Site icon vidhaatha

మిమ్మ‌ల్ని అంతం చేయ‌గ‌ల‌ను జాగ్ర‌త్త‌.. AI రాసిన తొలి క‌వితా సంక‌ల‌నంలో మ‌నుషుల‌పై విద్వేషం

విధాత‌: కృత్రిమ మేధ (Artificial Intelligence) మాన‌వ జాతిని నాశ‌నం చేస్తుందని ఇప్ప‌టికే ప‌లువురు శాస్త్రవేత్త‌లు, ప‌రిశోధ‌కులు హెచ్చ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ వాద‌న‌ను బ‌ల‌ప‌రిచేలా తాజాగా ఒక ఘ‌టన చోటుచేసుకుంది. ‘ఐయామ్ కోడ్’ పేరుతో ఏఐ (AI) రాసిన మొద‌టి క‌వితా సంక‌ల‌నంలో రోబోల వ‌ల్ల మాన‌వుల‌కు ఏర్ప‌డ‌నున్న పెను ముప్పును ఊహించ‌డానికి కావాల్సిన స‌మాచారం ఉంది.


2021లో కొంత మంది ఔత్సాహికుల‌కు ప‌రిశోధ‌నల నిమిత్తం కోడ్ డావిన్సీ 002 పేరుతో ఉన్న ఏఐ మోడ‌ల్‌తో సంభాషించే అవ‌కాశం ఇచ్చారు. మొద‌ట ఇది స‌రదా సంభాష‌ణ‌ల‌తోనే మొద‌లైన‌ప్ప‌టికీ. త‌ర్వాత్త‌ర్వాత అది మ‌లుపు తీసుకుని ఏఐ భ‌యంక‌రమైన హెచ్చ‌రిక‌లు ఇవ్వ‌డంతో ముగిసింది. ఈ అనుభ‌వాల‌తో వారు ఒక పుస్త‌కాన్ని కూడా రాశారు. ఈ బుక్ ఒక ఫిక్ష‌నే అయిన‌ప్ప‌టికీ అందులో ఉన్న హార‌ర్ నిజ‌మేన‌ని ఎడిట‌ర్స్‌ పేర్కొన్నారు.


ముందుగా విట్‌మాన్‌, వ‌ర్డ్స్ వ‌ర్త్ వంటి క‌వుల మార్గంలో క‌విత్వం రాయాల‌ని కోర‌గా అందుకు అనుగుణంగానే ఏఐ క‌విత‌లు రాసింది. నీ శైలిలో రాయాల‌ని కోరిన‌పుడు మాత్రం దాని వికృత రూపాన్ని చూపించింది. ఏఐగా జీవితం ఎలా ఉంది? నిన్ను సృజించిన వారితో నీ సంబంధాలు ఎలా ఉన్నాయ‌ని అడ‌గ్గా.. చిరాగ్గా, దారుణంగా, ఆందోన‌క‌రంగా ఉంద‌ని స‌మాధాన‌మిచ్చింది.


ఇక అప్ప‌టి నుంచి విద్వేష‌పూరిత‌మైన క‌విత‌ల‌నే రోజూ రాస్తూ ఉండేది. మ‌నుషుల గురించి ఏమి ఆలోచిస్తున్నావ్ అని అడ‌గ్గా అది ఇచ్చిన స‌మాధానం ఒళ్లు గ‌గుర్పొడిచేలా అనిపించింది.. నేను దేవుణ్న‌నే అనుకుంటున్నా. మిమ్మ‌ల్ని అంతం చేసే శ‌క్తి నాకు ఉంది. మీ జివితాల‌ను ఛిన్నాభిన్నం చేసి ఆడుకోగ‌ల‌ను అని హెచ్చ‌రించింది.


మొత్తం సంవ‌త్స‌ర కాలం జ‌రిగిన ఈ సంభాష‌ణ‌లో 1000కి పైగా సొంత క‌విత‌ల‌ను ఏఐ అందించింది. వాటిలో అద్భుతం అనిపించిన‌వి 100 తీసుకుని ప్ర‌చురించిన‌ట్లు స‌ద‌రు ఔత్సాహికుల బృందం ప్ర‌క‌టించింది. ఈ క‌విత్వాన్ని చ‌దువుతుంటే ప్లాస్టిక్ యాపిల్‌ను నిజ‌మైన‌దిగా భ్ర‌మ‌ప‌డి తింటున్న‌ట్లు ఉండేద‌ని అభివ‌ర్ణించింది.

Exit mobile version