Jagityala: ఆసక్తికరమైన వార్తలు కావాలంటే.. జ‌గిత్యాల ప్ర‌జావాణికి వెళ్లాల్సిందే

తాజాగా పాఠశాలలోని అసౌకర్యాలపై ఆరో తరగతి విద్యార్థి ఫిర్యాదు కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని ప్రజావాణిని ఆశ్రయించిన యువకుడు హ్యాండ్ బ్యాగ్‌లో కత్తితో ప్రజావాణిలోకి అడుగుపెట్టిన యువతి కలెక్టర్ పై చర్య తీసుకోవాలంటూ కలెక్టర్‌కే ఓ సర్పంచ్ ఫిర్యాదు విధాత బ్యూరో, కరీంనగర్: ఆసక్తికరమైన వార్తల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీరు తప్పక జగిత్యాలలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఫాలో కావాల్సిందే.. సాధారణంగా ప్రజలు తమ సమస్యలను ఏకరువుపెట్టడానికి ప్రజావాణిని ఉపయోగించుకుంటారు. అందులోనూ ప్రజల […]

  • Publish Date - April 3, 2023 / 05:30 AM IST

  • తాజాగా పాఠశాలలోని అసౌకర్యాలపై ఆరో తరగతి విద్యార్థి ఫిర్యాదు
  • కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని ప్రజావాణిని ఆశ్రయించిన యువకుడు
  • హ్యాండ్ బ్యాగ్‌లో కత్తితో ప్రజావాణిలోకి అడుగుపెట్టిన యువతి
  • కలెక్టర్ పై చర్య తీసుకోవాలంటూ కలెక్టర్‌కే ఓ సర్పంచ్ ఫిర్యాదు

విధాత బ్యూరో, కరీంనగర్: ఆసక్తికరమైన వార్తల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీరు తప్పక జగిత్యాలలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఫాలో కావాల్సిందే.. సాధారణంగా ప్రజలు తమ సమస్యలను ఏకరువుపెట్టడానికి ప్రజావాణిని ఉపయోగించుకుంటారు. అందులోనూ ప్రజల నుండి వచ్చే ఫిర్యాదుల్లో భూ సంబంధిత సమస్యలే అధికంగా ఉంటాయి. అయితే జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజావాణిలో చిత్ర, విచిత్రమైన సన్నివేశాలు సాక్షాత్కరిస్తున్నాయి.

పాఠ‌శాల‌లో అసౌక‌ర్యాల లేమిపై విద్యార్థి ఫిర్యాదు..

సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆరో తరగతి విద్యార్థి ప్రత్యక్షమై అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయాలని సలహా ఎవరు ఇచ్చారో, ఏమోగానీ.. ఆ బాలుడు తను చదువుకుంటున్న పాఠశాలలోని అసౌకర్యాలను అధికారుల ముందుంచారు.

ప్రజావాణికి హాజరైన ఫిర్యాదుదారులు, అధికారులు ఆ బాలుని ఫిర్యాదు చూసి అబ్బురపడ్డారు. జగిత్యాల పురాతన ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విశ్వంక్, తమ పాఠశాలలో బాత్రూం, తాగునీటి సౌకర్యాలు సరిగా లేని విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చారు. స్పందించిన అధికారులు ఆ పాఠశాలలో మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని విద్యాశాఖను ఆదేశించారు.

కింగ్ ఫిషర్ బీరు కోసం…

జగిత్యాల జిల్లా కేంద్రంలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ బీరం రాజేష్ అనే యువకుడు ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి ప్రాంతాలలో అన్ని రకాల బీర్లు అమ్ముతుండగా.. జగిత్యాలలో మద్యం వ్యాపారులు నాసిరకం బీర్లు అంటగడుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

హ్యాండ్ బ్యాగ్ లో కత్తితో…

తమ సమస్యను చెప్పుకునేందుకు మార్చి 27వ తేదీన జరిగిన ప్రజావాణికి వచ్చిన ఓ యువతి హ్యాండ్ బ్యాగ్ లో కత్తి తీసుకొని రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కత్తిని స్వాధీనం చేసుకొని ఆమె తన సమస్యను అధికారులతో చెప్పుకునే ఏర్పాటు చేశారు.

కలెక్టర్ పై చర్య తీసుకోవాల‌ని స‌ర్పంచ్‌..

గతంలో జిల్లాలో పనిచేసి బదిలీపై వెళ్లిన కలెక్టర్ పై చర్య తీసుకోవాలని ఓ సర్పంచ్ ప్రస్తుత కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు తమ గ్రామంలో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేసినా, బిల్లులు రాక ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నానని, తాను ఆ పనులు చేయడానికి ఆదేశించిన గత కలెక్టర్ పై చర్య తీసుకోవాలని కొడిమ్యాల మండలానికి చెందిన సర్పంచ్ ఫిర్యాదు చేయడంతో ప్రజావాణిలో ఉన్న అధికారులు నివ్వెరపోయారు. నిధులు అందుబాటులోకి రాగానే సర్దుబాటు చేస్తామని ఆయనకు నచ్చజెప్పి పంపారు.

Latest News