High Court
హైదరాబాద్, విధాత: జిల్లా రిటర్నింగ్ అధికారితో సహా సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో ఇతరుల(థర్డ్ పార్టీ)ని హాజరుకానివ్వొద్దని కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ధర్మపురి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ సమర్పించిన నివేదిక ప్రతిని అడ్లూరి లక్ష్మణ్‌కూ ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అలాగే అడ్లూరి లక్ష్మణ్ వేసిన మధ్యంతర అప్లికేషన్‌ను అనుమతించింది.
2018 ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేగా గెలుపొందడాన్ని సవాల్ చేస్తూ ఆయనపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. వీవీపీఏటీ స్లిప్స్‌లో తేడాలున్నాయని, రీకౌంటింగ్‌కు ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. దీనిపై హైకోర్టులో విచారణ సాగుతున్నది.
ఈ నేపథ్యంలో సాక్ష్యాల రికార్డు కోసం హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్‌వీవీ నాతారెడ్డిని కమిషనర్‌గా నియమించింది. ఈయన రిటర్నింగ్ అధికారి భిక్షపతి నుంచి సమాచారం సేకరించకుండానే రికార్డింగ్ ముగించారని.. తన నుంచి ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకోని నాతారెడ్డి, కొప్పుల నుంచి డాక్యుమెంట్లు తీసుకుని మార్కింగ్ చేశారని.. క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో రిటర్నింగ్ అధికారి కుమారుడు సమాధానాలు తారుమారు చేసే ప్రయత్నం చేసినా.. నాతారెడ్డి అభ్యంతరం చెప్పలేదని పేర్కొంటూ అడ్లూరి మధ్యంతర అప్లికేషన్లు దాఖలు చేశారు.
రిటర్నింగ్ అధికారిని మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేసేలా నాతారెడ్డిని ఆదేశించాలని, కొప్పుల నుంచి తీసుకుని మార్కింగ్ చేసిన డాక్యుమెంట్లను తిరస్కరించాలని కోరారు. ఈ అప్లికేషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం.. వాటిని అనుమతించింది. రిటర్నింగ్ అధికారితో సహా సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో ఇతరులు హాజరుకాకూడదని ఆదేశించింది.