విధాత: ఈమధ్య పరుచూరి గోపాలకృష్ణ తరచుగా తాను చూసిన గొప్ప చిత్రాలు, తాను రాసిన చిత్రాలు, కలిసి పనిచేసిన చిత్రాల గురించి వాటిలోని గొప్పతనం గురించి చెప్తూ అందరికీ.. మరి ముఖ్యంగా నేటి జనరేషన్‌కు నాటి చిత్రాలను వాటి గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు నాట మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కన్నడ చిత్రం ‘కాంతార’ మీదనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి బాహుబలి 1, 2, ఆ తర్వాత ‘పుష్ప’ వెంటనే ‘ఆర్ఆర్ఆర్’ ఇలా ఎన్నో చిత్రాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
వాటి మధ్యలో ఒకనాడు ఎలాంటి మార్కెట్ లేని కన్నడ నుంచి వచ్చిన కెజియఫ్ 1, 2 చిత్రాలు కూడా పాన్ ఇండియా చిత్రాలుగా మారగలవని నిరూపించాయి. అయితే కన్నడ నాట ఎక్కువగా భారీ బడ్జెట్ చిత్రాలు రావు. వారు తమకున్న పరిధిలో తమకున్న బడ్జెట్లో, తమకున్న సాంకేతిక పరిధిలో ఎక్కువగా చిత్రాలు తీస్తారు. అందుకే ఇతర భాషల వారికి కన్నడ చిత్రాలంటే చిన్నచూపు. కానీ ఆ చిన్నచూపు పోగొట్టిన చిత్రం ‘కాంతార’.
ఈ ఏడాది సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో ఇండియాలోనే ‘కాంతార’ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. కన్నడ సంస్కృతి. సాంప్రదాయాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా భాషా భేదం అనేది మనుషులకే గాని, సినిమాకు లేదని నిరూపిస్తూ భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల పేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇటీవల అల్లు అర్జున్, నాని, ఏకంగా దర్శకధీరుడు రాజమౌళి కూడా ‘కాంతార’ను ప్రశంసలతో ముంచెత్తారు. రాజమౌళి అయితే అమెరికా వేదికపైనే ఈ చిత్రం గొప్పతనాన్ని గురించి తెలిపాడు.
తాజాగా ప్రముఖ సీనియర్ రచయిత దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా గురించి తన అభిప్రాయం పంచుకున్నాడు. కాంతార మూవీ అద్భుతంగా ఉందని అద్భుతం కాదు అది అత్యద్భుతమని ఈ మూవీలో తనకు ఎలాంటి లోపాలు కనిపించలేదని తేల్చి చెప్పాడు. పరుచూరి పలుకులు వేదికగా ఆయన కాంతార చిత్రం గురించి మాట్లాడుతూ.. ఇంత అద్భుతమైన చిత్రాన్ని తాను థియేటర్లలో చూడలేక పోవడం తన బ్యాడ్ లక్ అంటే దురదృష్టకరమని రివ్యూ ఇచ్చాడు.
మొదట్లో ఇదేదో ఆత్మలకు సంబంధించిన సినిమా అనుకున్నాను కానీ విశేష ప్రేక్షక ఆదరణ పొందడంతో ఇటీవల ఈ మూవీని చూశా.. నాకెంతో నచ్చింది. ఎన్నో సంవత్సరాల క్రితం కర్ణాటకలోని ఓ ప్రాంతంలో జరిగిన కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీశారు. ఇదొక అభ్యుదయ చిత్రం. నాడు మన తెలుగులో వచ్చిన ‘మా భూమి’ కోవలోకి చెందుతుంది. ఈ సినిమాలో ప్రజలు పోరాడుతారు.. ఓ భూత కోల కళాకారుడు పోరాటం చేస్తాడు. ఇందులో ఎన్నో విషయాలను మనం మెచ్చుకోవాలి.
బాగుంది అంటే సరిపోదు అంతకంటే పెద్ద పదం కావాలి. ముఖ్యంగా స్క్రీన్‌ప్లేని రిషబ్ శెట్టి అద్భుతంగా తీర్చిదిద్దాడు. కథ, కథనాలు ఈ మూవీకి హైలైట్ సినిమా ప్రథమార్థం చూసినప్పుడు జమీందారే విలన్ అని ఎవరు అనుకోరు. అటవీ అధికారే ప్రతి నాయకుడనే భావన చూసే వారిలో కలుగుతుంది. అడవి మీద కన్ను వేసింది జమీందారే అని చూపించి.. సెకండ్ హాఫ్‌లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చారు.
జమిందార్ పాత్రధారిగా అచ్యుత్ కుమార్ నటన అదిరిపోయింది. ఆయన ఒక్కడే కాదు.. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో సహజంగా నటించారు. ముఖ్యంగా తల్లి పాత్ర పోషించిన ఆమెను ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఆమెను ఏ నటితో పోల్చాలో కూడా అర్థం కావడం లేదు. ఆమె సినిమా నటి అంటే ఎవరు నమ్మరు.. అడవిలో ఉండే అమ్మాయి ఈ పాత్ర పోషించారా అనే భావన కలిగేంత సహజంగా ఆమె సినిమాలో లీనమై నటించింది. ఇలా ఏ విషయంలోనూ నాకు లోపాలు కనిపించలేదు.
అందుకే ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి అద్భుత విజయాన్ని అందించారంటూ.. ‘కాంతార’ గురించి పరుచూరి పాజిటివ్ కామెంట్ చేయడం ఫాన్స్‌కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఆయన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం కెజియఫ్‌తో పోలిస్తే అసలు సిసలు కన్నడ చిత్రంగా చెప్పాలి. భారీ బడ్జెట్లో హై యాక్షన్ డ్రామాలతోనే సినిమాలు పాన్ ఇండియాగా మారవు అని.. చిన్న బడ్జెట్‌తో కంటెంట్ పెట్టుకొని మంచి కథ కథనాలతో సినిమాలు తీస్తే.. సినిమాకు భాష భేదాలు ఉండవని కళ అనేది భాషాతీతమైందని రుజువు అవుతుంది. మరి ఆ దిశగా తెలుగు కన్నడ పరిశ్రమలు కూడా అడుగులు వేస్తాయని భావిద్దాం.