నాగార్జున సాగర్‌ డ్యాంపై కొనసాగుతున్న ఉద్రిక్తత

నాగార్జున సాగర్ డ్యాం నీటి విడుదలపై కొనసాగుతున్న వివాదంలో ఏపీ రాష్ట్రానికి చెందిన పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Publish Date - December 1, 2023 / 07:47 AM IST
  • ఏపీ పోలీసులపై కేసు నమోదు
  • డ్యాం వద్దకు కృష్ణా బోర్డు, తెలంగాణ నీటీ పారుదల శాఖ అధికారులు


విధాత: నాగార్జున సాగర్ డ్యాం నీటి విడుదలపై కొనసాగుతున్న వివాదంలో ఏపీ రాష్ట్రానికి చెందిన పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏపీ పోలీసులపై సెక్షన్స్‌ 441,,448,427 పై కేసు కేసు నమోదు అయింది. తెలంగాణ భూభాగంలోకి, సాగర్ డ్యాంపైకి అనుమతి లేకుండా వచ్చి అర్ధరాత్రి సీసీ కెమెరాలు, గేట్లు ధ్వంసం చేసి, ఎస్ఫీఎప్‌ భద్రతా సిబ్బందిపై దాడి చేశారని, బలవంతంగా కుడి కాలువకు నీటి విడుదల చేశారని డ్యాం ఇరిగేషన్ అధికారులు, ఎస్పీఎఫ్‌ సిబ్బంది చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.


మరోవైపు డ్యాంపై ఏపీ పోలీసులు, తెలంగాణ పోలీసులు రెండువైపుల మోహరింపు కొనసాగుతుంది. ఏపీకి చెందిన 1200 మంది పోలీసులు డ్యాం వద్ధ ఉన్నారు. మరోవైపు కృష్ణా బోర్డు అధికారులు సాగర్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నల్లగొండ ఎస్పీ అపూర్వ డ్యాం వద్ధకు వెళ్లి భద్రతను సమీక్షించారు. గత రెండు రోజులుగా పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి సాగర్ డ్యాం వద్దనే మకాం వేశారు.


ఇప్పటికే సుమారు 4000 క్యూసెక్కుల నీటిని తాగునీటి పేరుతో ఏపీ విడుదల చేసింది. నీటి విడుదల కొనసాగుతుంది. ప్రస్తుతం సాగర్ రిజర్వాయర్‌లో 522 అడుగుల నీటిమట్టం ఉండగా, మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరేజ్ కి చేరే అవకాశం ఉంది. సాగర్ ప్రాజెక్టులో 26 గేట్లకు 13 గేట్లు ఆంధ్ర ప్రదేశ్ పరిధిలో ఉన్నాయి. దీంతో తమకు డ్యాంపై హక్కు ఉందని వాదిస్తు మా నీటిని మేం విడుదల చేసుకుంటామని వాదిస్తుంది.


ఆకస్మిక వివాదంపై అనుమానాలు


ఏపీ నీటి విడుదల విషయపై ప్రస్తుతం సాగర్ డ్యాం నుంచి ఎలాంటి వివాదాలు లేవు. బోర్డు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు తెలంగాణ అధికారులే ఏపీ కుడి కాలువకు నీటి విడుదల చేస్తున్నారు. నవంబర్ నెలలో సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదలకు బోర్డు వద్ధ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇండెంట్ కూడా పెట్టలేదు. అలాంటప్పుడు నీటి విడుదలపై ఆకస్మికంగా ఏపీ ప్రభుత్వం సాగర్ డ్యాంపై పైకి దండయాత్రను తలపించేలా పోలీసులను పంపి బలవంతంగా కుడి కాలువకు నీటి విడుదల జరిపించడం వెనుక మతలబు ఏమిటన్నది తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.


 



తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముందు రోజు రాత్రి ఈ ఘటన జరుగడంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేసి పోలింగ్‌లో బీఆరెస్‌కు మేలు చేయాలన్న లక్ష్యంతోనే ఏపీ ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందన్న విమర్శలు వినిపించాయి. అయితే ఏపీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం తమ చర్య న్యాయమైనదని, తమ హక్కులను కాపాడుకున్నామని, తెలంగాణలో ఒక పార్టీకి మేలు చేయాల్సిన అవసరం లేదని తమపై వచ్చిన విమర్శలను కొట్టిపారేశారు.


నిజానికి రాష్ట్ర విభజన సందర్భంగా కృష్ణానదిపై ప్రధాన ప్రాజెక్టులైన శ్రీశైలంను ఏపీ ప్రభుత్వం, నాగార్జున సాగర్‌ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే శ్రీశైలం ఎడమకాలువ విద్యుత్తు కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తూ అటు ఏపీ ఇరిగేషన్ అధికారులను అనుమతించడం లేదు.


దీంతో నాగార్జున సాగర్ డ్యాంలో 26గేట్లలో తమ భూభాగంలోని 13గేట్లను కుడి కాలువ, విద్యుత్తు కేంద్రాలను తామే నిర్వహించుకుంటామని ఏపీ గళమెత్తుకుంది. తన వాదనకు అనుగుణంగా ఏపీ తాజాగా తెగింపుతో సాగర్ డ్యాంపై దురాక్రమణ తరహాలో పోలీసు బలగాలతో 13గేట్ల వరకు కంచె వేసుకుని, కుడి కాలువకు నీటి విడుదల చేసుకుంటుండం రెండు రాష్ట్రాల మధ్య జల వివాదానికి దారితీసింది. ఈ సందర్భంగా తెలంగాణ, ఏపీ పోలీసుల మధ్య ఘర్షణ మరింత వివాదస్పమైంది.


అయితే ఇప్పటిదాకా రెండు రాష్ట్రాల మధ్య ఆయా డ్యాంల నిర్వాహణలో ఏ వివాదం తలెత్తినా కృష్ణా బోర్డు సూచనల మేరకు రెండు రాష్ట్రాలు నడుచుకున్నాయి. తాజా వివాదంలో కృష్ణా బోర్డు అధికారులు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం బోర్డు అధికారులతో పాటు తెలంగాణ సీఎంవో కార్యదర్శి, నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ సాగర్ డ్యాం వద్ధకు వెళ్లి జరిగిన ఘటనలపై సమీక్ష చేపట్టారు.