(విధాత ప్రత్యేకం)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ప్రముఖులు సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బండి సంజయ్ పోటీ చేస్తున్న నియోజకవర్గాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి. వాటిలో ముందెన్నడూ లేని రీతిలో సీఎం, ప్రతిపక్ష నాయకులు ఇద్దరు రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండటం ఈ దఫా ప్రత్యేకత సంతరించుకుంది. సీఎం కేసీఆర్‌ను ఢీ కొడుతామంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌లు ఇద్దరు కామారెడ్డి, గజ్వేల్‌లలో ఆయనపై పోటీ పడుతున్నారు. అయితే హుజురాబాద్‌లో పోటీ చేస్తూనే ఈటల గజ్వేల్‌లో పోటీ చేస్తున్నారు. కొడంగల్‌లో పోటీ చేస్తూనే రేవంత్ కామారెడ్డిలో పోటీకి దిగుతున్నారు.
కామారెడ్డిలో బిగ్ ఫైట్
కామారెడ్డిలో ప్రధానంగా కేసీఆర్, రేవంత్‌ల మధ్యనే పోటీ నెలకొంది. అయితే వారిద్దరూ స్థానికేతరులని, తానే స్థానికుడినని బీజేపీ నుంచి పోటీచేస్తున్న వెంకట రమణారెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. కామారెడ్డిలో 1952 నుంచి 2018 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధికంగా ఎనిమిదిసార్లు గెలిచింది. తెలుగుదేశం ఐదుసార్లు, బీఆరెస్ మూడుసార్లు విజయం సాధించాయి. ఒకసారి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు.
కాంగ్రెస్ తరఫున రెండుసార్లు గెలిచిన మైనార్టీ నేత షబ్బీర్ అలీ గతంలో మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. ప్రస్తుత సిటింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రెండుసార్లు టీడీపీ నుంచి, మూడు సార్లు బీఆరెస్ నుంచి గెలిచి ఈ స్థానంలో అత్యధిక విజయాలు సాధించారు. గత 2018ఎన్నికల్లో బీఆరెస్ నుంచి పోటీ చేసిన గంప గోవర్ధన్ తన సీటును కేసీఆర్ కోసం త్యాగం చేయగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన షబ్బీర్ అలీ తమ పీసీసీ చీఫ్ రేవంత్ కోసం నిజామాబాద్ అర్బన్‌కు వెళ్లిపోయారు. గత ఎన్నికల్లో షబ్బీర్ అలీపై గంప గోవర్ధన్ 5వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.
పాత మిత్రుల కొత్త పోరు.. గజ్వేల్ బరి
తెలంగాణ ఏర్పడిన 2014లో, ఆ తరువాత 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచే గెలిచారు. మరోసారి కామారెడ్డితో పాటు కేసీఆర్ తన సిటింగ్ స్థానమైన గజ్వేల్‌లో పోటీ పడుతున్నారు. అయనపై కేసీఆర్ తన మంత్రివర్గ పాత సహచరుడైన బీజేపీ నేత ఈటల రాజేందర్ పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గం ఎన్నిక పై అందరి దృష్టి పడింది.
ఈ నియోజకవర్గంలో ఇంతవరకు ఎవరూ రెండు కంటే ఎక్కువసార్లు వరుసగా గెలిచిన చరిత్ర లేకపోవడం.. కేసీఆర్, ఈటల పోటీ పడుతుండడంతో అందరిలో ఆసక్తి ఏర్పడింది. గత రెండు ఎన్నికల్లో తనపై పోటీ చేసి ఓడిన వంటేరు ప్రతాపరెడ్డి ఇప్పుడు బీఆరెస్‌లోనే ఉన్నప్పటికి, ఈటల రూపంలో కొత్త ప్రత్యర్థి నుంచి కేసీఆర్‌కు పోటీ ఎదురైంది.
సీఎంగా కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేడన్న అసంతృప్తితో పాటు తన సామాజిక వర్గం ఓట్లు తన గెలుపుకు దోహదం చేస్తాయని ఈటల నమ్ముతున్నారు. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నినాదం కూడా తనకు కలిసివస్తుందని ఈటల ధీమాగా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డిని బరిలో నిలిపింది. 2018లో కేసీఆర్ ఇక్కడ 60.45 శాతం ఓట్లు సాధించి 58 వేల ఓట్ల తేడాతో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డిపై విజయం సాధించారు.
గంగుల టార్గెట్‌గా బండి స్పీడ్
తెలంగాణలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాలలో కరీంనగర్ సీటు కూడా ఉంది. కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్న గంగుల కమలాకర్, బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ నియోజకవర్గంలో తలపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఇక్కడ పురుమళ్ల శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. కమలాకర్ 2014 నుంచి వరుసగా మూడు సార్లు కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుస్తుండగా, 2014, 2018లో కమలాకర్ చేతిలో సంజయ్ ఓటమి పాలయ్యారు.
ఆ రెండు ఎన్నికలలోనూ రెండు స్థానంలో నిలిచిన సంజయ్ 2018 ఎన్నికల ఓటమి తరువాత 2019 లోక్ సభ ఎన్నికలలో గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు. అనంతరం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసి బీఆరెస్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా పార్టీని నడిపించారు. బీజేపీ హైకమాండ్ ఎన్నికలకు ముందు సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. ఎమ్మెల్యే కావడానికి మూడోసారి కమలాకర్‌తో పోటీ పడుతున్న బండి సంజయ్ ఈ దఫానైనా విజయం సాధిస్తారా లేదో చూడాల్సివుంది.
నేతన్నల అడ్డాలో మరో గెలుపుకు కేటీఆర్ సమరం
చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలో 2009, 2010 ఉప ఎన్నిక సహా, 2014, 2018 వరకు వరుసగా నాలుగు సార్లు కేటీఆర్ ఇక్కడి నుంచి గెలిచారు. కేటీఆర్ ఐదో విజయంపై కన్నేయగా, కాంగ్రెస్ పార్టీ నుంచి కేకే మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి రాణి రుద్రమ పోటీ చేస్తున్నారు. న్యాయవాదిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు ఉన్న కేకే మహేందర్ రెడ్డి 2009, 2010,2018లో మూడు సార్లు కేటీఆర్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో కేటీఆర్ తొలిసారి ఇక్కడ పోటీ చేసినప్పుడు కేకే మహేందర్ రెడ్డి కేవలం 171 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2010 ఉప ఎన్నికల్లో 68,219ఓట్లతో, 2018లో 89,009 ఓట్ల తేడా ఓడిపోయారు. బీజేపీ నుంచి రాణి రుద్రమ బరిలో నిలిచారు.
పాలేరులో పొంగులేటి కీలక పోటీ
బీఆరెస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీ పాలేరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆరెస్‌లో చేరి ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న కందాల ఉపేందర్‌రెడ్డిని ఢీ కొడుతున్నారు. సీపీఎం నుంచి ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి నున్న రవికుమార్ పోటీలో ఉన్నారు. వైఎస్సార్టీపీ నేత వైఎస్ షర్మిల ఇక్కడ పొంగులేటికి మద్దతు పలికారు. 1962నుంచి 15సార్లు పాలేరులో ఎన్నికలు జరుగగా 11సార్లు ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఖమ్మం జిల్లా నుంచి బీఆరెస్‌కు ఒక్క సీటు కూడా దక్కనివ్వమని ప్రకటించిన పొంగులేటి పోటీతో ఈ నియోజకవర్గం ఎన్నిక ఆసక్తి రేపుతున్నది.
ఖమ్మంలో తుమ్మల గెలిచేనా!
బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను ఢీ కొడుతున్నారు. ఇక్కడ 2014లో కాంగ్రెస్ నుంచి అజయ్‌కుమార్ టీడీపీ అభ్యర్థి తుమ్మలపై 5,682ఓట్లతో గెలిచారు. 2018లో బీఆరెస్ అభ్యర్థిగా అజయ్ టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావుపై 10,991ఓట్లతో గెలుపొందారు. ఈ దఫా కేసీఆర్‌ను సవాల్ చేసిన తుమ్మల తన గెలుపు కోసం ప్రతిష్ఠాత్మకంగా పోరాడుతున్నారు.
కొల్లాపూర్‌పై జూపల్లి కన్ను
గత ఎన్నికలలో బీఆరెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరడంతో ఇక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కొల్లాపూర్‌లో 1999 నుంచి 2014 వరకు ఇండిపెండెంట్‌గా, కాంగ్రెస్ నుంచి, బీఆరెస్ నుంచి మొత్తం వరుసగా 5 సార్లు గెలిచిన జూపల్లి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ మంత్రివర్గాల్లో పనిచేశారు. 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఆ ఎన్నికలలో జూపల్లిపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసి బీరం హర్షవర్ధన్‌రెడ్డి గెలిచాక బీఆరెస్‌లో చేరిపోయారు. కేసీఆర్ తనను చిన్నచూపు చూస్తున్నారన్న అసంతృప్తితో జూపల్లి కాంగ్రెస్‌లో చేరి ఎన్నికల బరిలో నిలిచి మరోసారి బీరంతో తలపడుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఎల్లెని సుధాకర్‌రావు పోటీలో ఉన్నారు. అయితే ‘బర్రెలక్క’గా పేరొందిన యూట్యూబర్ శిరీష ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ తెలంగాణలో నిరుద్యోగ సమస్యను ప్రధానంగా ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడంతో ఈ నియోజకవర్గం కూడా రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.
పాలకుర్తిలో పసికూనతో ఎర్రబెల్లి పోటీ
పాలకుర్తిలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని నేతగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుపై రాజకీయ పసికూన 26 ఏళ్ల ఎన్నారై అమ్మాయి మామిడాల యశస్విని రెడ్డి పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గం ఎన్నిక కూడా ప్రధానంగా మారింది. మహబూబ్‌నగర్ జిల్లాలో పుట్టి హైదరాబాద్‌లో పెరిగి వివాహం అనంతరం అమెరికా వెళ్లి అక్కడ కుటుంబ వ్యాపారాలు చూసుకుంటున్న 26 ఏళ్ల యశస్విని అనూహ్యంగా పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు.
అత్త హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అమెరికాలో స్థిరాస్తి వ్యాపారంలో రాణించి పాలకుర్తి సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ధార్మిక కార్యక్రమాలు చేపడుతుండేవారు. ప్రజలకు మరింత సేవ చేయడానికి ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే ఆమెకు భారత పౌరసత్వం రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆమె కోడలు యశస్విని రెడ్డికి పాలకుర్తి టికెట్ ఇచ్చింది.
1994 నుంచి 2009 వరకు వర్ధన్నపేటలో తెలుగుదేశం పార్టీ నుంచి మూడుసార్లు గెలిచిన ఎర్రబెల్లి 2008లో బీఆరెస్ ఎంపీలు రాజీనామాలు చేసినప్పుడు వచ్చిన ఉప ఎన్నికలలో వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలిచి ఎంపీగానూ పనిచేశారు. 2009 డీలిమిటేషన్ తరువాత వరంగల్ లోక్ సభ స్థానం ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారింది. ఆ సమయంలో ఎర్రబెల్లి పాలకుర్తి అసెంబ్లీ స్థానానికి మారి 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలోనూ ఆయన టీడీపీ నుంచే పోటీ చేసి పాలకుర్తిలో గెలిచారు.
అనంతరం 2016లో బీఆరెస్‌లో చేరిన ఆయన 2018లో బీఆరెస్ టికెట్‌తో పోటీ చేసి గెలిచారు. కేసీఆర్ మంత్రి వర్గంలో ఉన్న ఆయన ఈ ఎన్నికలలో మళ్లీ బీఆరెస్ అభ్యర్థగా పోటీ పడుతుండగా, రాజకీయ పసికూనగా భావిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి గట్టి పోటీ ఇస్తున్నారు. గెలిచాక పాలకుర్తిలోనే ఉండి ప్రజలకు సేవ చేస్తానని.. మళ్లీ అమెరికా వెళ్లేది లేదని ఆమె తన ప్రచార ఉపన్యాసాలలో చెబుతూ ఎర్రబెల్లిపై పదునైన విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. బీజేపీ నుంచి ఇక్కడ లేగ రామ్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు.