కాంగ్రెస్‌ మూర్ఖత్వం వల్లే బీహార్‌లో ఇండియా కూటమి విచ్ఛిన్నం

బీహార్‌లో ఇండియా కూటమి విచ్ఛిన్నం కావడానికి కాంగ్రెస్‌ పార్టీ మూర్ఖత్వమే కారణమని జేడీయూ ఆరోపించింది. ఆ పార్టీ నాయకులు వారి పార్టీని బలోపేతం

  • Publish Date - January 28, 2024 / 03:24 PM IST

పార్టీ బలోపేతానికే కాంగ్రెస్‌ ప్రయత్నాలు

కూటమి నాయకత్వాన్ని స్వాధీనం చేసుకునే కుట్ర

జేడీయూ నేతలు కేసీ త్యాగి, రజిబ్‌ రంజన్‌ విమర్శ

పాట్నా : బీహార్‌లో ఇండియా కూటమి విచ్ఛిన్నం కావడానికి కాంగ్రెస్‌ పార్టీ మూర్ఖత్వమే కారణమని జేడీయూ ఆరోపించింది. ఆ పార్టీ నాయకులు వారి పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు తప్పించి ప్రతిపక్ష కూటమిని కాదని విమర్శించింది. కాంగ్రెస్‌లోని ఒక ముఠా ఇండియా కూటమి నాయకత్వాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నదని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి ఆరోపించారు. కుట్రలో భాగంగానే మల్లికార్జున ఖర్గే పేరును కూటమి చైర్మన్‌ పదవికి ప్రతిపాదించారని అన్నారు. జేడీయూ మరో అధికార ప్రతినిధి రజిబ్‌ రంజన్‌ కాంగ్రెస్‌పై మరింత తీవ్ర స్థాయిలో విమర్శల దాడి చేశారు. రాహుల్‌ను టార్గెట్‌గా చేసుకున్న రజిబ్‌.. ఎలాంటి అనుభవం లేని, ప్రతిపక్ష కూటమికి నష్టం చేసే వ్యక్తిని ప్రధానిని చేయాలని ప్రయత్నించడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ కూటమిని ముంచిందని ఆరోపించారు.


కాంగ్రెస్‌ పార్టీని ఆయన భస్మాసురుడితో పోల్చారు. తిరిగి ఎన్డీయేలోకి జేడీయూ వెళ్లడం నితీశ్‌ అవకాశవాదానికి నిదర్శనమని కాంగ్రెస్‌ చేసిన ఆరోపణను తిప్పికొట్టిన కేసీ త్యాగి.. కాంగ్రెస్‌ పార్టీ మూర్ఖత్వం వల్లే ఇండియా కూటమి పట్టాలు తప్పిందని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో సీట్ల కోసం ఒక పద్ధతి లేకుండా డిమాండ్‌ చేయడం ద్వారా వాటి ప్రాంతాలను ఆక్రమించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించిందని ఆరోపించారు. తామేదో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలమైనట్టు భారత్‌ జోడో న్యాయ్‌యాత్రలో పాల్గొనాలని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీని, బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ను కాంగ్రెస్‌ ఆదేశించిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ తాను బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఇతర భాగస్వామ్య పక్షాలకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రధాని మోదీ వంటి జనాకర్షక నేత నాయకత్వంలోని క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న బీజేపీని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమికి తగిన దృష్టికోణం లేదని విమర్శించారు.