జీవన్‌రెడ్డి మనసు మారింది.. మరి అధిష్ఠానం ఇచ్చిన హామీ ఏంటో!

జగిత్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ని కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు

  • Publish Date - June 27, 2024 / 06:01 PM IST

జగిత్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ని కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేరికనే వ్యతిరేకించిన ఆయనను పట్టించుకోకుండా పుండుమీద కారం చల్లినట్టు తనను ఓడించిన వ్యక్తిని తనతో మాట మాత్రం చెప్పకుండా పార్టీలో చేర్చుకోవడంపై మనస్తాపానికి గురైన జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయనను బుజ్జగించడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌ బాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన అసంతృప్తికి గల కారణాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు ఇద్దరూ మీడియాకు చెప్పారు. ఆయన కు హామీ ఇచ్చే స్థాయిలో మేము లేము అన్నారు. ఈ నేపథ్యంలోనే జీవన్‌రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది.

పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కలత చెందిన ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేస్తానన్న జీవన్ రెడ్డి అధిష్ఠానంతో భేటీ అనంతరం మనసు మార్చుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీనే తనకు ముఖ్యమని అన్నారు. ఫిరాయింపులను వ్యతిరేకించిన ఆయన రాజకీయ పరిణామాలు, పరిస్థితుల వల్ల కొన్ని నిర్ణయాలు తప్పవన్నారు. ఇదే సందర్భంలో ఒక కీలక వ్యాఖ్య చేశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికే ప్రాధాన్యం ఉంటుందని అధిష్టానం హామీ ఇచ్చిందని చెప్పారు. ఆ హామీ ఏమై ఉంటుందనేది ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. పోచారం శ్రీనివాస్‌రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవడాన్ని జీవన్‌రెడ్డి ఎందుకు వ్యతిరేకించారో పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. జులై మొదటి వారంలో విస్తరణ ఉంటుందని, కొత్తగా ఆరుగురికి చోటు దక్కనున్నది అనే వార్తలు వస్తున్నాయి. ఇందులో రెడ్డి సామాజికవర్గం నుంచి ఇద్దరికి చోటు లభించవచ్చు అని ప్రచారం జరుగుతున్నది. నలభై ఏళ్లుగా పార్టీలోనే ఉన్న తనకు మంత్రివర్గంలో బెర్త్‌ ఖాయమని జీవన్‌రెడ్డి భావించారు. అయితే కానీ ఆయన ఆశలు ఫలించలేదు. విస్తరణలో అయినా దక్కుతుంది అనుకుంటే బీఆర్‌ఎస్‌ నుంచి సీనియర్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తుండటం ఆయనతోపాటు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వారికి ఆందోళన కలిగించింది. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ కండువా కప్పుకునే వాళ్లకు ఎలాంటి హామీ లేకుండా చేరరు అని, ఈ నేపథ్యంలోనే తాను వ్యతిరేకించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేబినెట్‌లో చోటు దక్కుతుందని, అధిష్ఠానం ఆయనకు హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో అటు మంత్రివర్గంలో చోటు దక్కక, ఇటు తన నియోజకవర్గంలో తనపైనే గెలిచిన వ్యక్తిని, తనతో సంప్రదించకుండా పార్టీలోకి తీసుకోవడం జీవన్‌రెడ్డిని కలతకు గురి చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

అయితే పార్టీలో సీనియర్‌ అయిన జీవన్‌రెడ్డికి పార్టీ అధిష్ఠానం భరోసా ఇచ్చింది. ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని, పార్టీలో ఆయన గౌరవానికి భంగం కలుగకుండా చూస్తామని చెప్పింది. అందుకే ఆయన వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. విస్తరణలో మంత్రివర్గంలో ఆయనకు చోటు కల్పిస్తామనే హామీ లేదా కేబినెట్‌ హోదా గల మరో పోస్టునైనా ఆఫర్‌ చేసి ఉంటుందనే ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే చాలామంది సీనియర్లు అసంతృప్తితో ఉన్నారని, పదేళ్లు అధికారంలో లేకపోయినా పార్టీనే అంటిపెట్టుకున్న వాళ్లకు అన్యాయం జరుగుతున్నదని పలువురు సీనియర్లు వాపోతున్నారు. అలాంటి వారందరికీ కాంగ్రెస్‌ అధిష్ఠానం హామీ ఇస్తున్నది. రాష్ట్రంలో రాజకీయ పరిణామల నేపథ్యంలోనే చేరికలు జరుగుతున్నాయని, ఈ చేరికలు ఆగవని కొనసాగుతాయని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీపా దాస్‌ మున్షీ స్పష్టం చేశారు. దీంతో మంత్రివర్గ విస్తరణలో ఎవరు ఉంటారు? బీఆర్‌ఎస్‌ నుంచి ఇంకా ఎంతమంది ఎమ్మెల్యే పార్టీలు పార్టీలోకి వస్తారు? ఇప్పటివరకు కేబినెట్‌లో చోటు దక్కుతుందని ప్రచారంలో ఉన్న పేర్లు మారుతాయా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతున్నది.

Latest News