Site icon vidhaatha

High Court of Karnataka | ఇండియాలో ‘ఫేస్‌బుక్‌’ను మూయిస్తాం

High Court of Karnataka

బెంగళూరు: నకిలీ ప్రొఫైల్‌ కేసులో పోలీసుల దర్యాప్తునకు సహకరించకుంటే భారతదేశంలో ఫేస్‌బుక్‌ కార్యకలాపాలను బంద్‌ చేయిస్తామని కర్ణాటక హైకోర్టు మెటా సంస్థను హెచ్చరించింది. మంగళూరుకు చెందిన శైలేంద్ర కుమార్‌ ఫేస్‌బుక్‌లో సౌదీ అరేబియా రాజు, మతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న
ఆరోపణలపై ప్రస్తుతం సౌదీ అరేబియా జైలులో ఉన్నారు. అయితే.. తన పేరిట ఎవరో నకిలీ ప్రొఫైల్‌ సృష్టించి ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని శైలేంద్ర.. తన భార్య కవితకు తెలిపడంతో ఆమె స్థానిక పోలీసులను ఆశ్రయించారు.

సవరణ చట్టం (సీఏఏ), నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్‌షిప్‌ (ఎన్‌ఆర్‌సీ) విషయంలో భారత ప్రభుత్వానికి మద్దతుగా శైలేంద్ర కామెంట్లు పోస్ట్‌ చేశారని, అయితే.. దీనిపై బెదిరింపు పోస్టింగ్‌ రావడంతో తన ఫేస్‌బుక్‌ ఖాతాను డిలీట్‌ చేశారని కవిత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. కొందరు దుండగులు శైలేంద్ర పేరుతో నకిలీ ఖాతా సృష్టించి.. సౌదీ రాజు, ఇస్లాం మతంపై అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఆమె తెలిపారు. దీనిపై శైలేంద్రకు 15 ఏళ్ల జైలు శిక్ష విధించారని పేర్కొన్నారు.

కానీ.. పోలీసుల దర్యాప్తు జాప్యం అవుతుండటంతో ఆమె 2021లో హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం దానిపై జస్టిస్‌ కృష్ణ ఎస్ దీక్షిత్‌ వాదనలు విన్నారు. ఇదే కేసులో 12వ తేదీన ఆదేశాలు వెలువరించిన హైకోర్టు.. ఈ కేసుల పత్రాలన్నింటినీ అధ్యయనం చేసి.. కోర్టుకు సమర్పించాలని పేర్కొన్నది. ఫేస్‌బుక్‌ ఎక్కౌంట్‌ హ్యాక్‌ అయిందని చెబుతున్న మన దేశ పౌరుడు వేరే దేశంలో జైల్లో మగ్గిపోతున్నా.. కేసు దర్యాప్తులో ఇంత జాప్యం ఎందుకు జరిగిందో వివరించాలని పేర్కొన్నది.

మంగళూరు సిటీ పోలీస్‌ కమిషనర్‌ కుల్‌దీప్‌ కుమార్‌ జైన్‌, ఇతర దర్యాప్తు అధికారులు బుధవారం కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు దర్యాప్తులో ఫేస్‌బుక్‌ సంస్థ తమకు సహకరించడం లేదని, అందుకే జాప్యం అవుతున్నదని తెలిపారు. దీనిపై ఫేస్‌బుక్‌ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించగా.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తనకు సరిగా తెలియదని చెప్పారు. దీనితో ఈ కేసులో దర్యాప్తు ప్రక్రియకు ఫేస్‌బుక్‌ సహకరించని పక్షంలో దేశంలో దాని కార్యకలాపాలను నిలిపివేస్తామని హెచ్చరించింది.

ఫలితంగా.. తనకు వారం రోజులు గడువు ఇస్తే దీనిపై నివేదికను కోర్టుకు సమర్పిస్తానని న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును జూన్‌ 22కు హైకోర్టు వాయిదా వేసింది. విదేశంలో తప్పుడు కేసులో జైల్లో మగ్గుతున్న భారత పౌరుడిని కాపాడేందుకు ఏం చర్యలు తీసుకున్నారో వివరాలు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశించింది.

ఆయనకు ఏం జరిగింది? ఆయనకు న్యాయ సహాయం అందుతున్నదా? అనే విషయాలను సీల్డ్‌ కవర్‌లో అందించాలని ఆదేశించింది. తగిన వివరాలు అందించని పక్షంలో విదేశాంగ శాఖ కార్యదర్శి కోర్టుకు రావాల్సి ఉంటుందని కూడా పేర్కొన్నది.

Exit mobile version