Site icon vidhaatha

High Court | కోతుల సమస్యపై తీసుకున్న చర్యలేంటి?: హైకోర్టు 

High Court

హైద‌రాబాద్‌, విధాత: కోతుల వ‌ల్ల జ‌రిగిన పంట న‌ష్టాన్ని ప్ర‌భుత్వం ఎందుకు పరిష్కరించడం లేదు? ఒక‌వేళ ప‌రిష్క‌రిస్తే ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌లేంటో చెప్పాల‌ని హైకోర్టు ఆదేశించింది. కొన్ని చర్యలు కాగితంపైనే కనిపిస్తున్నాయని, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.

ఈ కేసులో అమికస్ క్యూరీ చేసిన సిఫార్సులు కోతుల సంబంధిత సమస్యలను తగ్గించేందుకు దోహదం చేసేవిగా ఉన్నాయని, వాటిని అమలు చేయాలని రాష్ట్ర అటవీ శాఖ, ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు స్పష్టం చేసింది. ఆ మార్గదర్శకాలు కోతుల నుంచి పంటలను కాపాడటానికే కాదు.. ప్రజలను రక్షించడానికి కూడా ఉపయోగపడతాయని పేర్కొంది.

కోతుల కారణంగా దెబ్బతిన్న తన పంటకు నష్ట పరిహారం చెల్లించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన ఎం శ్రీనివాస్‌రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దాదాపు 3 ఎకరాల్లోని పంటలను 2019, మార్చి 7న కోతులు పూర్తిగా ధ్వంసం చేశాయని ఆయన తెలిపారు.

కోతుల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలని, రైతులను, పిల్లలను వాటి నుంచి రక్షించాలని, దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.

వాదనలు విన్న ధర్మాసనం.. సిఫార్సులను అమలు చేసి చూడాలని పేర్కొన్నది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

Exit mobile version