విధాత: తీవ్ర నిరాశ, నిస్పృహలో కొట్టు మిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి చీకట్లో చిరుదీపంలా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశలు కల్పిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పని అయిపోయిందని అనుకుంటున్నతరుణంలో స్థానిక నేతల సమన్వయం, కృషితో హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ ఫలితాలు చూసిన నేతలకు ఎవరి ప్రలోభాలకు తలొగ్గకుండా, నిరుత్సాహ పడకుండా కష్టపడి పనిచేస్తే ఫలితాలు రాబట్ట వచ్చునని హిమాచల్ ఫలితాలు కాంగ్రెస్‌కు పాఠం నేర్పాయి.
ఈ ఫలితాలను ప్రత్యక్షంగా చూసిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే ఆయా రాష్ట్రాల నేతలకు దిశా నిర్దేశనం చేసినట్లు తెలిసింది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పెద్దలు వరుసగా ఆయా రాష్ట్రాల నేతలను పిలిపించి మాట్లాడుతున్నారు. ఈ మేరకు ఇటీవల రాష్ట్రం నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో పాటు పలువురు నేతలను విడివిడిగా పిలిపించి మాట్లాడారు.
ఏ పార్టీకి లేనంత ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కే..
కాంగ్రెస్ పార్టీకి దేశ వ్యాప్తంగా సంప్రదాయ ఓటు బ్యాంకు ఏ పార్టీకి లేనంతగా ఉన్నది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరంగా బలమైన ఓటు బ్యాంకు ఉన్న పార్టీ కూడా కాంగ్రెస్ అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే ఓటు బ్యాంకు ఎంత బలంగా ఉందో కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్రంలో అంతే బలహీనంగా ఉన్నారన్న విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. చాలా మంది కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలకు తమపై తమకు విశ్వాసం లేకనే ఇతర పార్టీల వైపు చూస్తున్నారన్నఅభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
ఇప్పడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్‌కు గట్టి పోటీ
ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ దాదాపు 70కి పైగా స్థానాల్లో టీఆర్ ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వనున్నదని ఇటీవల జరిగిన ఒక పరిశీలనలో వెల్లడైంది. అయితే… స్థానిక నాయకత్వానికి నేనున్నాననే భరోసా, మనో ధైర్యం కల్పించి క్షేత్ర స్థాయిలో పోరాడేలా చేయగలిగే గట్టి నాయకత్వం ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి అవసరం అన్న అభిప్రాయం రాష్ట్ర రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో చెల్లా చెదురై విభిన్న గ్రూపులుగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చి ముందుకు నడిపిస్తే కాంగ్రెస్‌కు పూర్వ వైభవం రావడం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
సంక్లిష్ట పరిస్థితుల్లోనూ తగ్గని ఓటు శాతం..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 63 సీట్లు సాధించి టీఆర్ ఎస్ అధికారం చేపట్టగా, కాంగ్రెస్ పార్టీ 21 సీట్లు సాధించి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. నాడు 63 సీట్లు సాధించిన టీఆర్ ఎస్‌కు 34.3 శాతం ఓట్లు రాగా, 21 సీట్లు సాధించిన కాంగ్రెస్‌కు నాడు 25.2 శాతం ఓట్లు వచ్చాయి. అయితే 15 సీట్లు సాధించిన టీడీపీ కాలక్రమంలో టీఆర్ ఎస్‌లో విలీనమైంది.
దీంతో అప్పటి వరకు 14శాతం ఉన్న టీడీపీ ఓట్ బ్యాంక్ 3.5 శాతానికి పడిపోయింది. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు తగ్గి 19 సీట్లలో మాత్రమే గెలిచినప్పటికీ ఓటు బ్యాంక్ 28.7 శాతానికి పెరిగింది. అయితే అనూహ్యంగా ఎంఐఎంకు 2014, 2018 ఎన్నికల్లో 7 సీట్లలో గెలిచినప్పటికీ ఓటు బ్యాంక్ మాత్రం 3.8 శాతం నుంచి 2018 ఎన్నికల నాటికి 2.7 శాతానికి పడిపోయింది. కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మాత్రం పెరగటం గమనార్హం.
నేతలు అమ్ముడు పోతారనే…
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు తిరిగి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అమ్ముడు పోతారనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో బలంగా ఉన్నది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థులు 12 మంది అధికార టీఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఉప ఎన్నికల్లో హుజారాబాద్, మునుగోడు నియోజక వర్గాలను కోల్పోయింది. దీంతో ఐదు స్థానాలకు కాంగ్రెస్ పరిమితమైంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు ఎమ్మెల్ల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ద్వారా ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇలా కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీలకు వలస పోతారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఈ అపవాదును అధిగమించి ఆత్మ విశ్వాసం కలిగిస్తే కాంగ్రెస్ అత్యంత బలమైన పార్టీగా ఉంటుందన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
ఇతర పార్టీలపై కేంద్రీకరించిన బీజేపీ
రాష్ట్రంలో మతం ఎజెండాగా బలపడాలని బీజేపీ తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. ఇదే సమయంలో ఇతర పార్టీలకు చెందిన నేతలను తమ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా బలపడాలని చూస్తున్నది. వాస్తవంగా ఇప్పటి వరకు బీజేపీకి అనేక నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేని పరిస్థితి ఉన్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
2014 ఎన్నికల్లో బీజేపీకి 7.1 శాతం ఓట్లతో 5 సీట్లు రాగా, 2018 ఎన్నికల్లో కేవలం హైదరాబాద్‌లో ఒక్క నియోజకవర్గంలో మాత్రమే గెలిచింది. ఆతర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రెండు సీట్లను గెలుచుకున్నది. అయితే ఈ రెండు సీట్లు బీజేపీ కంటే వ్యక్తి ప్రభావం మీద గెలిచినవే కావడం గమనార్హం.
పలుకుబడి ఉన్న వారి పైనే గురి..
ప్రస్తుతం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇతర పార్టీలకు చెందిన నేతలను తమ పార్టీలోకి తీసుకోవాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ముఖ్యంగా ప్రజాబలం ఉన్నకాంగ్రెస్ పార్టీ నేతలపైనే బీజేపీ గురి పెట్టింది. ఇందులో భాగంగానే అలాగె ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీఆర్ ఎస్ పార్టీలలో టికెట్లు రానీ నేతలను తమ పార్టీలోకి తీసుకోవడం ద్వారా తెలంగాణలో బలం పెంచుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
భారీ మెజార్టీతో గెలుస్తామన్న ధీమాలో టీఆర్ఎస్..
అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ తాము చేసిన పనులే తమను భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్న దృఢమైన నమ్మకంతో ఉన్నది. సీఎం కేసీఆర్ ఇప్పటికే సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తున్నామని ప్రకటించారు. ఈ మేరకు అనధికారికంగా టీఆర్ ఎస్ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టినట్లే. ఆ నేపథ్యంలోనే.. ఎమ్మెల్యేలను నియోజక వర్గాలలో ఉండి పని చేయాలని ఆదేశించింది.
గ్రామాల వారీగా టీఆర్ ఎస్ పక్కా ప్రణాళికతో ఇప్పటి నుంచే ఎన్నికల కోసం పని చేస్తున్నది. దీనికి తోడు వామ పక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలతో దోస్తీ కట్టింది. వామ పక్షాల బలం కూడా తోడు కావడంతో గెలుపు తమకు నల్లేరు మీద నడకే నన్న అభిప్రాయంతో టీఆర్ ఎస్ లో ఉన్నది.