Site icon vidhaatha

Housing sales | ఏడు ప్రధాన నగరాల్లో పెరిగిన ఇళ్ల అమ్మకాలు.. హైదరాబాద్‌లో అత్యధికంగా వృద్ధి నమోదు

Housing sales : ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈ ఏడు నగరాల్లో జనవరి నుంచి మార్చి వరకు ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయి. సగటు ధరలు కూడా 10 నుంచి 32% పెరిగాయి. ఈ విషయాన్ని స్థిరాస్తి సేవల సంస్థ ‘అనరాక్‌ (Anarock)’ తన తాజా నివేదికలో తెలిపింది.


రానున్న రోజుల్లో ఇళ్లకు గిరాకీ ఇంకా అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అనరాక్‌ పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం దేశంలోని ఏడు 7 నగరాల్లో మొత్తం 1,30,170 ఇళ్లు/ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో అంటే 2023 తొలి త్రైమాసికంలో అమ్ముడుపోయిన ఇళ్ల సంఖ్య 1,13,775 మాత్రమే. ఈ త్రైమాసికంలో నమోదైన అమ్మకాలు గత పదేళ్లలోనే గరిష్ఠమని అనరాక్‌ ఛైర్మన్‌ అనుజ్‌ పురి తెలిపారు. రూ.1.5 కోట్లు, అంతకుమించి ధర ఉన్న ఇళ్లపై కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు.


ఇక నగరాల వారీగా చూస్తే.. ముంబైలో ఇళ్ల విక్రయాలు 34,690 నుంచి 24% వృద్ధితో 42,920 కి చేరాయి. పుణెలో 19,920 నుంచి 15% వృద్ధితో 22,990కు, హైదరాబాద్‌లో 14,280 నుంచి 38% వృద్ధితో 19,660కు చేరాయి. బెంగళూరులో 15,660 నుంచి 14% వృద్ధితో 17,790కు చేరాయి. దేశ రాజధాని డిల్లీలో మాత్రం 17,160 నుంచి 9% అమ్మకాలు తగ్గి 15,650కు, చెన్నైలో 5,880 నుంచి 6% అమ్మకాలు తగ్గి 5,510 కి పడిపోయాయి. సొంతిల్లు సమకూర్చుకోవాలనే ధోరణితోపాటు పెట్టుబడిదారుల నుంచి గిరాకీ పెరగడంతో స్థిరాస్తి రంగంలో వృద్ధి నమోదైందని నివేదిక పేర్కొంది. 

Exit mobile version