడతాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గ మూడ్‌ని క్యారీ చేసింది. నాన్ లీనియర్‌లో నడిచే కథకి కావాల్సిన అవుట్‌ఫుట్‌ని రాజశేఖర్ రాబట్టాడు. ఎడిటింగ్ పరంగా సెకండాఫ్‌లో ఓ ఎపిసోడ్ మరీ సాగదీతగా అనిపిస్తుంది. దానిపై కాస్త ఓ లుక్ వేయాల్సింది.. అంతే మిగతా అంతా పర్ఫెక్ట్‌గా సింక్ చేశాడు ఎమ్ఆర్ వర్మ.

స్క్రీన్‌ప్లే, కథ సరికొత్తగా అనుభూతిని ఇవ్వడమే కాకుండా.. కొన్ని సీన్లు సీట్ ఎడ్జ్‌లో నిలబెట్టేలా చేస్తాయి. చిన్న సినిమా అనే ఫీలింగ్ ఇవ్వలేదంటే.. నిర్మాతలు ఎంతగా ఈ సినిమాకు ఖర్చు పెట్టారో అర్థం చేసుకోవచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు అనిల్.. ఈ సినిమాని చాలా కసిగా తీసినట్లు అనిపించింది. 2006‌లో కళ్యాణ్ రామ్ ‘అసాధ్యుడు’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన అనిల్‌.. ఆ తర్వాత చేసింది రెండంటే రెండు చిత్రాలే. ‘మిస్టర్ నోకియా’, ‘రన్’. ‘హిడింబ’ నాలుగో సినిమా. అంటే సుమారు 17 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న అతని పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. అతనికి ఖచ్చితంగా ఓ హిట్ కావాలి. తనెంటో నిరూపించుకునే సినిమా కావాలి. అలాంటి సినిమానే ఇది.

విశ్లేషణ:

మంచి ఆకలి మీద ఉన్న దర్శకుడు.. మనుషుల మీద తన కసినంతా చూపించాడనేలా భయపెట్టే విధంగా కొన్ని సీన్లు డిజైన్ చేశాడు. ఈ క్రమంలో చాలా లాజిక్కులను పక్కన పెట్టేశాడు. మరీ ముఖ్యంగా స్టార్టింగ్‌లో హాస్పిటల్‌లో వచ్చే సీన్‌లో మానవ అవయువాల అక్రమ రవాణా ఎపిసోడ్‌కి కంక్లూజన్‌ లేకుండా వదిలేశాడు. దానికి ఈ సినిమాకి లింకేంటి అనేది అస్సలు అర్థం కాదు. అలాగే హీరోహీరోయిన్ల ప్రేమ ఎపిసోడ్ కూడా అంతగా నప్పదు. కాకపోతే వారిద్దరిపై వచ్చే ఓ సాంగ్ మాత్రం రొమాంటిక్ ప్రియులని అలరిస్తుంది.

ప్రస్తుతం, గతం అనే కోణంలో ఇంట్రస్టింగ్‌‌గా సినిమాని దర్శకుడు నడిపాడు కానీ.. కొంత మందిని మాత్రం అది కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. ఇక ట్విస్ట్‌లను రివీల్ చేసిన తీరు కూడా బాగుంది. మరీ ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. అలాగే ఇంటర్వెల్ కూడా సెకండాఫ్‌పై ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేసేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు గ్రాఫ్‌ని పడేసినా.. యాక్షన్ ఎపిసోడ్స్‌తో బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారు.

అయితే కొన్ని సన్నివేశాలు చాలా భయంకరంగా, క్రూరంగా అనిపిస్తాయి. అందుకే అంది థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం ఈ సినిమా విందు భోజనంలా ఉంటుందని. చిన్నపిల్లలు, సెన్సిటివ్ పర్సన్స్ ఈ సినిమా చూడకుండా ఉంటేనే బెటర్. మొత్తంగా అయితే ‘హిడింబ’ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఆదిమ జాతికి లింక్ పెట్టి.. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు మలిచిన తీరయితే బాగుందనే చెప్పుకోవాలి.

కాకపోతే.. కొత్తదనం నిండి ఉన్న ఈ కథని ఇంకాస్త గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తే బాగుండేదని అనిపిస్తుంది. అక్కడక్కడా లాజిక్ లెస్ సీన్లు ఉన్నప్పటికీ.. ఎంచుకున్న కథకి మాత్రం దర్శకుడు న్యాయం చేశాడనే చెప్పుకోవాలి. ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని వైవిధ్యంగా చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, ఓవరాల్‌గా ఏదో మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. మొత్తంగా అయితే బాక్సాఫీస్ దగ్గర నిలబడే కంటెంట్ అయితే ఇందులో ఉంది. కాస్త ప్రమోషన్స్ అవి గట్టిగా చేసుకుంటే మాత్రం.. ఇది సేఫ్ ప్రాజెక్టే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.

ట్యాగ్‌లైన్: విషయమున్న సినిమానే.. కాకపోతే హింసే!
రేటింగ్: 2.75/5

Latest News