విధాత: తాండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలు రుజువు చేస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని పైలట్ రోహిత్ రెడ్డి ప్రకటించారు.
బండి సంజయ్, రఘునందన్ రావు తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలి. చర్చకు ఎక్కడికి రమ్మన్న వస్తానని తేల్చిచెప్పారు. దీనికి మీరు సిద్ధమైతే చెప్పండి.. వేములవాడ లేదా తాండూరు బద్రేశ్వర స్వామి ఆలయంతో పాటు ఎక్కడికి వచ్చినా తాను సిద్ధమని స్పష్టం చేశారు.
బండి సంజయ్‌కు సవాల్ విసిరిన నేపథ్యంలో ఇవాళ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్‌కు రోహిత్ రెడ్డి వచ్చారు. కానీ బండి సంజయ్ రాకపోవడంతో మరోసారి సవాల్ విసిరారు. ఈడి నోటీసుల విషయంలో తమ న్యాయవాదులతో చర్చించి సాయంత్రం లోగా తన నిర్ణయం వెల్లడిస్తానని పేర్కొన్నారు.
బీజేపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలకు అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నారు. బీజేపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అధికార పార్టీ నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలతో టార్గెట్ చేస్తున్నారని రోహిత్ రెడ్డి మండిపడ్డారు.