High Court
- డెక్కెన్ కూల్చివేతపై హైకోర్టులో విచారణ
- సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను ఎందుకు పట్టించుకోలేదు?
- కోర్టుకు క్షమాపణ చెప్పిన జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్
- తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసిన ధర్మాసనం
హైదరాబాద్, విధాత: డెక్కెన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ విచారణకు జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ లోకేష్ కుమార్ హాజరయ్యారు. ముందుగా జీహెచ్ఎంసీ తరుపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్‌లోని హోటల్ కూల్చివేత ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, కూల్చివేత చేపట్టినప్పుడు ఎంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు అని జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది.
అస్సలు పోలీసులను ఎవరు నియమించారు. కూల్చివేతలు చేపట్టినప్పుడు కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయని మీకు తెలుసు అని వ్యాఖ్యనించింది. ఏ కేసులో అయినా సరే కూల్చివేతలు చేపట్టినప్పుడు కోర్టు ఆర్డర్ లేకుండా పోలీసు ప్రొటక్షన్ ఎలా తీసుకుంటారని మండిపడింది.
స్టే ఉన్నా కూల్చివేతలు చేపడుతారా..?
కూల్చివేతలు చేపట్టరాదని కోర్టు స్టే ఉన్నా ఎలా కూల్చివేశారని అడిగింది. ఆదివారం (సెలవు రోజుల్లో) కూల్చివేతలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నా ఎందుకు పట్టించుకోకుండా అంత అత్యావరంగా కూల్చివేతలు ఎందుకు చేపట్టారని నిలదీసింది. కోర్టు ఆర్డర్ ఉన్నట్లు తమకు తెలియదని జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ న్యాయస్థానికి క్షమాపణ చెప్పారు. దీంతో కోర్టు ఆర్డర్ మీకు తెలియదంటే మేము నమ్మాలా? అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అంటే సామాన్యులకు ఒక న్యాయం.. పలుబడి ఉన్న ధనవంతులకు మరో న్యాయమా? అని ప్రశ్నించింది.
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కూల్చివేతలు చేపట్టారు. ఆ సమయంలో ఎంతమంది పోలీసు అధికారులు అక్కడ ఉన్నారని ధర్మాసనం అడిగింది. దీంతో జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ 11:30 నుంచి 1 గంట వరకు కూల్చివేతలు చేపట్టినట్లు తెలిపారు. మేము 10 శాతం మంది పోలీసు అధికారులను ప్రొటెక్షన్ కోసం తీసుకుంటామని, 90 శాతం మంది పోలీసులను తీసుకోమని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ప్రతీరోజూ అక్రమ కట్టడాలను కూల్చివేయిస్తుంటాం..
హైదరాబాద్ నగరంలో అక్రమంగా నిర్మించిన చాలా కట్టడాలను ప్రతిరోజు కూల్చివేయిస్తామని, ఇప్పటికే వేలాది కట్టడాలను కూల్చివేయించామని, కొన్ని సీరియస్ కండీషన్‌లో ఉన్నప్పుడు మాత్రమే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటామని జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ లోకేష్ కుమార్ న్యాయస్థానికి వివరించారు.
కూల్చివేతలు చేపట్టినప్పుడు మిస్ కమ్యూనికేషన్ అయ్యిందని జీహెచ్ఎంసీ తరుపు న్యాయవాది కోర్టు వారికి సూచించారు. పిటిషనర్లు చట్టవిరుద్ధంగా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేపట్టారని తెలిపారు. వెంటనే జోక్యం చేసుకున్న ధర్మాసనం చట్టవిరుద్ధంగా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేపడితే మీరు ముందుగా కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని, పోలీస్ ప్రొటెక్షన్‌తో కూల్చివేతలు చేపట్టాలి కదా అని మండిపడింది.
మీకు మీరే బాసులా..?
మీరు కూల్చివేతలు చేస్తున్నప్పుడు ఫొటోస్ కానీ, వీడియో కానీ తీసారా. మీరు ఏమి చేసిన మీరే బాసులు అని అనుకుంటున్నారా? కోర్టు ఏమీ చెయ్యదులే అని అనుకుంటున్నారా? హోటల్ కూల్చివేత సమయంలో తీసిన వీడియో, ఫొటోలు సమర్పించాలని పిటిషనర్ తరుపు న్యాయవాదికి ధర్మాసనం సూచించింది.
అదేవిధంగా జీహెచ్ఎంసీ దాఖలు చేసిన కౌంటర్‌కు రీప్లై వేయాలని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణకు డిప్యూటీ సిటీ ప్లానర్ హాజరు కావాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.