విధాత, వరంగల్ ప్రతినిధి:కేంద్రంలోని బీజేపీ పాలకులు దేశాన్ని పాసిజం వైపు తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ సాగే ప్రతిఘటన పోరాటంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి పిలుపునిచ్చారు. రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వం పైన వర్గ చైతన్యంతో భాగస్వాములు కావాలని కోరారు. హసన్‌పర్తి మండల సిపిఐ జనరల్ కౌన్సిల్ మీటింగు దోమ రాకేష్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో జ్యోతి, కర్రే బిక్షపతి, మోతే లింగారెడ్డి హాజరు కాగా నేదునూరి జ్యోతి మాట్లాడుతూ బాజాపా అవుర్ ఏక్ బార్ చార్ సౌ పార్ అంటూ మొన్నటి లోకసభ ఎన్నికలలో పోటీ చేస్తే నాలుగు వందల సీట్లు కాదు కదా…. అధికారానికి అవసరమైన సంఖ్యా బలము 272 కాగా కేవలం 240 సీట్లు మాత్రమే ఇచ్చి ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వడాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
రైతు వ్యతిరేక చట్టాలను రైతాంగం వీరోచితంగా ఢిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి పోరాడి విజయం సాధించారని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు, సిఏఏ, ఎన్ఆర్సిలాంటి చట్టాలు, ఒకే దేశం, ఒకే చట్టం ఒకే నాయకుడు ఒకే పార్టీ అంటూ బీజేపీ నినాదాల పై చైతన్యంతో వ్యవహరించి లౌకికవాద దృక్పథంతో ప్రజలు తీర్పునివ్వడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన 13 శాసనసభ ఉప ఎన్నికలలో కేవలం రెండు సీట్లు మాత్రమే ఎన్డీఏ గెలిచి ఇండియా కూటమి 11 సీట్లు గెలవడానికి దోహదం చేశారని అన్నారు. ఫాసిస్టు పాలనపై వ్యతిరేకంగా ప్రజలు ఇండియా కూటమికి విజయాలను కట్టబెట్టారని ఇది ప్రజల విజయం అన్నారు.
సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్ర బిక్షపతి మాట్లాడుతూ ఈనెల 19న మండల ఆఫీసుల ముందు 26న జిల్లా కలెక్టర్ ముందు అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని జరిగే పోరాటాలలో అధిక సంఖ్యలో ప్రజలను భాగస్వాములు చేద్దామని పిలుపునిచ్చారు. రైతు సంఘం నేత మోతే లింగారెడ్డి మాట్లాడుతూ పార్టీ నిర్మాణం కోసం విస్తరణ కోసం ప్రతి కార్యకర్త భాగస్వాములు కావాలని కోరారు. ఈ జనరల్ కౌన్సిల్లో బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి నేదునూరి రాజమౌళి, హసన్పర్తి మండల సిపిఐ కార్యదర్శి మెట్టు శ్యాంసుందర్ రెడ్డి, జక్కుల సాంబరాజు, పర్వతాలు, భరత్, దోమ రాకేష్, రేణిగుంట్ల రాజయ్య, బుజ్జిగా పరుశరాములు, నేదునూరి సాంబయ్య, కొత్తగట్టు శ్యాంసుందర్, గోపు బుచ్చిరెడ్డి, ఎర్ర నాగరాజు, ఎర్ర కుమారస్వామి, ఎండి రజాక్, నేదునూరి రామచందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.